తెలంగాణపై నిజం చెప్పిన వైయస్

కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ నాయకులతో సహా ప్రజలందరికి విషయం స్పష్టంగా అర్థమవుతున్నది. నేడు తెలంగాణకు వైయస్ రాజశేఖర రెడ్డి ఒక్కరే అడ్డుగా ఉన్నారన్న విషయంలో ఎవరికి ఇంకో అభిప్రాయం ఉందనుకోవడానికి అవకాశం లేదు. ఉప ఎన్నికల నేపథ్యంలో రాజశేఖర రెడ్డి మాట తీరు మార్చారు కానీ ఆయన ఒక్కరే ఇప్పుడు తెలంగాణకు అడ్డు అని తెలంగాణ ప్రేమికులు, ఉద్యమకారులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని దిగ్విజయ్ సింగ్, మన్మోహన్ సింగ్ లాంటి పెద్దలు కూడా పలుమార్లు నర్మగర్భంగా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ, ఎఐసిసి సముఖంగానే ఉంది కానీ ముఖ్యమంత్రి ససేమిరా వద్దంటున్నారని వారు తెలంగాణ కావాలని అడిగినవారికి పలుమార్లు పలు సందర్భాల్లో చెప్పారు.
నెల రోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సంతకాలు సేకరించిన విషయమే తనకు తెలియదన్నాడు, తర్వాత ఐఆర్ సిసి నాయకులు సోనియాగాంధీని కలవడానికి ముందు హడావిడిగా ఈ విషయాన్ని వారు చెప్పారు, నిజంగా ఆ విషయం నాకు తెలియదు. అందులో నా ప్రమేయం లేదు అని విస్పష్టంగా వివరించారు. ఆయనే ఇప్పుడు ఆ కార్యం చేసింది మేమే అని చెప్తున్నారు. అదే నోటితో మాట తప్పడం, ఆసత్యం పలకడం మా ఇంటావంటా లేదు అంటున్నారు.
పైగా 120 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి ఏకరువు పెట్టడం... పార్టీ సచ్ఛీలతను వివరించ యత్నించడం ఆయన గడసరితనానికి సందర్భోచితంగా మాట్లాడే తత్వానికి నిదర్శనం. కింది స్థాయి మార్కెటింగ్ సిబ్బంది, పిఆర్వోలు ప్రచార ఆర్భాటం కావాలి అనుకొని మూడవ శ్రేణి కవివరేణ్యులకు ఇలాంటి మనస్తత్వం మాటకారి తనం నప్పుతుంది కాని రాష్ట్రాధినేతలకు నప్పదు.
తెలంగాణ విషయం మాట్లాడాం, కానీ తెలంగాణ ఇస్తామని మేము ఎప్పుడూ అనలేదు అని మరో సందర్భంలో మీరు టెక్నికల్ గా అనుభవజ్ఞులైన న్యాయవాదిలా అన్నారు. తెలంగాణ పార్టీ రుమాలును మెడలో వేసుకోవడం మీ అధినేత్రికి వేయడం తెలంగాణ ఇస్తామని అనే మాటతో సమానం కాదా. పంచపాండవులు మంచంకోళ్లలాగా ముగ్గురు అని రెండు వేళ్లు చూపినట్లు మాట్లాడ్డం ఉత్తమ పురుషుల లక్షణం కానేకాదు.
తెలంగాణ పట్ల సోనియాగాంధీ సానుకూలంగా మాట్లాడిన వీడియో టేపులున్నాయి. వీడియోలు అబద్ధం చెప్పవు కదా. రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణకి అభివృద్ధియే నిజం అయితే కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఎందుకు గెలువలేదు.
కడప జిల్లా బిడ్డగా తెలంగాణ పట్ల మీరు సానుకూలంగా ఉండకపోవడంలోని సహేతుకత తెలంగాణవారికి అర్థమవుతున్నది. మీ స్థానంలో ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారు. నిజానికి మీ మీద ఫిర్యాదు కూడా లేదు. కాని తెలంగాణ బిడ్డలు, వారి మాయముంతలు ఇక్కడే ఉన్నాయి. వారి తాతముత్తాతల, అమ్మమ్మ నానమ్మల మాయిముంతలు, సమాధులు ఇక్కడే ఉన్నాయి.
జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, జానారెడ్డి, జైపాల్ రెడ్డి, సబితారెడ్డి, సురేష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సంతోష్ రెడ్డి, తూర్పూ జయప్రకాశ్ రెడ్డి, మందాడి సత్యనారాయణరెడ్డి, సుధీర్ రెడ్డి, డి. శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్, షబ్బీర్ అలీ తదితరులు అలా అల్పంగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. వంచనకు, ద్రోహచింతనకు, అధికార దాహానికి ప్రతిరూపులైన ఆ బిడ్డలను చూసి తెలంగాణ తల్లి, తెలంగాణ ప్రజలు అత్యధికులు అసహ్యించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications