క్యారికేచర్ మాంత్రికుడు ఆర్టిస్ట్ శంకర్ తో ఇంటర్వ్యూ.. (ఫోటోలు)

శంకర్ బొమ్మ : తేరిపార చూసిన చిరంజీవి.. కేసీఆర్ ఏమనుంటారు! (ఫొటోలు)

పుట్టుక మనిషికో నేపథ్యాన్ని ఇస్తుంది.

పుట్టుక మనిషికో నేపథ్యాన్ని ఇస్తుంది.

పుట్టుక మనిషికో నేపథ్యాన్ని ఇస్తుంది. తరాల నాటి వృత్తాంతంలో నిన్నూ ఓ సామాన్యుడిగానే కల కంటుంది. వెంబడించే నిరర్థకతకు లొంగిపోయినోడు.. పాత గీత మీదే.. కొత్త ప్రయాణం మొదలుపెడుతాడు. మూస నుంచి పక్కకెళ్లి.. అనుభూతి ప్రధానంగా సాగిపోయేవాడు.. పాత గీత పక్కన్నే ఇంకో కొత్త గీత గీస్తాడు.. దానికి కొన్ని రంగులు అద్దుతాడు.. కళగా రూపాంతరం చెందుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ది గ్రేట్ క్యారికేచరిస్ట్ 'శంకర్' లాగా..

ఆయన గీసిన బొమ్మల్ని చూడటం ఒక అనుభూతి. బొమ్మంటే బొమ్మేనా!.. ఆ బొమ్మలోనే వారి వారి జీవితాల్ని, వ్యక్తిత్వాన్ని చూపించడం శంకర్ కే సాధ్యమైన స్టైల్..

ఆయనెంత డౌన్ టూ ఎర్త్ గా ఉంటారో తెలియాలంటే.. నాగిరెడ్డి పల్లె నుంచి వరల్డ్ ప్రెస్ క్లబ్ అవార్డు దాకా ఆయన క్యారికేచర్ల ప్రయాణం ఎలా సాగిందో తెలియాలంటే..? ఆయన మాటల్లోకి వెళ్లాల్సిందే..

బాల్యమంతా అక్కడే

బాల్యమంతా అక్కడే

పుట్టింది నాగిరెడ్డి పల్లె, నల్గొండ జిల్లా. మూడో తరగతి దాకా అక్కడ్నే చదువుకున్నా. ఆ తర్వాత హుజుర్ నగర్ లో 9వ తరగతి దాకా.. ఇక టెన్త్, ఇంటర్ మిర్యాలగూడలో.

ఫస్ట్ గీసిన కార్టూన్

ఫస్ట్ గీసిన కార్టూన్

హహహ..( చిన్నగా నవ్వు).. ఫస్ట్ కార్టూన్ కథ కొంచెం గమ్మత్తుగానే ఉంటది. నాకు గుర్తున్నంత వరకు 87,88ల్లో అనుకుంటా ఫస్ట్ కార్టూన్ గీసింది. అప్పుడు మా మేనల్లుడు శాంతి నికేతన్ పబ్లిక్ స్కూల్లో జాయిన్ అయిండు. అయితే.. వాడు ఒక్క స్కూల్లో కూడా స్థిరంగా లేడు. ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్.. అట్లా మూడు నాలుగు స్కూల్స్ మారిండు.

ఇంకోటేందంటే.. స్కూల్ మారినప్పుడల్లా యూనిఫామ్ మారుతది. స్కూల్ స్కూల్ కో డ్రెస్. అప్పుడపించింది.. యోగి వేమన స్కూల్ లాంటిది ఒకటుండి ఉంటే..! ఆ పేరుకు తగ్గట్లే స్కూల్ కు వచ్చే పిల్లలంతా.. అంగీ ఉంటే లాగు లేకుండా, లాగుంటే అంగీ లేకుండా స్కూల్ కు వెళితే..! ఇదే ఆలోచన ఫస్ట్ కార్టూన్ కు అదే జీవం పోసింది. పిల్లలంతా నేక్డ్ (నగ్నంగా) గా స్కూల్ కు వెళ్లే బొమ్మ గీసిన.. (మొహంలో ముసి నవ్వు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది).

