సోనియాకు తెలంగాణ సవాల్
ఒత్తిడి ఎంత పెరిగినా తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం వైఖరిలో మార్పు వచ్చే సూచనలు కనిపించడం లేదు. తెలంగాణ సీనియర్ నాయకులు ఈ నెల 24వ తేదీన నల్లగొండ జిల్లా భువనగిరిలో తలపెట్టిన తెంలంగాణ రణభేరీ బహిరంగ సభను రద్దు చేయించడానికి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ ముప్పు తిప్పలు పడుతూనే ఉన్నారు. వీరప్ప మొయిలీ సోమవారంనాడు నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఉప్పునూతల పురుషోత్తమరెడ్డికి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి ఫోన్ చేసి సభను రద్దు చేసుకోవాలని సూచించారు. వారిద్దరు అందుకు నిరాకరించడంతో మంగళవారం ఎమ్మెల్సీ కె.ఆర్. అమోస్ తో ఫోనులో మాట్లాడారు. కానీ తెలంగాణ సీనియర్ నాయకులు తమ పట్టును వీడడం లేదు.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంగళవారం పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి నివాసంలో సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించారు. తాము సభను రద్దు చేసుకునే ప్రసక్తి లేదని సీనియర్ నాయకులు తేల్చి చెప్పారు. ఇది తెలంగాణ సెంటిమెంట్ తీవ్రతను తెలియజేయడానికి మాత్రమే నిర్వహిస్తున్నామని వెంకటస్వామి చెప్పారు. ఇది పార్టీకి వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. ఒక రకంగా హస్తిన పెద్దలను ధిక్కరించే ధోరణిలో మాట్లాడారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సభ్యుడినైన తాను హాజరవుతున్నప్పుడు సభ పార్టీ వ్యతిరేకం ఎలా అవుతుందని ఆయన అడిగారు. అధిష్ఠానవర్గానికి వ్యతిరేకం కాదా అని అడిగితే ఇక్కడ ఉన్నవారంతా ఎఐసిసి సభ్యులేనని ఆయన చెప్పారు. ఇది పార్టీ అధిష్ఠానవర్గాన్ని సవాల్ చేయడమేనని భావించవచ్చు. తమపై ఏ విధమైన చర్య తీసుకున్నా ఫరవా లేదనే తెగింపు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు వచ్చినట్లు అర్థం చేసుకోవచ్చు.
సభను రద్దు చేసుకోవాలని తాను ఫోనుల ద్వారా చేసిన సూచనలు ఫలితం ఇవ్వకపోవడంతో వీరప్ప మొయిలీ ఏకంగా ఢిల్లీలో మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. తమ పార్టీ సీనియర్లు తెలంగాణ రాష్ట్ర సమితి లాగా వ్యవహరించడం దురదృష్టకరమని ఆయన అన్నారు. భువనగిరి సభ పెట్టడం సోనియాను, పార్టీ వ్యతిరేకించడమేనని చెప్పారు. ఈ సభ పార్టీకి గానీ తెలంగాణకు గానీ ఏ మాత్రం ఉపయోగపడదని ఆయన అన్నారు. ఏకాభిప్రాయ సాధన మరింత కష్టతరంగా మారిందని ఆయన తెలంగాణకు తాము అనుకూలంగా లేమనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. అయితే కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేస్తే ఏ లొల్లి ఉండదనే విషయాన్ని ఆయన పరిగణనలోకి తీసుకోవడం లేదు. తెలంగాణపై పార్టీ వైఖరి అనుకూలంగా ఉంటే ఏమవుతుందోనన్న భయం, వ్యతిరేకంగా ఉంటే తెలంగాణ ప్రజలకు దూరమవుతామనే భయం కాంగ్రెస్ అధిష్ఠానవర్గాన్ని పీడిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.
తెరాస రాజీనామాల ద్వారా విసిరిన సవాల్ ఒక వైపు ఉండగానే, తమ పార్టీ సీనియర్ నాయకుల ధిక్కార స్వరం కాంగ్రెస్ అధిష్ఠానవర్గాన్ని కష్టాల్లో పడేసింది. ఈ కష్టాల నుంచి గట్టెక్కడం అంత సులభమేమీ కాదు. అయితే తెరాసను దాని మానాన దాన్ని వదిలేసి తమ పార్టీవారిని దారికి తెచ్చుకునే మార్గం కూడా పార్టీ నాయకత్వానికి కనిపించడం లేదు. పార్టీ సీనియర్ నాయకులను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటుందని కూడా అనుకోలేం. వారిపై చర్యలు తీసుకుంటే పరిస్థితి మరింత విషమించే ప్రమాదమే ఉంది. వారిపై చర్యలు తీసుకుంటే సమస్య ఏ రూపం తీసుకుంటుందో కూడా పార్టీ అధిష్ఠానవర్గానికి అంతు చిక్కడం లేదు. ఈ సమస్యను కాంగ్రెస్ ఏ విధంగా పరిష్కరించుకుంటుందో వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications