పాపులర్ చేసిన లగడపాటి: ఏమిటీ పెప్పర్ స్ప్రే?
హైదరాబాద్: కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గురువారంనాడు పెప్పర్ స్ప్రే వాడి దాన్ని పాపులరైజ్ చేసినట్లు కనిపిస్తున్నారు. లగడపాటి రాజగోపాల్ దాన్ని ఆత్మరక్షణ కోసం వాడినట్లు చెబుతున్నారు. నిజానికి, మహిళలపై ఇటీవలి కాలంలో అత్యాచారాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆత్మరక్షణ ఆయుధంగా ముందుకు వచ్చింది. వివిధ దేశాల్లో దీన్ని వివిధ పద్ధతుల్లో వాడుతున్నారు. కొన్ని దేశాల్లో పోలీసులు మాత్రమే వాడడానికి అనుమతి ఉంది.
పెప్పర్ స్ప్రేని 'ఓసీ (ఓలియోరెసిన్ కాప్సికమ్) స్ప్రే'గా కూడా వ్యవహరిస్తారు. ఇదొక 'లాక్రిమేటరీ ఏజెంట్'. లాక్రిమా అంటే లాటిన్ భాషలో కన్నీరు అని అర్థం. కంటి కార్నియాలోని నరాలను ఉత్తేజితం చేసి, కళ్లను మండించి, కన్నీళ్లు వచ్చేలా చేసేదని దానికి అర్థం. దీనివల్ల తాత్కాలికంగా అంధత్వం వస్తుంది. ఒక్క క్షణం పాటు కంటిముందు కారు చీకట్లు కమ్ముకుంటాయి.

మిరపకాయల్లో కారానికి కారణమయ్యే రసాయనానికి నీరు, చమురు, గ్లైకోల్, నైట్రోజన్ వంటివాటిని అధికమోతాదులో జోడించి దీన్ని తయారుచేస్తారు. దీంతో పెప్పర్ స్ప్రే ప్రభావానికి గురైనవారి కళ్లు భగ్గున మండుతాయి. కళ్లు మండడంతో పాటు శ్వాసనాళ మార్గంలోని మ్యూకస్ పొర వాచి తీవ్రమైన బాధను కలగజేస్తుంది. భరించలేని మంట పుడుతుంది.
టియర్ గ్యాస్‌కీ పెప్పర్ స్ప్రేకీ తేడా
దాడుల నుంచి ఆత్మరక్షణ చేసుకోవడం పెప్పెర్ స్ప్రే ఉద్దేశం. ఘర్షణలు చెలరేగినప్పుడు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు, అల్లరి మూకలను చెదరగొట్టేందుకు పలు దేశాల్లో పోలీసులు దీన్ని వినియోగిస్తున్నారు. అయితే టియర్‌గ్యాస్‌కి, పెప్పర్ స్ప్రేకి స్పష్టమైన తేడా ఉంది. టియర్‌గ్యాస్ కళ్లల్లో దురద, ఒకింత మంట పుట్టించడం ద్వారా చిరాకు కలిగిస్తుంది. దీన్ని మన పోలీసులు ఎక్కువగా వాడుతున్న విషయం తెలిసిందే.
పెప్పర్‌స్ప్రే మంటతోపాటు, నొప్పి, వాపు కలగజేస్తుంది. ఈ స్ప్రే పడగానే కంట్లో ఉండే కేశనాళికలు వ్యాకోచిస్తాయి. దీనివల్ల బలవంతంగా కళ్లు తెరిచినప్పటికీ వారికి ఏమీ కనపడని పరిస్థితి నెలకొంటుంది. ఇక, శ్వాసనాళాల్లోకి స్ప్రే వెళ్లడం వల్ల ఆపుకోలేనంత దగ్గు వస్తుంది. శ్వాసనాళాల్లో వాపు వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. మరికొందరికి గంటలకొద్దీ తలనొప్పి వస్తుంది. పెప్పర్ స్ప్రే ప్రాణాంతకం కాదని, వాడటానికి సురక్షితమైనవని పలు అధ్యయనాల్లో తేలింది. పెప్పర్ స్ప్రే తయారీలో వాడిన రసాయనాల మోతాదును బట్టి దాని ప్రభావం 30-45 నిమిషాలపాటు ఉంటుంది.
జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ ఆప్తాల్మాలజీ అండ్ విజువల్ సైన్స్ ప్రకారం.. ఓసీ స్ప్రేల వల్ల కంటికి ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే.. పదేపదే పెప్పర్ స్ప్రే ప్రభావానికి గురైతే మాత్రం కార్నియా సున్నితత్వం దెబ్బతింటుంది.
ఏయే దేశంలో ఎలా?
పెప్పర్ స్ప్రే వాడకంపై వివిధ దేశాల్లో రకరకాల నిబంధనలున్నాయి.
బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఐస్‌లాండ్, ఇరాన్, నార్వే, ఐర్లండ్, స్వీడన్, నెదర్లాండ్స్, బ్రెజిల్. హంగరీలోనూ పోలీసులు మాత్రమే వాడటానికి అనుమతి ఉంది. కాకపోతే.. సామాన్యులు 20 గ్రాముల క్యానిస్టర్లు మాత్రం తమ వద్ద ఉంచుకోవచ్చు.
భారత్, చెక్ రిపబ్లిక్, జర్మనీ, లాత్వియా, పోలండ్, ఫిలిప్పీన్స్, రోమేనియా, రష్యా, స్లోవేకియా, దక్షిణ కొరియా, స్పెయిన్, స్విట్జర్లాండ్ దేశాల్లో ప్రతి ఒక్కరూ దాన్ని కలిగి ఉండవచ్చు.
ఫిన్లాండ్, హాంకాంగ్, ఇటలీ, న్యూజిలాండ్ దేశాల్లో దాన్ని చెంత ఉంచుకోవడానికి లైసెన్స్ అవసరం. ఇరాక్‌లో యూఎస్ సైనికులు మాత్రమే దీన్ని వాడతారు. యుకెలో పోలీసులైనా, సామాన్యులైనా హోం సెక్రటరీ అనుమతి లేనిదే వాడకూడదు. అమెరికాలో పెప్పర్ స్ప్రే వాడకంపై ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన నిబంధనలుంటాయి.












Click it and Unblock the Notifications