బొమ్మలేయడానికి ఎవరో ఒకరు inspiration ఉంటారు కదా! అలా మీకెవరైనా?

బొమ్మలేయడానికి ఎవరో ఒకరు inspiration ఉంటారు కదా! అలా మీకెవరైనా?

అప్పట్లో..శ్రీధర్ కార్టూన్స్, ప్రకాశ్ శెట్టి కార్టూన్స్ఫాలో అయేవాడిని.దాంతో పాటు నల్గొండలో జరిగే ప్రతీ లిటరరీ మీటింగ్ కు హాజరయేవాడిని. మరోపక్క సైన్ బోర్డులు గీసే పని.. ఎస్.ఎఫ్.ఐ పోస్టర్లు కూడా గీస్తుండేది. ఇప్పుడు ఆలోచించుకుంటే.. ఇవన్నీ నా మీద ప్రభావం చూపాయనే అనిపిస్తుంది.

సైన్ బోర్డు ఆర్టిస్ట్ లకు చేత కాదన్నరు!

సైన్ బోర్డు ఆర్టిస్ట్ లకు చేత కాదన్నరు!

సైన్ బోర్డు ఆర్టిస్ట్ లకు బొమ్మలు గీయరాదన్న అభిప్రాయం అప్పుడు చాలా మందిలో ఉండేది. దీన్ని బ్రేక్ చేయడానికి నేనేం చేసేదంటే.. లిటరరీ మీటింగ్స్ కరపత్రాల్లో కవుల బొమ్మలు గీయడం కూడా మొదలుపెట్టినా.. నా బొమ్మలకు అది కూడా ఒక పునాది లాంటిదే.

మోహన్ సార్.. రామ్మూర్తి సార్ ప్రోత్సాహం.

మోహన్ సార్.. రామ్మూర్తి సార్ ప్రోత్సాహం.

మోహన్ సార్ వామపక్షాలతరుపున పనిచేస్తుండేవారు. ఆయనతో కలిసి పనిచేయాలని ఉండేది నాకు. మోహన్ లాగే చిత్ర గారి బొమ్మలు కూడా ఫాలో అయ్యేవాడిని, గీత విజ్ణాన్ స్కూల్లో రామ్మూర్తి సార్ అని ఒకాయన ఉండేది. బొమ్మలు గీయడానికి ఆయన కూడా చాలానే ప్రోత్సహించారు.

అమ్మేచ్యూర్ ఆర్టిస్ట్ అసోసియేషన్..

అమ్మేచ్యూర్ ఆర్టిస్ట్ అసోసియేషన్..

నల్గొండ క్లాక్ టవర్ దగ్గర Ammatuer Artist Association ఒకటి ఏర్పాటు చేసుకున్నం. దాని తరుపున కూడా చాలా రోజులు పనిచేసిన. అదే టైమ్ లో దశరథ్ కుమార్ ఫోటోగ్రఫీతో పరిచయం.. గొప్ప ఫోటోగ్రాఫర్.. ఆయన వల్ల ఓసీ ఎడ్వర్డ్స్ లాంటి ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ల వర్క్ చూసే అవకాశం కూడా వచ్చింది. ఎడ్వర్డ్స్ వైల్డ్ ఫోటోగ్రఫీ ఎంత అద్భుతంగా ఉండేదంటే.. సూపర్బ్.

మళ్లీ పోస్టర్ల దగ్గరికి..

మళ్లీ పోస్టర్ల దగ్గరికి..

ఎస్.ఎఫ్.ఐతరుపున చాలా బొమ్మలు గీశాను. గీయడం ఒకటే కాదు.. వాటిని పాపులర్ ఏరియాల్లో అతికుంచుకోవడానికి మా మధ్య మాకే పోటీ ఉండేది. జనం ఎక్కువగా తిరిగే ఏరియాల్లో అతికిస్తే.. ఎక్కువ మంది దృష్టిలో పడొచ్చు కదా.. అప్పుడట్లా ఉండేది..

