ఆ మాల్స్ 'మెట్రో'కు హైలైట్: అత్యంత లగ్జరీగా.., కి.మీ మార్గంలో 12సినిమా హాల్స్..
పంజాగుట్ట, ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్స్ మధ్య కి.మీ దూరంలో రెండు మాల్స్ ను ఎల్&టీ నిర్మించింది.
Recommended Video

హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించిన ప్రాజెక్ట్ 'హైదరాబాద్ మెట్రో'. దాదాపు రూ.15వేల కోట్ల వరకు ప్రాజెక్టు కోసం ఖర్చు చేసినట్టు చెబుతున్నా.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏది లేదు.
దేశంలోని మిగతా మెట్రోల కన్నా ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు ఎల్&టీ సంస్థ ఖర్చు విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అయితే కేవలం మెట్రో ఛార్జీల ద్వారానే తమ పెట్టుబడులను వెనక్కి రాబట్టుకోవడం కష్టం అని చెబుతూ.. ఆయా స్టేషన్ల పరిధిలో ఎల్&టీ మాల్స్ నిర్మాణం కూడా చేపట్టింది.

త్వరలోనే మాల్స్:
మెట్రో రైలు ప్రారంభోత్సవం తరువాత మాత్రమే ఎల్&టీ కంపెనీకి మాల్స్ ప్రారంభం చేసుకునే అనుమతినిచ్చారు. మంగళవారం మెట్రో ప్రారంభోత్సవం జరుగుతుండటంతో త్వరలోనే మాల్స్ ప్రారంభానికి కూడా ఎల్&టీ సన్నాహాలు చేస్తోంది. సాధ్యమైనంత త్వరలో వీటిని ప్రారంభించే అవకాశముంది.

అక్కడ 12సినిమా హాల్స్:
పంజాగుట్ట, ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్స్ మధ్య కి.మీ దూరంలో రెండు మాల్స్ ను ఎల్&టీ ఏర్పాటు చేసింది. ఈ రెండు మాల్స్ లో 12వరకు సినిమా హాల్స్ ఉన్నాయి. సినిమా హాల్స్ తో పాటు ఈ మాల్స్ లో ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల దుకాణాలు ఉండనున్నాయి. ఈ రెండు మాల్స్ ను రాబోయే నెల రోజుల్లో ప్రారంభించే యోచనలో ఎల్&టీ ఉంది. డిసెంబర్ చివరిలోగా వీటి సేవలు అందుబాటులోకి రావచ్చు.

ఆ రెండు మాల్స్ హైలైట్:
పంజాగుట్టలో గతంలో 'పడవ స్కూల్' ఉన్న ప్రాంతంలో ఎల్&టీ నిర్మించిన మాల్ అత్యాధునికి సాంకేతిక వసతులు, హంగులతో నిర్మించారు. అటు ఎర్రమంజిల్ మెట్రో మాల్ సైతం అదే స్థాయిలో నిర్మించారు. వీటితో పాటు హైటెక్ సిటీ మాల్, మూసారంబాగ్ ఏరియాల్లోని మెట్రో మాల్స్ నిర్మాణం కూడా కొలిక్కి వచ్చింది.

45శాతం ఆదాయం:
ఎల్&టీ సంస్థ నిర్మిస్తున్న మెట్రో మాల్స్ ద్వారా ఆ కంపెనీకి దాదాపు 45శాతం ఆదాయం సమకూరనున్నట్టు తెలుస్తోంది. వీటికి సమీపంలోనే మెట్రో స్టేషన్లు కూడా నిర్మాణం అయి ఉండటంతో ప్రజాదరణ బాగానే ఉంటుందని భావిస్తున్నారు.

ఆ ఒక్క మాల్:
నగరంలోని అన్ని మాల్స్ కలిపి 60లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణమవగా.. ఒక్క రాయదుర్గం వద్ద ఉన్న హైటెక్ సిటీ మాల్ 15ఎకరాల్లో 30లక్షల చదరపు అడుగుల్లో నిర్మించడం విశేషం. అయితే నాగోల్ నుంచి హైటెక్ సిటీ వరకు మెట్రో రైలు నిర్మాణం పూర్తయిన తర్వాతే ఈ మాల్ అందుబాటులోకి రావచ్చు.












Click it and Unblock the Notifications