మెడికల్ వండర్ : తల్లి చనిపోయినా.. కడుపులో బిడ్డ సురక్షితం
వాషింగ్టన్ : కడుపుతో ఉన్న ఓ తల్లిని దురదృష్టం వెక్కిరించింది. ప్రసవం కోసం ఆసుపత్రి కోసం వెళ్తున్న సమయంలో మృత్యువు ఆమెను రోడ్డు ప్రమాదంలో రూపంలో కబలించింది. అయితే ఆమె కడుపులో ఉన్న చిన్నారిని మాత్రం సురక్షితంగా బయటకు తీయగలిగారు అమెరికన్ డాక్టర్లు. తల్లి చనిపోవడంతో చిన్నారికి శ్వాస అందడం కష్టమే అని అందరు భావించినా..! హుటాహుటిన ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లు చిన్నారిని ఈ లోకంలోకి తీసుకురాగలిగారు.
చనిపోయిన తల్లిని చూసి బాధపడాలో..! చిన్నారి క్షేమంగా కళ్లు తెరిచిందని సంతోషించాలో..! అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఆ చిన్నారి కుటుంబ సభ్యులు. వివరాల్లోకి వెళ్తే.. ముస్సోరికి సమీపంలో మాటా రైడర్, సారా ఇల్లర్ అనే దంపతులు నివాసం ఉండేవారు. గర్భంతో ఉన్న సారాకి నొప్పులు తీవ్రం కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు భర్త మాటా రైడర్.

అయితే.. ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన ఓ ట్రాక్టర్ దంపతులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో సారాకి తీవ్ర గాయాలవగా, మాటా రైడ్ పక్కటెముకలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న డాక్టర్లు సంఘటన స్థలానికే వచ్చి ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. కాగా.. తీవ్ర గాయాలపాలైన సారా మార్గ మధ్యలోనే తుది శ్వాస విడిచింది. దీంతో వెంటనే సారా కడుపులోంచి పాపను బయటకు తీసే ప్రయత్నం చేసిన డాక్టర్లు అందులో సఫలమయ్యారు.
వెంటిలేటర్ పై చిన్నారికి చికిత్స అందించగా, నాలుగో రోజు ఆ చిన్నారి కళ్లు తెరవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చిన్నారికి మాడిసన్ అనే పేరు పెట్టారు.












Click it and Unblock the Notifications