చదువు గురించి..

చదువు గురించి..

కామర్స్ చదివితే బ్యాంక్ ఎంప్లాయ్ అవొచ్చన్న స్పృహ తప్ప ఇంకొకటి లేదు. నాకేమో కామర్స్ అంటే మైండ్ బ్లాంక్ అయ్యేది. ఎన్నిసార్లు విన్నా.. చదివినా.. ముక్క అర్థం కాకపోయేది. మొత్తానికి బోర్డర్ లో పాస్ అయినా బీ.కామ్..

కార్టూన్ కార్నర్

కార్టూన్ కార్నర్

నేను డిగ్రీ చదివే రోజుల్లో మా కాలేజీలో నోముల సత్యనారాయణ సార్ లెక్చరర్ గా ఉన్నారు. ఆయనే అన్నారు ఓ రోజు.. 'శంకర్ నువ్వు బొమ్మలు బాగానే గీస్తావు కదా, ఇప్పటి నుంచి మన కాలేజీలో ఆ పని చెయ్యి..' నోముల సార్ ఆ మాట అన్న తర్వాత రెచ్చిపోయి బొమ్మలు గీశాను.

కాలేజీలో 'కార్టూన్ కార్నర్' అని ఓ సెపరేట్ స్పేస్ ఉండేది. నల్గొండలో ఎక్కడ ఏం జరిగినా.. దాన్ని బొమ్మ రూపంలో కార్టూన్ కార్నర్ లో గీసేవాన్ని. అట్లా.. వారానికి 3,4 కంటే ఎక్కువ బొమ్మలు గీసిన సందర్బాలు కూడా ఉన్నాయి.

కడలి లిఖిత మాసపత్రిక..

కడలి లిఖిత మాసపత్రిక..

కాలేజీలో ఉన్న రోజుల్లోనే కడలి లిఖిత మాసపత్రిక అనేదాన్ని నడిపేవాళ్లం. అందులో వ్యాసాలు రాయడం.. వాటికి తగ్గట్లు బొమ్మలు గీసుకోవడం.. చేసేది. అయితే అందరూ గీసే స్టైల్ లో కాకుండా, సమ్ థింగ్ వెరైటీ ఉండాలన్న ఆతృతతో నేను బొమ్మలు గీసేవాన్ని.

శేఖర్ వెనకాల రెండేళ్లు..

శేఖర్ వెనకాల రెండేళ్లు..

అప్పటికీ నేను కార్టూన్లు గీస్తున్నా. అయితే సైజుల విషయంలో చిన్న చిన్న డౌట్స్ ఉండేవి.. శేఖర్ అప్పటికే చాలా యాక్టివ్. కార్టూన్ సైజుల గురించి శేఖర్ చెబితే తెలుసుకోవాలని ట్రై చేస్తే.. చదివేది మా కాలేజే అయినా ఆయన్ను కలవడానికి రెండేళ్లు పట్టింది.

ఇప్పుడనిపిస్తుంది.. సైన్ బోర్డు ఆర్టిస్ట్ గా పనిచేయడం.. ఏ బొమ్మను ఎంత సైజులో గీయాలన్న స్పృహను కల్పించింది. ఎందుకంటే.. సైన్ బోర్డు ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నప్పుడు.. నా దగ్గరికి చాలామంది వచ్చేవాళ్లు.ఎంతపెద్ద పెద్ద టైటిల్స్అయినా తక్కువ స్పేస్ లోకంపోజ్ చేయడంఅలవాటయింది.

అలా.. ఎంత పెద్ద టైటిల్ అయినా రెక్టాంగిల్స్, స్క్వేర్ లలో గీయడం అలవాటయింది. ఇప్పుడదే అనుభవం క్యారికేచర్స్ గీయడంలోను పనిచేస్తుంది.

అవార్డుల గురించి..

అవార్డుల గురించి..

అవార్డుల వెనుక పెద్ద కథనే ఉన్నది. (ఇక్కడ కొన్ని ఆఫ్ ది రికార్డు మాటలు) 2005 దాకా అసలు నాకు ఇంటర్నేషనల్ లెవల్ లో క్యారికేచర్ కాంపీటిషిన్స్ కు వెళ్లాలన్న ఆలోచనే లేదు. అయితే ఇక్కడ ఎదురైన కొన్ని అనుభవాలు.. అవి తలుచుకుని నేను బాధపడుతున్న సమయంలో.. నా భార్య ఓ సలహా ఇచ్చింది.

'ఇక్కడ మీకు అంత ఇబ్బందికర పరిస్థితులుంటే.. ఇంటర్నేషనల్ లెవల్ లో ట్రై చేయొచ్చు కదా!' అప్పటినుంచి ఇక ఇంటర్నేషనల్ కాంపిటీషిన్స్ మీదనే ఫోకస్ చేసినా. అలా.. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఫస్ట్ ఇంటర్నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న.

క్యారికేచర్ లో ఫస్ట్ ఇంటర్నేషనల్ అవార్డు గురించి..

క్యారికేచర్ లో ఫస్ట్ ఇంటర్నేషనల్ అవార్డు గురించి..

2005లో.. తాబ్రిజ్ ఇరాన్ కాంపీటిషిన్. కాన్సెప్ట్ ఏంటంటే.. సీ ఫుడ్ గురించి. 'ఐలాండ్ లో ఉండే ఓ పిల్లవాన్ని అక్కడినుంచి ఓ మైదాన ప్రాంతానికి తీసుకెళ్లడానికి కొంతమంది ప్రయత్నిస్తుంటారు. విమానం నిండా పిజ్జాలు, బర్గర్స్ ఉంటాయి. అయితే ఆ పిల్లవాడు మాత్రం అక్కడున్న ఓ కొబ్బరి చెట్టును గట్టిగా పట్టుకుని.. నేనక్కడి నుంచి రాలేనని గట్టిగా అరుస్తుంటాడు. కిందన్నీ తిని పారేసిన చేప ముళ్లులు..'

అసలు క్యారికేచర్ నే ఎందుకు ఎంచుకున్నారు?

అసలు క్యారికేచర్ నే ఎందుకు ఎంచుకున్నారు?

అదో కిక్కు నాకు.. అంతకుమించి అది నాకో బోర్ కొట్టని సబ్జెక్టు. ఒక విషయం చెప్పాలె.. ప్రతీ మనిషి మొహంలోను కొన్ని బ్యూటిఫుల్ క్వాలిటీస్ ఉంటాయి. వాటిని నేను ఈజీగా క్యాచ్ చేయగలుగుతా. మనిషిని చూసి అతని మొహం ఏ జంతువుతో సరిపోతుందో ఈజీగా చెప్పేయగలను. అలా చాలామంది క్యారికేచర్స్ గీసిన.

క్యారికేచర్ కు వెకిలి కళ అనే ముద్ర ఒకటుంది..

క్యారికేచర్ కు వెకిలి కళ అనే ముద్ర ఒకటుంది..

ఫారిన్ లో ముగ్గురు కార్టూనిస్టులు కలిసి ఓ క్యారికేచర్ గ్రూప్ ఫామ్ చేసుకున్నారు. వాళ్లు చేసే పనేంటంటే.. వాళ్ల దేశాధ్యక్షులబొమ్మలను జంతువుల తరహా క్యారికేచర్ లాగా గీస్తరు.ఆ క్యారికేచర్ పుస్తకాలను తిరిగి అదేఅధ్యక్షుల చేత ఆవిష్కరింపజేస్తరు. అది మన దగ్గర లేదు.. కళను కళగా గుర్తించే తీరులో మనవాళ్లు ఇంకాస్త ముందడుగు వేయాలేమో`!

అవును సార్.. ఇంట్లో వాళ్లు మిమ్మల్ని సపోర్ట్ చేసేవారా!

