పెళ్లికి ముందు సెక్స్ పై గోల

చట్టం వేరు, సంప్రదాయాలు వేరు అనే మధ్యేవార్గ వాదులు కొందురు ఉండగా, శ్రీకృష్ణుడికీ గోపికలకూ ఉన్న సంబంధంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతున్న సంప్రదాయవాదులూ ఉన్నారు. సహజీవనం చట్టవ్యతిరేకం కాకపోయినప్పటికీ తాము దాన్ని అంగీకరించబోమని బిజెపి సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడు అన్నారు. భారత సంప్రదాయం పెళ్లికి ముందు సెక్స్ ను, పెళ్లి కాకుండా సహజీవనాన్ని అనుమతించదని ఆయన అంటున్నారు. పాశ్చాత్య సంప్రదాయాలను భారత సంప్రదాయాల మీద రుద్దడం సరికాదని ఆయన వాదన.
నిజానికి, చట్టాల కన్నా సామాజిక నియమాలే భారత సమాజంలో బలమైనవి. ఒకప్పుడు బాల్యవివాహాలను బ్రిటిష్ హయాంలో నిషేధించినా అవి కొనసాగుతూ వచ్చాయి. ఇప్పుడు వరకట్నాన్ని నిషేధించినా అది యధేచ్ఛగా కొనసాగుతూనే వస్తున్నది. అయితే సంప్రదాయాలు కూడా మారుతూ ఉంటాయి. భారత సమాజం పాశ్చాత్య సంస్కృతితో ఇతోధికంగా ప్రభావితమవుతూ వస్తున్నది. పెళ్లిళ్లను నిరాకరించడం, సహజీవనం చేయడం వంటి పద్ధతులు అక్కడక్కడా కొనసాగుతూనే వస్తున్నాయి. పెళ్లిళ్లను రద్దు చేసుకోవడం, రెండో వివాహం చేసుకోవడం ఉన్నత వర్గాల్లో ఒక మామూలు విషయంగా మారిపోయింది. తెలుగు సినీ రంగంలో ఇంకా బయటకు రాలేదు గానీ హిందీ సినీ రంగంలో అటువంటి పద్థతులు బహిరంగంగానే కొనసాగుతున్నాయి. సంపన్న వర్గాల్లో కూడా అది జరుగుతూనే ఉన్నది. అయితే కష్టమల్లా మధ్యతరగతి వాడికే. సంప్రదాయాలకు, విలువలకు కట్టుబడి ఉండాలనే వర్గం సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు తీవ్రంగా కదిలిపోయి ఉంటుంది.
ఇక, శ్రీకృష్ణుడికీ గోపికలకూ ఉన్న సంబంధాన్ని భౌతిక విషయంగా చూడకూడదని, అది అలౌకికమైందని ప్రముఖ నృత్యకారిణి శోభానాయుడి లాంటి వారు అంటున్నారు. భగవంతుడిని భౌతిక ప్రపంచం మీదికి తీసుకురావడం వారికి నచ్చడం లేదు. అయితే, స్త్రీ స్వేచ్చ గణనీయంగా పెరిగి సామాజిక బాధ్యతలను కూడా నెత్తిన వేసుకున్న తర్వాత ఇటువంటి ఘర్షణలు తప్పవు. పురుషుడికి అన్ని విధాల వెసులుబాట్లు (చాటుగానో, బహిరంగంగానో) స్త్రీని ఇంకా పాత కాలంలో మాదిరిగానే ఉండాలనే మానసిక స్థితి నుంచి బయటపడితే తప్ప దాన్ని మనం అర్థం చేసుకోలేం.












Click it and Unblock the Notifications