ఇద్దరూ ఒక్కటే

చిన్నా చితక పార్టీలు ఉండకూడదని ఈ ఇద్దరు నాయకులు భావిస్తున్నారు. తమ రెండు పార్టీలే ఉండాలనే వ్యూహరచన చేసి వారు అమలు పరుస్తున్నట్లు రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. ప్రజారాజ్యం, తెలంగాణ రాష్ట్ర సమితిలపై అందుకే వారు దృష్టి పెట్టారు. ఆ పార్టీలను ఖాళీ చేయించే పనికి పూనుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి తమ మాజీ నేతలను తిరిగి రాబట్టుకునే పనిలో చంద్రబాబు పడ్డారు. అలాగే తెరాసలో ఉన్న మాజీలను కూడా తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే దేవేందర్ గౌడ్ వంటి సీనియర్ నాయకులను కూడా తిరిగి తీసుకోవడానికి చంద్రబాబు వెనకాడడం లేదు. ఒక్కరొక్కరే ప్రజారాజ్యం నుంచి తెలుగుదేశంలో చేరిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇందులో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి స్వయంకృతాపరాధం ఉన్న మాట నిజమే. ఆ పరిస్థితిని చంద్రబాబు తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.
కాంగ్రెసు పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)పై దృష్టి పెట్టింది. ఎన్నికలు ముగిసిన మర్నాటి నుంచే ఆ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావుకు వైయస్ రాజశేఖర రెడ్డి నిద్ర పట్టకుండా చేస్తున్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి, కె. కరుణ మహేందర్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి వంటి ద్వితీయ స్థాయి నాయకులనే కాకుండా విజయశాంతి వంటి ప్రథమ శ్రేణి నాయకులను కూడా పార్టీలోకి తీసుకునేందుకు అవసరమైన కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి అమలు చేస్తున్నారు. సిద్ధాంతాలు, వ్యక్తిగత నిబద్ధతలు లేని నాయకులు కాంగ్రెసులోకి, తెలుగుదేశంలోకి వెళ్లిపోవడానికి ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. తెలంగాణలో తెరాస వల్లనే కాంగ్రెసుకు ఇబ్బందులు ఎదరవుతున్నాయి. అందువల్లనే వైయస్ ప్రధానంగా తెరాసపై దృష్టి పెట్టారు.
రాష్ట్రంలో రెండు పార్టీల వ్యవస్థ మాత్రమే ఉండాలనేది అటు రాజశేఖర రెడ్డి, ఇటు చంద్రబాబుల ఆలోచన. అందుకే ఇతర పార్టీలను బలహీన పరిచి వాటిని ఉనికి దెబ్బ తీసే పనికి పూనుకున్నారు. దీంతో ప్రస్తుతం తెరాస, ప్రజారాజ్యం పార్టీల నాయకులు రోజుకొకరు అసమ్మతి గళం విప్పుతున్నారు. ఈ రకంగా ఆ రెండు పార్టీలు సంక్షోభంలో పడ్డాయి. అయితే తెలంగాణ నినాదం నాయకుల వలసల వల్ల రూపుమాసిపోతుందా అనేది సందేహమే.












Click it and Unblock the Notifications