అవును సార్.. ఇంట్లో వాళ్లు మిమ్మల్ని సపోర్ట్ చేసేవారా!

అమ్మ సపోర్ట్ ఉండేది. నాన్నకు అసలు ఇష్టముండేది కాదు. ఆయనేం చెప్పేవారంటే.. 'టైలరింగ్ నేర్చుకో, లేదా ఏదైనా వృత్తి పని లాంటిది నేర్చుకో ఇంత పని దొరుకతది. బొమ్మలు గీస్తే కడుపులకొస్తదా..?' ఇలా ఉండేది మా నాన్న తీరు. అయితే అవేవి నేను పట్టించుకోలేదు.

నా బొమ్మలు పత్రికల్లో ప్రింట్ అవడం మొదలయ్యాక నాన్నలో కొంచెం మార్పు వచ్చినట్లు కనిపించింది. అయితే ఆ మార్పు నన్ను మెచ్చుకోవడం కాదు. నా పనిని విమర్శించకపోవడం..

మళ్లీ కాలేజ్ డేస్.. అప్పట్లో కల్చరల్ సెక్రటరీగా..

మళ్లీ కాలేజ్ డేస్.. అప్పట్లో కల్చరల్ సెక్రటరీగా..

అప్పట్లో.. నల్గొండలో 5 పార్టీల మీద ఇండిపెండెంట్ గా పోటీ చేసికల్చరల్ సెక్రటరీగా గెలిచిన. ఫ్రెండ్స్ తో కలిసి నాటకాలు వేసేవాన్ని. అప్పుడంతా ఓ జోరు.. (ఈ మాట చాలదా.. శంకర్ అప్పట్లో ఎంత యాక్టివో చెప్పడానికి)

ఆ సమయంలో.. కొన్ని గొడవలు కూడా కొంత డిస్టర్బ్ చేసినయ్..

జర్నలిజంలోకి ఎప్పుడొచ్చారు?

జర్నలిజంలోకి ఎప్పుడొచ్చారు?

1998లో వార్తలో కార్టూనిస్ట్ గా చేరిన.. అక్కడ నాలుగేళ్లు
తర్వాత జ్యోతిలో ఐదేళ్లు.. ఆ తర్వాత సాక్షిలో 2007 నుంచి.. అంటే, ఇప్పటికీ తొమ్మిదేళ్లు.. సాక్షిలోనే రిటైర్డ్ అవాలనుంది (సాక్షిలో శంకర్ కు దక్కిన గుర్తింపుకు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు)

జర్నలిజంలోకి అడుగుపెట్టడం కంటే ముందు!

జర్నలిజంలోకి అడుగుపెట్టడం కంటే ముందు!

నల్గొండ మిషనరీ స్కూల్లో కొన్ని రోజులు డ్రాయింగ్ టీచర్ గా పనిచేసిన. ఆ తర్వాత ఆల్ఫా పబ్లిక్ స్కూల్ లో.. డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తూనే.. సైన్ బోర్డులు రాసేవాన్ని. ఎలా ఉండేదంటే.. స్కూల్ అయిపోయాక ఇంటికొచ్చేటప్పటికీ ఇంట్లో మినిమమ్ పది వెడ్డింగ్ కార్డులు ఉండేవి.

వెడ్డింగ్ కార్డులు డిజైన్ చేయడం.. సైన్ బోర్డులు.. స్కూల్లో డ్రాయింగ్ క్లాసులు.. ( మూడింటినీ సమాంతరంగా బ్యాలెన్స్ చేయడం మామూలు విషయం కాదు కదా!). ఇంకొకటి.. అప్పట్లో మా స్కూల్ లో చదివే ప్రతి పిల్లవాడి పుస్తకం మీద నేను గీసిన క్యారికేచర్ ఉండేది. అలా.. ఆరోజుల్లోనే.. 2వేలకు పైగా క్యారికేచర్స్ గీసిన.

