• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైయస్ ధీమా

By Staff
|

YS Rajasekhar Reddy
ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలతో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిలో ధీమాను పెంచాయి. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత అంతగా పనిచేయదని చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేయడమే ఆయన ధీమాకు కారణం. ప్రభుత్వాలకు సానుకూల ఓటు కూడా పడుతుందని ఈ ఎన్నికల ద్వారా తెలిసి వచ్చింది. ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో ప్రజలు అధికారంలో ఉన్న పార్టీలనే మళ్లీ గెలిపించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాగా, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చింది. ప్రజలు సానుకూల ఓటు కూడా వేస్తారని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ విషయంలో గతంలో ఒక్కసారి రుజువైంది.

ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఢిల్లీలో షీలా దీక్షిత్ హ్యాట్రిక్ సాధించడం విశేషం. రాజస్థాన్ లో కూడా వసుంధర రాజే నేతృత్వంలోని బిజెపి కూడా ఘోరంగా ఏమీ ఓడిపోలేదు. కాంగ్రెస్ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇతరుల మద్దతు అవసరం పడింది. రాజస్థాన్ లో బిజెపి ఓడిపోవడానికి ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన వసుంధర రాజే ఒక రకంగా కారణం. ర్యాంపులపై నడవడం, ఫ్యాషన్ షోల్లో పాల్గొనడం వంటి చర్యలు ఆమె స్థాయిని తగ్గించాయి. అదే సమయంలో గుజ్జర్ల సమస్య ఆమెకు పెను కంటకంగా మారింది. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ లోనూ తనకు సానుకూల ఓటు పడుతుందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజేశేఖర రెడ్డి విశ్వసిస్తున్నారు. చాలా కాలంగా ఆయన ఇదే విషయం చెబుతున్నప్పటికీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఆయనలో మరింత ధీమా పెరిగింది.

జలయజ్ఞం వంటి అభివృద్ధి కార్యక్రమాలు, రెండు రూపాయలకు కిలో బియ్యం, రైతులకు ఉచిత విద్యత్ సరఫరా, రైతు రుణాల మాఫీ, మహిళలకు పావలా వడ్డీకే రుణాలు, బిసీ రుణాల మాఫీ, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు తిరిగి తమకు అధికారాన్ని కట్టబెడతాయని వైయస్ నమ్ముతున్నారు. నిజానికి, వైయస్ ధీమాకు అర్థం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లు దాటినా ప్రజల్లో వ్యతిరేకత నెలకొనలేదు. పైగా, సానుకూలత పెరిగింది. అయితే, తెలంగాణ, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, అవినీతి ఆరోపణలు ఆయనకు ఆటంకాలు కల్పించే అవకాశాలున్నాయి. వాటిని ఆయన పరిష్కరించే తీరు మీద కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

వీటిలో తెలంగాణ అంశమే పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యమంత్రిపై విశ్వాసం ఉంచిన కాంగ్రెస్ అధిష్ఠానవర్గం తెలంగాణ అంశాన్ని తేల్చకుండానే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. తెలుగుదేశం, ప్రజారాజ్యం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో సమైక్యాంధ్రను కోరుకునే ప్రజలు తమ వెంట వస్తారని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను మాత్రం తేల్చేందుకు కాంగ్రెసు కొంత మేరకు సిద్ధపడే అవకాశం ఉంది. అవినీతి ఆరోపణలు ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా పనిచేయవని కాంగ్రెస్ భావిస్తోంది.

ముఖ్యమంత్రి పనితీరు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తిరిగి కాంగ్రెసును అధికారంలోకి తెస్తాయని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 230 శాసనసభ సీట్లు గెలుస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. అది మాట వరుసకే అంటున్నారో, నిజంగానే అలా నమ్ముతున్నారో తెలియడం లేదు. దాన్ని నిజంగానే నమ్మితే అతి విశ్వాసానికి పోయినట్లే. ఈ అతి విశ్వాసమే దెబ్బ తీసే ప్రమాదం కూడా లేకపోలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X