పత్రికలు పత్తిత్తులా?

హైదరాబాద్: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మీద, అధికార కాంగ్రెస్ మీద ఆంధ్రజ్యోతి పత్రికలో వస్తున్న ధర్మాగ్రహాలు చదువరులకు చక్కగా ఉన్నాయి. ప్రజల పక్షం వహించి పాలకుల మీద అక్షర యుద్ధం చేసినంత వరకు ఆంధ్రజ్యోతిని అభినందించక తప్పదు.

కానీ ఇప్పుడేమిటి? వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వం, వ్యవహార శైలి గురించి ఇప్పుడు రాయడమా? రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అవినీతి మయమే కావచ్చు. నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతే ప్రవహించవచ్చు. ఎన్నికల ముందు వైఎస్ ప్రభుత్వం మీద ఈ సిరీస్ ప్రారంభించడం దేనికి సంకేతం? చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో, ఆయన కను సన్నలు చేసిన వారి పెట్టుబడులతో తిరిగి ప్రారంభమైన పత్రిక ఈ రోజు నీతులు వల్లించడమా?

అధికార పార్టీని పరోక్షంగా ప్రస్తుతిస్తూ సమాచార శాఖ "చెయ్యి" పెద్దది చేసి విడుదల చేసిన యాడ్స్ లో లబ్ది పొందిన పత్రికల్లో ఆంధ్రజ్యోతి కూడా ఉంది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న ఈ పత్రిక ఆ ప్రభుత్వ ప్రకటనలను తిరస్కరించి ఉండాల్సింది. నైతికంగా ఆలోచిస్తే ఆ పత్రిక ఆ పని చేయాలి. ఒక వైపు ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుంటూ మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి సిరీస్ లను ప్రచురించడం ఎంత వరకు సబబు?

ఎవరు సైకిళ్ళ మీద తిరిగారో, ఎవరు పుట్టగానే కార్లలో తిరిగారో అన్నది ఇప్పుడు అనవసరం. వార్తాహరులుగా రాజకీయ నాయకులతో రాసుకుని పూసుకుని తిరిగిన వారు చాప కింద నీరులా విస్తరిస్తున్నారు. తమకొక నీతి, ఇతరులకు ఒక నీతి అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్న ఇటువంటి వారిని జనం గుర్తించగలరు. కాకపోతే కొంచెం సమయం పడుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కీలకపాత్ర వహించారో, వాళ్ళు ఈనాడు ఒక పత్రిక ముసుగును అడ్డు పెట్టుకుని వ్యవహరిస్తున్నారో కొందరికైనా బాగా తెలుసు.

"సాక్షి" పత్రికలో ఇప్పుడు స్వార్ధ ప్రయోజనాలు ఆశించి పెట్టుబడి పెట్టినవారికి పత్రికా స్వేచ్చ మీద నమ్మకం ఉందని అనుకోలేం. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు "ఆంధ్రజ్యోతి"లో పెట్టుబడి పెట్టిన వారిదీ అదే ధోరణి. పత్రికా స్వేచ్చ అన్నది ఈ నేపధ్యంలో కేవలం మిధ్య. ఇక్కడ, అక్కడ ప్రవహిస్తున్నది అక్రమాల వరద, బురద. ఆ బురద పూసుకుని కన్పించండి, మళ్ళీ మీ పాత ముఖాలు మాకెందుకు చూపిస్తారు?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+