ఫస్ట్ ఎగ్జిబిషన్ గురించి :

ఫస్ట్ ఎగ్జిబిషన్ గురించి :

నా ఫస్ట్ ఎగ్జిబిషన్ ప్లాన్ చేసింది సుంకిరెడ్డి సార్. ఓరోజు నన్ను పిలిచి.. 'శంకర్ నీ క్యారికేచర్స్ అన్నీ తీసుకునిరా.. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేద్దాం'

నల్గొండలైబ్రరీలో ఎగ్జిబిషన్.. అయితే అక్కడో విచిత్ర అనుభవం.. నేను గీసిన బొమ్మల్లో మా ఫ్రెండ్స్ వి కూడా చాలానే ఉన్నయి. ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరు,'పళ్లు మరీ ఇంత ఎత్తుగా గీస్తావా', 'ముక్కు ఇలా గీస్తావా?'ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణంతో..వాళ్ల బొమ్మను వాళ్లే తీసి జేబులో పెట్టుకుని వెళ్లిర్రు. (హహ.. ఏం అనలేం కదా!) వాళ్లకది చిన్నతనంగా అనిపించి ఉండొచ్చేమో!

హైదరాబాద్ వచ్చేముందు నాన్నతో గొడవ

హైదరాబాద్ వచ్చేముందు నాన్నతో గొడవ

హైదరాబాద్ వచ్చేముందు నాన్నతో పెద్ద గొడవే జరిగింది. నల్గొండను విడిచి హైదరాబాద్ పోనే పోవద్దనిసీరియస్ అయిండు.ఆయన బాధ ఏందంటే.. నాకప్పటికే ఎయిడెడ్ పోస్ట్ కూడా కన్ఫర్మ్ అయింది. ఉన్న ఊళ్లో పనిచేసుకుంటూ హాయిగా ఉండక.. ఎక్కడికో పోయి తిప్పలు పడుడెందుకు? అనేవాడు నాన్న.

నాన్న ఎంత వద్దన్నా.. నేను మాత్రం హైదరాబాద్ వచ్చేశాను.

వరల్డ్ ప్రెస్ క్లబ్ గ్రాండ్ ప్రీ అవార్డు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు!

వరల్డ్ ప్రెస్ క్లబ్ గ్రాండ్ ప్రీ అవార్డు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు!

నా జీవితంలో నేనెప్పటికీ మరిచిపోలేని రోజు అది. అవార్డు వచ్చిందని వాళ్ల నుంచి ఫోన్ వచ్చాక.. అంతా ఒక ట్రాన్స్ లోకి వెళ్లినట్లే ఉండేది.. 'ఎట్లయిందంటే.. నేను విమానం ఎక్కి,లిజ్బన్ ఎయిర్ పోర్ట్ లో దిగినంక గానీ ఆలోచించలేదు.. కనీసం అక్కడ దిగాక ఎవరిని సంప్రదించాలి.. ఎవరికి ఫోన్ చేయాలి.. అసలెలా..? ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి పంపిస్తే.. విమానమెక్కి అక్కడ వాలిపోయాను. ఇవేవీ ఆలోచించలేదు. అవార్డు రావడం.. నామీద అంత ప్రభావం చూపింది.

అవార్డు అందుకున్నాక.. వాళ్లిచ్చిన ఆతిథ్యం మరువలేనిది. నా భార్యను కూడా తీసుకుని వెళ్లానప్పుడు. చాలా బాగుందక్కడ.. వాళ్లిచ్చిన విందు.. ఆ తర్వాత మ్యూజికల్ నైట్..

వివాదాలేమైనా..

వివాదాలేమైనా..

ఉన్నాయి. (ఆఫ్ ది రికార్డ్ ఎక్కువున్నాయి) చలం కుర్చీలో కూర్చుని ఉన్నప్పుడు ఆయన మీద కాకి వాలిన క్యారికేచర్ ఒకటి గీసిన. కొన్ని రోజుల తర్వాత నాకో ఉత్తరం వచ్చింది. అసలు.. అలాంటి కుర్చీలో చలం ఎప్పుడు కూర్చోలేదని. నేనెంత పకడ్బందీగా ఉంటానంటే.. ఒక బొమ్మ గీసేముందు.. ఖచ్చితంగా కొంత పరిశోధన చేస్తా.. దాని పుట్టు పూర్వోత్తరాలు మొత్తం తెలుసుకున్నాకే క్యారికేచర్ మొదలుపెడుతా.

