చిరు, బాబుల సయోధ్య?

ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత వైయస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదనే అభిప్రాయం కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో రాజశేఖర రెడ్డిని ఓడించడానికి బలమైన శక్తి అవసరమని గుర్తించిన వర్గమే చిరంజీవిని రాజకీయాల్లోకి దించినట్లు వార్తలున్నాయి. కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి తెలుగుదేశం పార్టీ బలం సరిపోదనే భావనతోనే చిరంజీవిని దించినట్లు చెబుతారు. అయితే, అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ పుంజుకోవడం, చిరంజీవిని ఎదుర్కోవడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి బాలకృష్ణతో పాటు ఇతర నందమూరి హీరోలను రంగంలోకి దించడం ప్రజారాజ్యం పార్టీకి కష్టాలు తెచ్చే పరిస్థితిని కల్పించింది. ఈ వాతావరణంలో చిరంజీవి, చంద్రబాబు మధ్య ప్రధానంగా పోటీ నెలకొని కాంగ్రెసు మరింత లాభపడుతుందనే అభిప్రాయం బలపడుతూ వచ్చింది. ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి చిరంజీవి, చంద్రబాబుల మధ్య సంధికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు చెబుతున్నారు.
చిరంజీవికి తిరుగులేని ప్రజా మద్దతు లభిస్తుందని, దాని వల్ల వామపక్షాలతో కలిసి పోటీ చేస్తే కాంగ్రెసును చిత్తు చేయవచ్చునని, తెలుగుదేశం పార్టీ నామమాత్రమవుతుందని భావించారు. అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు సృష్టించిన ప్రభంజనాన్ని సృష్టించలేకపోయింది. ఉనికిని కోల్పోతుందని భావించిన తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుంది. ఈ పరిస్థితిని గమనించిన సిపిఎం తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపింది. జాతీయ రాజకీయాలను చూపి సిపిఐని కూడా ఇటువైపే తెచ్చింది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్ధపడింది. దీంతో ఒక కూటమి ఏర్పడినట్లయింది. ఈ కూటమి పెట్రో ధరలపై ఈ నాలుగు పార్టీ ఆందోళన చేపట్టాయి. ఒకే వేదిక మీదికి వచ్చాయి. బుధవారం రాత్రి చంద్రబాబుకు, కెసిఆర్ కు మధ్య మంతనాలు సాగాయి. ఈ పార్టీలను ఒకటి చేయడంలో రామోజీరావు కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ స్థితిలో చిరంజీవిని కూడా ఈ కూటమిలోకి తెస్తే కాంగ్రెసును ఓడించగలుగుతామనే ఉద్దేశంతో రామోజీరావు భావిస్తున్నట్లు చెబుతున్నారు. చిరంజీవికి, చంద్రబాబుకు మధ్య సంధికి తగిన ప్రతిపాదనలను కూడా రూపొందించినట్లు సమాచారం. అధికారాల పంపకాలకు సంబంధించి ఈ ప్రతిపాదనలు ముందుకు వచ్చినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీతో తమ పొత్తు ఖరారైందని చెబుతూ ఇటీవల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి చిరంజీవితో కూడా అవగాహన ఉంటుందని చెప్పడాన్ని ఈ విషయంలో గమనించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications