బాలకృష్ణ ఎన్టీఆర్ కు సాటి వస్తారా?

తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతిలోకి వచ్చిన తర్వాత దాని మాస్ ఇమేజ్ పోయి, కార్పొరేట్ పద్ధతి అమల్లోకి వచ్చింది. మాస్ ఇమేజ్ ఉన్న బాలకృష్ణ పార్టీ నాయకత్వ బాధ్యతలు తీసుకునే పరిస్థితిలో లేరు. తన బావ, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని తిరిగి అధికారంలోకి తేవడానికి మాత్రమే ఆయన పని చేయాల్సి వస్తోంది. తెలుగుదేశం పార్టీలో నెంబర్ వన్ స్థానం బాలయ్యకు దక్కడం కలలో కూడా జరగదనేది స్పష్టం. అందువల్ల బాలకృష్ణకు ఎన్టీఆర్ రాజకీయ వారసత్వం దక్కదనేది అర్థమై పోతూనే ఉన్నది. ఎన్టీ రామారావుకు ఉన్న పట్టుదల, మొండితనం బాలకృష్ణకు లేవు. అంత మాస్ అపీల్ గానీ, సామాజిక అవగాహన గానీ ఆయనకు లేదని చెప్పవచ్చు. ఎన్టీఆర్ పేరు మీద ఆయన బావ కోసం రాజకీయ ప్రసంగాలు చేయాల్సిందే, ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిందే. మిగతా ఎన్టీ రామారావు కుమారులు గానీ మనవళ్లు గానీ ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని అంది పుచ్చుకునే స్థితిలో లేరు. జూనియర్ ఎన్టీఆర్ కొంత అపీల్‌కు పనికి వచ్చినా, ప్రసంగ పాటవాన్ని పట్టుకున్నా ఆయన కూడా చంద్రబాబుకు ఉపయోగపడాల్సిందే.
ఇకపోతే, సినీ రంగంలో కూడా ఎన్టీ రామారావుకు బాలకృష్ణ సాటి వస్తారని చెప్పలేం. ఎన్టీఆర్ స్థాయి హావభావ ప్రకటన, నటనా వైదుష్యం, వాచక ప్రతిభ బాలకృష్ణకు లేవు. ఎన్టీ రామారావు కేవలం మాస్ అపీల్ పాత్రలనే కాకుండా డీగ్లామరైజ్డ్ పాత్రలు కూడా పోషించారు. అవిటివాడిగా, ముసలివాడిగా నటించిన సందర్భాలున్నాయి. విభిన్న పాత్రలను పోషించి తెలుగు ప్రజల మనసులు దోచుకున్నారు. ఎన్టీ రామారావు పౌరాణిక పాత్రల గురించి చెప్పనే అవసరం లేదు. పౌరాణిక పాత్రల పోషణలో ఎన్టీ రామరావును మించిన నటుడు లేడు. వచ్చే అవకాశం కూడా లేదు. వేషంలో కొంత మేరకు బాలయ్య గానీ జూనియర్ ఎన్టీఆర్ సరిపోతారేమో గానీ ఎన్టీఆర్‌లా ప్రజలను మెప్పించలేరు. అందులో ఎన్టీఆర్ శ్రమ, విజ్ఞాన సముపార్జన, పురాణాల ఆకళింపు వంటి పలు అంశాలు ఇమిడి ఉన్నాయి. ఈ విషయాల్లో బాలయ్య ఎన్టీఆర్ దరిదాపుల్లోకి కూడా రాలేరు. ఏమైనా, ఎన్టీఆర్‌కు కుటుంబ వారసులు మాత్రమే ఉంటారు తప్ప రాజకీయ, సినీ వారసులు ఉండడం అనేది సాధ్యమయ్యే పని కాదనే అనిపిస్తోంది.












Click it and Unblock the Notifications