చలం విషయంలో కూడా అలాగే చేసిన. నేను సేకరించిన చలం ఫోటోల్లో చలం కుర్చీలో కూర్చునే ఫోటో ఒకటుంది. అదే ఫోటోను సదరు విమర్శకుడికి పోస్ట్ చేసిన. మళ్లీ రిప్లై రాలే.

..... .... .....

అప్పట్లో నాకొక అలవాటు కూడా ఉండేది. సిటీలో ఎవరైనా సెలబ్రిటీ అడుగుపెడుతున్నారంటే.. వెంటనే తెలిసిపోయేది. వాళ్ల క్యారికేచర్స్ గీసేసి వాళ్ల ముందు ప్రత్యక్షమైపోయేవాన్ని. వాటిపై ఆటోగ్రాఫ్స్ తీసుకునేవాన్ని. అయితే నేనలా చేయడంపై.. కొంతమంది విమర్శలు చేయడంతో.. ఎందుకో నేను కూడా ఆ అలవాటు నుంచి డ్రాప్ అయిపోయిన.

ఇప్పుడెలా సాగుతోంది వర్క్..

ఇప్పుడెలా సాగుతోంది వర్క్..

ఆఫీస్ కు వెళ్లేదాకా క్యారికేచర్ వర్క్ చేసుకుంటా. ఆ తర్వాత ఐదింటికి ఆఫీస్ కు వెళ్లితే.. రాత్రి 11 వరకు అక్కడే..

చాలామంది అడుగుతుంటారు.. సెలబ్రిటీల క్యారికేచర్స్ గీయాలని.. వాళ్ల కుటుంబ వ్యక్తుల క్యారికేచర్స్ గీయమని.. మనీ ఆఫర్స్ చాలా ఉంటాయి. బట్.. నాకెందుకో కమర్షియల్ అవడం నచ్చలేదు. కళను కాపాడుకోవాలె. మరింత క్రియేటివిటితో వర్క్ చేయాలె. ఇప్పటికే క్యారికేచర్ మీద చాలా విమర్శలున్నాయి.

అంతర్జాతీయంగా క్యారీకేచర్ కు ఉన్న గుర్తింపు మన దగ్గర లేకపోవడానికి కారణం ఇక్కడంత చైతన్యం లేకపోవడమే. విమర్శలు వస్తూనే ఉంటాయి.. పట్టించుకోను.. ఎందుకంటే.. ఇక్కడినుంచి క్యారీకేచర్ ను ఇంకో స్టెప్ పైకి ఎక్కించడానికి ట్రై చేస్తున్నా. అది అర్థం చేసుకునే స్థితిలో అందరూ లేకపోవచ్చు.

-ఇంకేం అడగాలో తెలియక.. మొహాలు చూసుకుంటుంటే.. ప్రతాప్ సార్ అడిగారు.. 'ఎందుకు ప్రముఖ కార్టూనిస్టులంతా నల్గొండ నుంచే ఉన్నారు? అని.

సాహిత్యం కావచ్చు.. నల్గొండలో ఎక్కువగా జరిగే సాహిత్య మీటింగ్ లు కావచ్చు.. సాంస్కృతిక పరమైన వాతావరణం ఎక్కువగా ఉండేది. అయితే ఈ విషయం మీద నిజంగానే ఆలోచించాల్సి ఉందేమో..

ఎప్పటికీ మరిచిపోలేని కాంప్లిమెంట్..

ఎప్పటికీ మరిచిపోలేని కాంప్లిమెంట్..

