బాబుకు బాలయ్య భయం

బాలయ్యను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను, జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగు యువత అధ్యక్షుడిని చేయాలనే డిమాండ్ పార్టీ కార్యకర్తల నుంచి నేరుగానే వస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే బాలయ్య రెండో స్థానంలో ఉండాల్సిందే. అందుకు బాలయ్య సమ్మతిస్తారా అనేది మరో సమస్య. ఉంటే అగ్ర భాగాన ఉండాలనేది బాలకృష్ణ భావిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. లేకపోతే పార్టీ పోలిట్ బ్యూరోలో ఆయనకు స్థానం కల్పించాలనే ఆలోచన కూడా ఒక వైపు సాగుతోంది. కానీ, అందుకు హరికృష్ణ అడ్డుగా మారారు. ఇప్పటికే హరికృష్ణ పోలిట్ బ్యూరోలో ఉన్నారు. బాలయ్యను కూడా అందులో చేర్చుకుంటే కుటుంబానికి పెద్ద పీట వేస్తున్నారనే భావన కలిగి వ్యతిరేక పవనాలు వీస్తాయనే భయం కూడా ఉంది. అయితే పోలిట్ బ్యూరో శాశ్వత ఆహ్వానితుడిగా బాలయ్యను నియమించాలనే మరో ఆలోచన కూడా సాగుతోంది. ఇందుకు కూడా బాలయ్య సుముఖంగా ఉండకపోవచ్చు.
ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే పార్టీ అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. బాలయ్యకు పార్టీ అధ్యక్ష పదవి అప్పగించడమంటే వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిస్తే బాలయ్యనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని చంద్రబాబు అనుతించరనేది వేరుగా చెప్పాల్సిన పని లేదు.
అయితే బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ల అవసరం మాత్రం తెలుగుదేశం పార్టీకి పెరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కు సినిమాల్లో ఇంకా భవిష్యత్తు ఉందనే ఉద్దేశంతో అవసరం మేరకు వాడుకుని తర్వాత పక్కన పెట్టే పరిస్థితులు ఉంటాయి. కానీ బాలయ్య విషయంలో అది జరగదు. పార్టీని పూర్తిగా బాలయ్యకే అప్పగించాల్సి ఉంటుంది. మొత్తం మీద, బాలయ్య అంశం చంద్రబాబుకు కక్కలేని మింగలేని పరిస్థితిని కల్పిస్తోంది.












Click it and Unblock the Notifications