ఇటు చిరు: అటు తెలంగాణ

D Srinivas
రాష్ట్రంలో ఎన్నికలను ఎదుర్కునే విషయంపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠాన వర్గం మల్లగుల్లాలను పడుతోంది. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడం ఒక అవసరమైతే, అంతకన్నా ముఖ్యంగా కేంద్రంలో తిరిగి అధికారం సంపాదించుకునేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాంగ్రెసుకు కీలకంగా మారింది. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పరిణామాలపై తీవ్రంగా ఆలోచిస్తోంది. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితోనూ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తోనూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) నాయకులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాంగ్రెసుకు రాష్ట్రంలో ముఖ్యంగా రెండు ప్రధాన అడ్డంకులున్నాయి. కాంగ్రెసు ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేనప్పటికీ చిరంజీవి ప్రభావం, తెలంగాణ అంశం పార్టీని కలవర పెడుతున్నాయి.

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రజా అంకిత యాత్రకు విశేష ప్రజాదరణ లభిస్తోంది. అయితే చిరంజీవి సభలకు వచ్చే వారంతా అభిమానులేనని, వారు ఓట్లు వేసే ప్రజలు కారని వీరప్ప మొయిలీ వంటి కాంగ్రెస్ నాయకులు చెబుతున్నప్పటికీ లోలోపల గుబులుగానే ఉన్నారు. ఉత్తరాంధ్రలోని చిరంజీవి పర్యటనపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. చిరంజీవి ఇమేజ్ ను అడ్డుకోవడానికి సినీ స్టార్లు కృష్ణ, రాజశేఖర్, జీవిత, జయసుధ వంటివారిని చేరదీస్తున్నా అంతగా ఫలితం కనిపించదనే అభిప్రాయం బలపడినట్లు చెబుతున్నారు. చిరంజీవి ప్రభుత్వ విధానాలపై సున్నితంగానే అయితా స్థిరంగా విమర్శలు గుప్పిస్తున్నారు. వాటికి తగిన సమాధానం చెప్పే స్థితిలో కాంగ్రెసు లేదు. క్రమక్రమంగా చిరంజీవి బలపడుతారనే అంచనా ఒకటి ఉంది. దీనికితోడు తెలుగుదేశం పార్టీ కూడా నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఅర్, కళ్యాణ్ రామ్, తారకరత్నలను రంగంలోకి దించుతున్నది. కోస్తా జిల్లాలో తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల మధ్యనే పోటీ నెలకొని కాంగ్రెస్ మూడో స్థానంలోకి పడిపోతుందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు.

ఇక, తెలంగాణ అంశం కాంగ్రెస్ పార్టీకి కొరుకుడు పడని కొయ్యగా మారింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడిందనే భావించాలి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, వామపక్షాలు పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో తమకు కష్టమేననే అంచనాకు కాంగ్రెస్ నాయకత్వం వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణపై నిర్ణయం తీసుకోకుండా ఈ ప్రాంతంలో ప్రజల ఓట్లు అడగడం సాధ్యం కాదనే అభిప్రాయం తెలంగాణ నాయకుల్లో ఉంది. ఇందు వల్లనే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించాలని పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కోరుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో డి. శ్రీనివాస్ కు కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి మద్దతుగా నిలిచినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మాత్రం డి. శ్రీనివాస్ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గానికి పెద్ద సమస్యగానే మారింది. కానీ, తెలంగాణ విషయంలో ఏదో ఒకటి స్పష్టంగా చెప్పకపోతే కష్టమేనని అంటున్నారు.

తెలంగాణ అంశం వల్ల ఈ ప్రాంతంలో, చిరంజీవి, నందమూరి హీరోల వల్ల కోస్తా జిల్లాలు తమకు కాకుండా పోతాయనే భయం కాంగ్రెస్ నాయకుల్లో నెలకొన్నట్లు చెబుతున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో మూడో స్థానంలో పడిపోతే ఇక మిగిలింది రాయలసీమ మాత్రమే. రాజశేఖర రెడ్డి సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో చేసిన కృషి వల్ల ఈ ప్రాంతంలో కాంగ్రెసు కు పరిస్థితి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రాంతంలో ఏదో మేరకు తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు కూడా సీట్లు సంపాదించుకోగలవు. అయినా ఈ ప్రాంతం బలాబలాలను పూర్తిగా మార్చే పరిస్థితి ఉండదు. అధికార సాధనలో ఈ ప్రాంతం సీట్లు నిర్ణయాత్మక పాత్ర పోషించలేవు. పైగా, కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఆంధ్రప్రదేశ్ కీలకంగా మారింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవి ప్రభావం, తెలంగాణ అంశాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో తెలంగాణ అంశాన్ని పరిష్కరించుకోవడానికి కాంగ్రెసుకు అవకాశం ఉంది. కానీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కాదని ముందుకు పోవడమే కాంగ్రెసు నాయకత్వానికి ఉన్న సమస్య.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+