నెల్సన్ మండేలా క్యారికేచర్ తో వరల్డ్ ప్రెస్ గ్రాండ్ ప్రీ అవార్డు అందుకున్నప్పుడు..! గొప్ప గొప్ప క్యారీకేచరిస్ట్స్ చాలామందే వచ్చారు. అప్పటికీ 20 దాకా ఇంటర్నేషనల్ అవార్డులున్నాయి నా ఖాతాలో. 120 ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకున్న ఓ బ్రెజిల్ ఆర్టిస్ట్ (పైన ఫోటోలో ఉన్న వ్యక్తి) దగ్గరికెళ్లి.. అప్రిషియేట్ చేశా.. అప్పుడాయన ఏమన్నారో తెలుసా?

'నేను కాదు సార్ గొప్ప..120 ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకున్నా.. నా ఖాతాలో వరల్డ్ ప్రెస్ అవార్డు లేదు, 20 అవార్డులకే మీరు వరల్డ్ ప్రెస్ అవార్డు గెలుచుకున్నారు. సో.. నాకంటే మీరే గ్రేట్..' ఈ మాటలు విన్నాక.. జీవితంలో ఇంతకంటే గొప్పగా ఎవరైనా ఇంకేం చెప్పగలరు అనిపించింది. మనిషి ఎంత డౌన్ టూ ఎర్త్ ఉంటే.. అంత గొప్ప స్థాయిలో ఉండి కూడా ఆ మాట అనగలరు.

అందుకే .. 'మనిషి వీలైనంత డౌన్ టూ ఎర్త్ ఉండాల్నే.. నేన్ దాన్నే నమ్ముత!'..

నెల్సన్ మండేలా

నెల్సన్ మండేలా

- నెల్సన్ మండేలా క్యారీకేచర్ తో వరల్డ్ ప్రెస్ క్లబ్ అవార్డు గెలిచిన తర్వాత ప్రపంచం మొత్తం శంకర్ బొమ్మ వైపు చూసింది. పలు దేశాలు సెంటర్ పేజీల్లో ఆ వార్తను అక్కడ ప్రముఖంగా ప్రచురించాయి. మనదేశంలో మాత్రం అదో చిన్న వార్తగా మిగిలిపోయిందంతే. ఆఫ్ ది రికార్డు కారణాలు శంకర్ ఎదుగుదలకు అడ్డుపడ్డాయనడంలో ఎలాంటి సందేహం లేదు..

అయినా.. శంకర్ దగ్గర ఇప్పుడు వాటన్నింటిని లెక్క చేసేంత తీరిక లేదు. జస్ట్.. తన పనేదో తాను చేసుకోవడమే. ఎవరో గుర్తించాలని తాను కోరుకోవట్లేదు. ఓన్లీ ఫోకస్ ఆన్ క్యారీకేచర్స్ ఫరెవర్.. దటీజ్ శంకర్.

ప్రముఖ ట్రంపెటర్ మిల్స్ డేవిస్ క్యారికేచర్ తో మునిసిపల్ చాంబర్ పిరాసికాబా అవార్డు దాకా సాగిన శంకర్ ప్రయాణంలో.. నెల్సన్ మండేలా, స్టీవ్ జాబ్స్, ఎంఎఫ్ హుస్సేన్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఇస్మత్ చుగ్తయ్, మన్మోహన్ సింగ్, గడాఫీ, బిన్ లాడెన్, జుకర్ బర్గ్, చెగువేరా, భీమ్ సేన్ జోషి, చలం, గోరటి వెంకన్న, మదర్ థెరిసా, రజనీ కాంత్.. ఇలా ఎన్నెన్నో క్యారికేచర్స్. ప్రతీది కదిలించేదే.

'ఆర్టిస్ట్ శంకర్ ను వైఎస్ జగన్ ఎలా రిసీవ్ చేసుకున్నారు?'

చిరంజీవికి అలాంటివి అలవాటు లేదు: ఆర్టిస్ట్ శంకర్‌కే చెల్లింది (ఫొటోలు)

interview by : శ్రీనివాస్ సాహి, నరేష్కుమార్, కాశిరాజు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+