తెలంగాణ యాంగిల్: అప్పట్లో ఒకడుండేవాడుపై ఇలా..
అప్పట్లో ఒకడుండేవాడు అనే సినిమా రేపు శుక్రవారం విడుదలవుతోంది. రివ్యూ చూసిన కొంత మంది ప్రముఖులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇవి ఇలా...
హైదరాబాద్: విడుదలకు ముందే అప్పట్లో ఒకడుండేవాడు సినిమాపై చర్చ సాగుతోంది. ప్రివ్యూ చూసిన కొంత మంది ప్రముఖులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సినిమాపై వారు ప్రశంసలు జల్లు కురిపించారు. దానికి తెలంగాణ కోణం కూడా ఓ చేర్పు అయింది.
కమర్షియల్ సినిమా విషయంలో బహుశా ఈ సినిమా తెలంగాణకు అదనపు చేర్చు కావచ్చు. సినిమాను ప్రశంసించడానికి ఇది కూడా ఓ కారణం కావచ్చు. తెలంగాణ నుంచి కమర్షియల్ హిట్ ఇచ్చే సినిమమాలు తీసే దర్శకులు చాలా తక్కువగా ఉన్నారనే అభిప్రాయం ఉంది.
ఈ స్థితిలో ఓ భారీ అంచనాలతో అప్పట్లో ఒకడుండేవాడు సినిమా ముందుకు వచ్చింది. దర్శకుడు సాగర్ కె చంద్రపై ప్రశంసలు కురుస్తున్నాయి. వారి అభిప్రాయాలను చూద్దాం...

అడిగేవారికి ఇదే జవాబబు
అప్పట్లో ఒకడుండేవాడు ఏది తెలంగాణ సినిమా? అని అడిగే వారికి, తెలంగాణ సినిమా ఎలా ఉంటుంది? అనే వారికి సమాధానం ఈ సినిమా అని ప్రముఖ జర్నలిస్టు, రచయిత కందుకూరి రమేష్ బాబు అన్నారు. ఆయన సినిమాపై విశ్లేషణ చాలా వివరంగా ఉంది. దానికి ఆయనతో పాటు మరింత మంది కూడా తెలంగాణ కోణాన్ని జోడించారు.

అప్పట్లో తెలంగాణ బలిమపై చర్చ...
తెలంగాణ సాంస్కృతిక వేదిక ఏర్పాటు సమయంలో నిబంధనావళి రూపొందించుకుంటున్నప్పుడు సోదరులు తెలంగాణ బలిమి ఏమిటో దాని ప్రత్యేకత ఏమిటో చర్చించుకున్నారు. స్థానికతను కాపాడుకుంటూ ప్రపంచీకరణను దృఢంగా వ్యతిరేకించే లక్షణం మన తెలంగాణ ఘనతగా పేర్కొనడం నాకింకా గుర్తున్నది. ఆ స్ఫూర్తిని తన సినిమాలో అడుగడుగునా ఆవిష్కారం చేసిన సాగర్ చంద్రని చూస్తుంటే గర్వంగా ఉన్నది. ఇవ్వాళ ఆ దిశగా తెలంగాణ కవులు, కళాకారులు, మేధావుల సరసన ఒక యువకుడు చేరుతున్నందుకు గుండె ఆనందంతో పులకిస్తున్నది. మనసు అతడితో అలాయ్ బలాయ్ తీసుకోమని చెప్పబుద్దవుతున్నది. అతడే సాగర్ చంద్ర. మన తెలంగాణ బిడ్డ. తెలంగాణ సినీ దర్శకుల్లో ఒక కొత్త చేర్పు. మెలుకువ - కందుకూరి రమేష్ బాబు

తనను తాను మనిషి కోల్పోకుండా...
ఒక మనిషి తనను తాను కోల్పోకుండా ఉండటానికి శక్తి మేరా ప్రయత్నించడం, ఓటమికి గురవడం, ఒటమి నుంచి తన తోవను తాను చూసుకుని, తన దశ దిశను తర్వాతి తరంలో నైనా కాపాడుకున్న మన ప్రాంతం వలే, మన ప్రాంతీయుడి వలే, హీరోను ఇతర పాత్రలను మలిచి ఈ సినిమా దర్శకుడు ఒక చెక్కచెదరని ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తాడు. అదే అప్పట్లో ఒకడుండేవాడు - కందుకూరి రమేష్ బాబు

ఇది ఏడుపుగొట్టు కథ కాదు...
చిత్రమేమిటంటే ఇది ఏడుపు గొట్టు కథ కాదు. నిరాశా నిస్సృహల కథ కాదు. జై తెలంగాణ అంటూ నినదించే కథ కాదు. ఒక అందమైన ప్రేమ కథ. తండ్రి కథ. తనయుడి కథ. ప్రేమికుడి కథ. తన కలను తాను నెరవేర్చుకోవడానికి నడుం కట్టిన ఒక క్రికెటర్ కథ. అంతిమంతా విశ్వ కథ. స్థానికతను కాపాడుకుంటూ ప్రపంచీకరణను వ్యతిరేకించి గెలిచి నిలిచే విశ్వాసాన్ని అందించే తెలగాణ కథ, మూడో ప్రపంచ దేశాల భారతీయ గాథ - కందుకూరి రమేష్ బాబు

తెలంగాణను ఎలా మార్చిందో..
అన్నిటికీ మించిన గతితర్కం ఏమిటీ అంటే తెలంగాణలో జీవన విధ్వంసం అన్నది ఎట్లా వ్యక్తులను అమానుషంగా మార్చిందో, తమవలే జీవించకుండా చేసిందో ఉదహరీణయంగా ఉండే పాత్రలతో నడిచే కథ. ఆ విధ్వంసానికి కారణం ఆర్థిక సరళీకరణ విధానాలు అని తేల్చి చెప్పే పోస్ట్ మోడ్రన్ కథ. అవును. ఆధునికతలోని డొల్లను అత్యాధునికంగా చెప్పడానికి కవిత్వం, కథ, నవల వలే సినిమా మాధ్యమాన్ని అపూర్వంగా వాడుకున్న ఒక సాహసోపేతమైన దర్శకత్వ ప్రతిభకు మచ్చు తునక ఈ సినిమా. రెండున్నర గంటల నిడివిలో ఇంత సరళంగా ఇటీవలి దశాబ్దాల పరిణామాలను ఒక్క దగ్గర అర్థం చేయించిన సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు. అందుకే అనడం, సాగర్ చంద్ర ఈ సినిమాలో తెలంగాణ హృదయాన్నే కాదు, అవశ్యమైన మేధస్సునూ పెట్టి ఒక మంచి సినిమా ఎట్లుంటదో చేసి నిరూపించిండని! దాన్ని అచ్చమైన తెలంగాణ సినిమా చేసి మన సాంస్కృతిక వారసత్వంలో తనను తాను చేర్చుకుని నిలబడ్డడని! శభాష్ తమ్ముడా... - కందుకూరి రమేష్ బాబు

ఈ సినిమా యాదృచ్ఛికమైనా..
సరిగ్గా కుస్తీ పోటీల నేపత్యంలో అమీర్‌ఖాన్ నటించి మెప్పించిన దగ్గల్ వంటి సినిమా రిలీజైనప్పుడు, క్రికెట్ బ్యాగ్‌గ్రౌండ్‌లో సాగే అప్పట్లో ఒకడుండేవాడు అంటూ ఈ సినిమా రావడం యాదృచ్ఛికమే. అంతేకాదు, వంగవీటి వంటి వ్యక్తులు వ్యవస్థలో రౌడీలుగా రాజకీయ నాయకులుగా పరిణామం అయ్యే దశను చెప్పే వర్మ కథా ఇప్పుడే రిలీజై ఉండిన సందర్భంలో రావడం. సరిగ్గా ఈ సమయంలో ఒక నల్లగొండ బిడ్డ అటు -ఆటను, ఇటు రాజకీయ పరిణామాలను తెలంగాణ నైసర్గికతతో, వ్యక్తిత్వంతో చెప్పి చూపి తెలంగాణ సినిమా ఎట్లా యూనివర్సల్‌గా ఉంటుందో, ఎంత బ్రిలియంట్‌గా చేయవచ్చో నిరూపించి చూపిండు. అందుకు ముచ్చటగా ఉంది.
సినిమా సాగే కాలమంతా ఒక దశాబ్దం. కేవలం పదేళ్ల పరిణామంలో ఒక సున్నితమైన వ్యక్తి అత్యంత పాశవికంగా దారుణంగా ప్రవర్తించే క్యారెక్టర్ మారిపోవడం , తిరిగి తనను తాను గుర్తించి అప్పట్లోలా బతకాలని చేసే విశ్వ ప్రయత్నం ఈ సినిమా. అంతేకాదు, శిఖరంగా ఎదిగే అవకాశం కల్పించిన అభవృద్ధి నమూనాలో మైదానంగా విస్తరించిన ఒక క్రికెటర్, క్రికెట్ అకాడమీ స్థాపించి మానవీయంగా ఎదిగిన సిసలైన హీరో కథ ఇది. ఆ లెక్కన ఈ మాసంలోనే కాదు, ఈ సంవత్సరంలోనూ కాదు, ఈ దశకం గత రెండు దశాబ్దాల రాజకీయ, సామాజిక పరిణామాలను ఎంతో ఆర్తితో ఒడిసి పట్టుకుని నూతన సంవత్సరం కానుకగా రేపట్నుంచి ప్రజలకి అందించిన సినిమా ఇది. అవును. రేపే ఈ సినిమా విడుదల.
ప్రపంచీకరణలో భాగంగా దేశీయతను అంటే సహజత్వాన్ని, స్థానికతను కోల్పోవడం అన్నది జరూరుగా జరిగిన పరిణామం. ఈ క్రమంలో అప్పట్లో ఒకడుండేవాడని గుర్తుంచుకునే పరిస్థితే అంతటా ఉన్నది. అందుకు భిన్నంగా ఆ వ్యక్తి తిరిగి తనను తాను నిలబెట్టుకోవడం అన్నది ఈ సినిమాలో ఉన్న ఆశావహ దృక్పథం. ఆ లెక్కన ఇది నవ తెలంగాణ సినిమా కూడా - కందుకూరి రమేష్ బాబు

సినిమా కథ ఇదీ...
తొంభయ్యవ దశకంలో రాజ్యహింస ఎట్లుండె? ఇంట్లో అక్క నక్సలైట్‌గా ఉంటే తమ్ముడు క్రికెటర్‌గా రాణిస్తున్న దశ అది. వ్యవస్థను మార్చేందుకు విశ్వవిద్యాలయం వీడి అజ్ఞాతంలోకి వెళ్లిన యువతుల కథ. ఈ యువత ఉద్యమ నేతలనే జీవిత సహచరులుగా ఎంచుకుని అడవిలో అజ్ఞాత జీవితం గడుపుతున్న దశ కూడా. ఒక కొత్త సాహచరత్వం మొగ్గతొడిగే దశ అంతానూ. అప్పుడే తెలంగాణ గ్రామాల్లో పోలీసులు సైతం తమ సోదరులనే తాము విచక్షణా రహితంగా హతమారుస్తున్న విధ్వంస దశ. రాజ్యం ప్రోత్సాహంతో కోవర్టులను ప్రేరేపించి పీపుల్స్ వార్‌పై జడల నాగరాజు, కత్తుల సమ్మయ్యలను ప్రేరేపిస్తున్న విష ప్రయోగ దశ. తర్వాత నయిమ్ వంటి వ్యక్తులు అజ్ఞాత వాసం వీడి పోలీసుల చెంత తిరిగి సరికొత్త అజ్ఞాత జీవితాలను వెల్లబుచ్చుతున్న దశ. బెల్లి లలితలను, ఆజం అలీలను, పురుషోత్తం వంటి నిజ పోరాట యోధులను ముక్కలు ముక్కలుగా నరుకుతున్న దశ. ఇట్లా పోరాటం, పోరాట శక్తులపై పోలీసులను రాజ్యం ఉసిగొల్పిన సమయంలో అభివృద్ధి నమూనా, ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో పల్లెలు,పట్నాలు, వ్యక్తులు వ్యవస్థలో స్రక్టచర్ అడ్జెస్ట్ అవుతున్న దశ. మనుషులు సడెన్‌గా అమానవీయంగా మారి పోయి వ్యవస్థలో ఇరుకుతున్న దశ. అక్రమ దందాలు ఆర్గనైజ్ అవుతున్న వేళ...రౌడీలు రాజకీయ అండతో పెట్రేగుతున్న తరుణం. నగరాలు, పట్టణాల్లోనూ బాంబులు పేలుతున్న సమయం. అదనపు విలువతో పరిశ్రమలు పెరిగి నూతర వ్యాపార ధోరణి విస్తరించే క్రమం. రియల్ ఎస్టేట్ ప్రారంభమైంది. స్టాంపుల కుంభకోణానికి తెర లేస్తున్నది. ఇంకా చాలా. నలభై ఏళ్లు దాటిన రౌడీలు రాజకీయ నాయకులుగా కొత్త రూపాల్లో ఒదిగిపోయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నరో వారికే అంతుపట్టని స్థితి. సామాన్యులు అసామాన్యంగా ఎదిగి తమ సహజత్వాన్ని తాము కోల్పోయి వికృతంగా మారుతున్న తరుణం. ఎవరికి వారు తమని తామే చూసి తామెప్పుడో మరణించామని గ్రహిస్తున్న దశ కూడా. అయితే అందులోనే తమలా బతకాలని ఉందని భావించిన తెలంగాణ హీరో కథ ఇది. ఇదంతా దర్శకుడు అత్యద్భుత నిర్మాణ కౌశలంతో ఉన్న పరిమితుల్లోనే అపూర్వంగా ఆవిష్కరించి చూపడం అన్నది ఈ సినిమా బలం.

తమను తాము కోల్పోతున్న వ్యక్తులు...
రాజ్యహింస కింద నలిగిపోయే వ్యక్తులు, అభివృద్ధికి మోకరిల్లి తమను తాము కోల్పోతున్న వ్యక్తులు. ఈ రెండింటి ఘర్షణ తెలంగాణ జీవితం ఇతివృత్తంగా, హైదరాబాద్ వంటి పట్టణం కేంద్రంగా సినిమా సాగుతూ ఉంటే మ్యాజిక్ రియలిజంను పోలిన ఒక గొప్ప నవల కళ్లముందు ఆవిష్కారం అయ్యేలా దర్శకుడు ప్రతి పుటనూ వేగంగా తిప్పుతూనే తాను సిసలైన జీవితంలోకి ప్రవేశపెట్టడం మరో మలుపు. అదే అసలు సినిమా ఉద్దేశ్యం. ఇంట్లో నక్సలైట్ అక్క ఉండి, క్రికెట్ సెలక్షణ్ కమిటీలో పోలీసులున్నప్పుడు ఎట్లా ఒక సోదరుడు ఆట నుంచి తప్పుకుని తన జీవితంలోకి తాను నడిచి రావడానికి ప్రయత్నిస్తాడో చెప్పే కథ ఇది. ఆ క్రమంలో కాఖీ దుస్తుల మాటున, కోవర్టులను ప్రవేశపెట్టిన వ్యక్తి కూడా తన తప్పిదాన్ని తాను గ్రహించి మానవీయంగా మారడం ఈ కథలోని మరొక పోయెటిక్ జస్టిస్.
అట్లా రాజ్యం ఏకాకి అవుతూ మనుషులు దగ్గరగా మారిన వైనం తెలంగాణలో ఎట్లా జరిగిందో ఈ కథ లీలగా అట్లా మనల్ని మనకి కలుపుతుంది.
ఇట్లా కథ ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో...అభివృద్ధి నుంచి వికాసానికి పరివర్తనం చెందే పాత్రలతో... గొప్ప ఇమోషనల్ డ్రామాతో ముగిసి, ఒక మంచి సినిమా చూసిన అనుభూతితో పాటు గొప్ప మనుషులను కలుసుకున్న తృప్తిని కలిగిస్తుంది. అప్పట్లోనే కాదు, ఇప్పట్లో ఒకడున్నాడు, మనతో ...అనిపించేలా చేస్తుంది. అదే దర్శకుడు సాగర్ చంద్ర సాధించిన పరిణతి. టైటిల్ ఎంత నప్పిందో సినిమా అంతగా మెప్పిస్తుంది.
నిన్న రాత్రి ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రివ్యూ అయిపోయాక అభిమానంతో ఆలింగనం చేసుకున్నాక... తానన్నాడు...ఇంకో లెవల్ పోవచ్చా అని! వద్దన్నాను. ఇదే లెవల్‌తో ఇంకిన్ని సినిమాలు చేయి బ్రదర్ అన్నాను నేను. అట్లా చేసింది చాలనిపించే గొప్ప చేతనగల దర్శకుడిని చూసినందుకు మాటలు రాలేదు, రాత్రినుంచి. కానీ, రాయకుండా ఉండలేక ఈ నాలుగు మాటలు.అభినందన.
నిజమే.మనదైన హజత్వాన్ని కాపాడుకుంటూ ప్రపంచీకరణను అడ్డుకునే ఏ చిన్న ప్రయత్నమైనా దానికి తెలంగాణ జోహార్లు చెబుతుంది. అలుముకుని ఆశీర్వదిస్తుంది. అందులో నేనిప్పుడు. రేపు సినిమా చూశాక మీరూ మరింత మాట్లాడుతారని నా నమ్మిక - కందుకూరి రమేష్ బాబు

సాగర్ బాయ్‌కి అభినందనలు..
అన్నట్టు, ఇన్ని పడికట్టు పదాలు లేకుండా, ఏ సందేశం ఇచ్చినట్లు అనిపించకుండా, అలవోకగా సినిమాలో లీనం చేసి, గొప్ప ఫీలింగ్‌ను పంచేలా చేసిన ఈ బ్రిలియంట్ దర్శకుడిని మనం ప్రమోట్ చేయనక్కర్లేదని నా భావన. అతడితో పని తీసుకోవడానికి తన తలుపు తట్టడానికి తెలంగాణ, టాలీవుడ్, బాలీవుడ్ నుంచి మంచి పిలుపే వస్తుంది. అందుకే, తమ్ముడి విషయంలో నాకే భయమూ లేదు. ధైర్యం తప్ప. మెరిసే కళ్ళ ఈ యువకుడు మనకొక స్టార్. అతడొక కానుక.
ప్రౌడ్ ఆఫ్ యూ సాగర్ బాయ్ -కందుకూరి రమేష్ బాబు

అప్పటి విషయాలే కానీ..
1990ల్లోని పోషలిజం, గుండాయిజం, నక్సలిజం లని కలగలిపి దానికి ఆ దశాబ్దం లో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలను జోడించి కథ రాసుకొని మెప్పించడం అంటే మాటలా.. కానీ Saagar K Chandra మెప్పించగలడు. ఫ్యూచర్ లో అందరం గర్వంగా అప్పట్లో ఒక గొప్ప డైరెక్టర్ ఉండేవాడు అని చెప్పుకునేంత మెప్పించగలడు... 90 ల్లోని భోగనాథ పురం దొంగలు, తెల్గి స్టాంపుల కుంభకోణం , రాజ్య హింస వ్యతిరేక గాయని బెల్లి లలిత ని పోలిన క్యారెక్టర్ , మావోయిజం నుంచి గుండాయిజం లో ఎదిగిన నయీమ్ ని పోలిన క్యారెక్టర్, అప్పటి హోమ్ మినిస్టర్స్, పీవీ నరసింహ రావు , జై శ్రీరామ్ మూమెంట్ ఇలా ఎన్నో సంఘటనలు గుర్తు చేస్తాడు దర్శకుడు..
అప్పట్లో ఒకడుండేవాడు సినిమా 90 ల కు ముందు పుట్టిన వాళ్ళు ఆ సంఘటన లను మననం చేసుకోడానికి చూడాలి.. ఆ తరవాత పుట్టిన వారు ఆ సంఘటనల గురించి తెలుసుకోడానికి చూడాలి.. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండ చూడాలి...
ఇక నటనలో అందరు చింపి ఆరేశారు.. Rohith Nara, Sree Vishnu, మిగతా వాళ్ళందరూ ఊపేసారు.అన్నలు Raj Madiraju Thummala Narsimha Reddy మధ్యలో అలరిస్తారు. కానీ ప్రత్యేకంగా ఒక టెక్నిషియన్ గురించి మాట్లాడాలి. సినిమా మొత్తానికి Suresh Bobbili పులి లా నిలబడ్డాడు తన నేపథ్య సంగీతం తో.. Sai Kartheek Naveen Yadav గ్రేట్ జాబ్.. అల్ ది బెస్ట్ టీం కంగ్రాట్స్ - నరేందర్ గౌడ్ నాగలూరి

ఇది వరల్డ్ క్లాస్ స్క్రిప్ట్
కేవలం నవ్వించగలిగితే చాలు ఎవడైనా సినిమా తీయొచ్చు అని బలంగా నమ్ముతున్న తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఒక కథతో సినిమా తీసి ప్రేక్షకుడిని మెప్పించడానికి కెరీర్ పణంగా పెట్టే ధైర్యం కావాలి ఓ దర్శకుడికి. సంక్షుబిత 90'లు ఒక క్రికెటర్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసాయో చెప్పే ఈ కథ ఏ వరల్డ్ క్లాస్ స్క్రిప్టుకు తీసిపోదు. ప్రేక్షకుల బలహీనతలను క్యాష్ చేసుకునే బోడింగు కథలు రాసి క్రెడిట్ల కోసం కొట్టేసుకుంటున్న వ్యక్తుల మధ్య, వాళ్ళ తెలివికి గౌరవాన్ని ఇచ్చి సినిమా స్థాయిని పెంచే ఇలాంటి ప్రయత్నాలను చూసినప్పుడు పట్టలేని సంతోషం... Sagar Chandra thanks for inviting me to preview and my hearty congratulations in advance... I'm sure you are going give a grand hit Tomorrow - ప్రదీప్ అద్వైతం

'ఇప్పట్లో ఒకడున్నాడు' సాగర్ కె చంద్ర!
నల్లగొండ బిడ్డ ! Saagar K Chandra ! "అప్పట్లో ఒకడుండేవాడు" డైరెక్టర్ ! నేను తిరిగిన గల్లీల్లో తిరిగినవాడు.. నేను దిద్దినట్లే బొమ్మలు దిద్దినవాడు. ఉస్మానియాలో ఇంజనీరింగ్ చదివాడు. అమెరికాలో ఎమ్మెస్ అయ్యాక అక్కడే ఫిల్మ్ స్కూల్ కి వెళ్ళాడు. రెండేళ్లు ఉద్యోగం చేసాడు. మనసుకి శాంతి లేదు. ఇండియా వచ్చేసాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఢక్కా మొక్కీలు తిన్నాడు. చివరికి 'ఇప్పట్లో ఒకడున్నాడు' అనే రేంజ్ లో దమ్మున్న డైరెక్టర్ అయ్యాడు.
ఈ మధ్య మన తెలుగు చెత్త సినిమాల గురించి చాలా మంది బాధ పడ్డారు. సాగర్ ఆ కొరత తీరుస్తాడనే భరోసా కలిగించాడు. hearty congratulations Sagar Bhai!
Venu Udugula పిలిస్తే నిన్న రాత్రి "అప్పట్లో ఒకడుండేవాడు" ప్రివ్యూ చూశాను. చాలా ఉద్వేగానికి గురయ్యాను. స్క్రీన్ పై హీరో శ్రీ విష్ణు & పక్కన డైరెక్టర్ సాగర్ ఫ్రెష్ గా కనిపించారు. డైరెక్షన్, స్క్రీన్ ప్లే బాగున్నాయి. కథ బాగుంది. శ్రీ విష్ణు బాగా చేసాడు. నారా రోహిత్ బాగా చేశాడు. సినిమా సూపర్ హిట్. మనకో మంచి డైరెక్టర్ దొరికాడు. మంచి హీరో దొరికాడు. వీళ్ళు భవిష్యత్ లో ఎన్నో హిట్స్ కొట్టడం ఖాయం! - స్కైబాబ
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications