రాఘవులే గెలిచారు
రాష్ట్రంలో మహా కూటమికి లైన్ క్లియర్ అయినట్లే. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో సిపిఐ, సిపిఎం పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధపడ్డాయి. కాగా, ఈ పార్టీలతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా కలిసి వస్తోంది. ఈ మహాకూటమికి సంబంధించిన సంకేతాలను ఈ నాలుగు పార్టీలు మంగళవారం అందించాయి. పెట్రో ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఈ నాలుగు పార్టీలు చలో రాజభవన్ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీ అధినాయకులే పాల్గొనడం విశేషం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వేదికను పంచుకున్నారు. సిపిఐ, సిపిఎంల రాష్ట్ర కార్యదర్శులు కె. నారాయణ, బివి రాఘవులు కూడా ఈ ఆందోళనా కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో తెలుగుదేశం, సిపిఐ, సిపిఎంలతో కలిసి రావడానికి తెరాస సిద్ధమైనట్లేనని అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే భావనలో ఉన్న చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీతో పొత్తుకు వెనకాడుతూ వచ్చారు. డిసెంబరులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు డిసెంబరులో పార్లమెంటులో కాంగ్రెసు బిల్లు ప్రతిపాదిస్తుందని కెసిఆర్ సంచలన ప్రకటన చేశారు. తెరాస కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుంటుందనే ఊహాగానాలు ఊపందకున్నాయి. ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీ, తెరాసకు మధ్య దూరం పెరిగింది. తెరాస వైఖరితో విసిగిన చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సెంటిమెంటుతో తెరాస ప్రజలను రెచ్చగొడుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనిపై తెరాస నాయకులు మండిపడ్డారు. అయితే క్రమంగా పరిస్థితి సర్దుకుంది.
తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకోదని తేలడంతో కెసిఆర్ మళ్లీ తెలుగుదేశం, వామపక్షాల కూటమికి దగ్గరయ్యారు. ఆ విషయాన్ని మంగళవారం జరిగిన ఆందోళన కార్యక్రమం ధ్రువీకరించింది. మొదటి నుంచి కెసిఆర్ వామపక్షాలతో జత కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాగా, కేంద్ర నాయకత్వం సూచన మేరకు సిపిఐ రాష్ట్ర నాయకత్వం చిరంజీవి ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకోవాలని ఆలోచనను విరమించుకుని తెలుగుదేశంతో జత కట్టడానికి ముందుకు వచ్చింది. జాతీయ స్థాయిలో తృతీయ కూటమి ఏర్పాటు ప్రయత్నాలకు అనుగుణంగా సిపిఐ ఈ నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం నాయకత్వంలో కాంగ్రెసుకు, బిజెపికి వ్యతిరేకంగా వామపక్షాలు, తెరాస, తెలుగుదేశం పార్టీలను ఒకే వేదిక మీదికి తేవాలనే సిపిఎం రాఘవులు ప్రయత్నాలు ఫలించాయి. ఈ విషయంలో రాఘవులే గెలిచారు.












Click it and Unblock the Notifications