చిరంజీవితో పొత్తు ఎవరికి?
మెగాస్టార్ చిరంజీవి పార్టీపై అధికారిక ప్రకటనకు ముహూర్తం దగ్గర పడుతున్నది. రేపో మాపో చిరంజీవి పార్టీపై ప్రకటన చేయవచ్చునని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 21వ తేదీన చిరంజీవి కంచిలో చండీపారాయణం చేస్తారట. మర్నాడు చండీయాగం నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోంది. కంచి ప్రధాన అర్చకుడు నటరాజ శాస్త్రి ఈ చండీ యాగం నిర్వహిస్తారని అంటున్నారు. వచ్చే అదివారం ఆయన హైదరాబాదులోని బంజారాహిల్స్ లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెబుతున్నారు. ఆ తర్వాత పెద్ద యెత్తున తిరుపతిలో బహిరంగ సభ జరుగుతుందని చెబుతున్నారు. బహుశా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంనాడే ఆయన పార్టీ పేరును, పార్టీ విధివిధానాలను ప్రకటించే అవకాశం లేకపోలేదు. తిరుపతిలో బహిరంగ సభ నిర్వహణకు చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్ వేదికను పరిశీలించి వచ్చారు.
ఈ నెల 22వ తేదీననే చిరంజీవి తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించవచ్చునని మరో వైపు కథనాలు వెలువడుతున్నాయి. తొలుత ఈ నెల 15న గానీ, 22న గానీ చిరంజీవి పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ నెల 26వ తేదీ, 28వ తేదీలు కూడా బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి వినిపిస్తున్నాయి. మొత్తం మీద చిరంజీవి పార్టీకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. చిరంజీవి పార్టీ పేరును ప్రకటించే తేదీని, బహిరంగ సభ తేదీని, వేదికను ప్రకటించకుండా మీడియాలో ఊహాగానాలతో వార్తలు పచ్చేలా చూసుకుంటున్నారనే ప్రచారం జరుగుతున్నది.
చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు రంగంలో ఉన్నట్లవుతుంది. ఈ పార్టీలు వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవాల్సిన స్థితి ఉంది. కాంగ్రెసుతో మజ్లీస్ మినహా మరే పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. సిపిఎం, సిపిఐ కలిసే పోటీ చేస్తామని అంటున్నాయి. అయితే సిపిఎం చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతుండగా సిపిఐ చిరంజీవి పార్టీ వైపు చూస్తున్నది. కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేవేందర్ గౌడ్ నాయకత్వంలోని నవ తెలంగాణ ప్రజా పార్టీ చిరంజీవి పార్టీతో పొత్తు పెట్టుకునే అవాశం ఉంది. అయితే, సైద్ధాంతిక విభేదాలను పక్కన పెట్టి కాంగ్రెసుకు వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్షాలు ఒక్కటి కావాలని సిపిఎం కార్యదర్శి బి.వి. రాఘవులు అంటున్నారు. కానీ కాంగ్రెసుకు వ్యతిరేకంగా చిరంజీవి, చంద్రబాబు ఒక్కటవుతారా అనేది ప్రశ్న. ఈ స్థితిలో రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బహు ముఖ పోటీలను నివారించగలిగినా త్రిముఖ పోటీని నివారించే స్థితి లేదని అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications