ఆ ఒక్కటి తప్ప!: మావల్ల కాదంటున్న తండ్రులు.. 'పేరెంటింగ్'పై సర్వేలో ఏం తేలిందంటే..
కేవలం 12శాతం మంది తండ్రులు మాత్రమే పిల్లలను బయటకు తీసుకెళ్లగలం అని చెప్పడం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
Recommended Video

హైదరాబాద్: ఒక్క రోజు భార్య ఇంట్లో లేకపోతేనే భర్త గారికి ఏమి తోచదు. పొద్దున బ్రేక్ ఫాస్ట్ దగ్గరి నుంచి పిల్లలను రెడీ చేసి స్కూలుకు పంపి, ఆపై ఆఫీసుకెళ్లి.. తిరిగొచ్చి మళ్లీ వంట చేసి పిల్లలకు తినిపించి నిద్రపుచ్చేసరికి నిజంగానే దిమ్మతిరిగి పోతుంది.
సతీమణి చకచకా చక్కబెట్టే ఈ పనులన్ని భర్త గారు మాత్రం ఆపసోపాలు పడుతూ చేస్తుంటాడు. ఒకవేళ భార్య తోడు లేకుండా పిల్లలను వెంట తీసుకెళ్లాల్సి వస్తే!.. తాజాగా నిర్వహించే ఓ సర్వేలో కొంతమంది పురుషులను ఇదే ప్రశ్న అడగ్గా.. హమ్మో మావల్ల కాదంటూ చేతులెత్తేశారు.

మావల్ల కాదు:
సర్వేలో దాదాపు 88శాతంమంది తండ్రులు భార్య తోడు లేకుండా పిల్లలను బయటకు తీసుకెళ్లలేమని కుండబద్దలు కొట్టారు. షాపింగ్, సినిమా హాళ్లు, ఫంక్షన్లలో పిల్లలు చేసే అల్లరిని భరించడం, మారాం చేస్తే బుజ్జగించడం ఇవన్నీ తమవల్ల కాదంటున్నారు.

పొడార్ ఇనిస్టిట్యూట్ సర్వే:
ముంబైకి చెందిన పొడార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ సర్వే నిర్వహించింది. మొత్తం 4800 మంది తండ్రులపై సర్వే నిర్వహించగా, వారిలో 33శాతంమంది ఇంటి పనులను పంచుకుని, పిల్లలతో హోం వర్క్ చేయిస్తున్నట్టు తేలింది.

పిల్లలతో గడపడానికి:
70శాతం మంది తండ్రులు ఆఫీసు ప్రయాణాన్ని తగ్గించుకుని పిల్లలతో గడపడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. 65శాతం మంది తండ్రులు ప్రతీరోజు కనీసం రెండు, మూడు గంటలు పిల్లలతో గడుపుతున్నారని తేలింది. చాలామంది తండ్రులు తమ పిల్లల చదువులు, ఆసక్తులు గమనిస్తున్నారని సర్వే పేర్కొంది.

12శాతం మంది మాత్రమే:
పిల్లలకు సంబంధించిన విషయాల్లో తండ్రులు చురుగ్గానే ఉంటున్నప్పటికీ.. ఒక్క విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు. పిల్లలను బయటకు తీసుకెళ్లడం తమవల్ల కాదంటే కాదంటున్నారు.
కేవలం 12శాతం మంది తండ్రులు మాత్రమే పిల్లలను బయటకు తీసుకెళ్లగలం అని చెప్పడం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అటు తల్లులు సైతం భర్తల సహకారం పూర్తిగా ఉండటం లేదని ఫిర్యాదు చేస్తున్నారు.
ఏదేమైనా గతంతో పోలిస్తే పిల్లల సంరక్షణలో తల్లిదండ్రులు భాగం పంచుకోవడం మంచి పరిణామని పిల్లల సంరక్షణ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా.స్వాతి పొపాత్ అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications