బాబు 'కేంద్ర' వ్యూహం

మతతత్వ బిజెపిని వ్యతిరేకించే వైఖరితో వామపక్షాలు కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎకు మద్దతిచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. కాంగ్రెసుకు తమ అంటరానిదేమీ కాదని ఇప్పటికే సిపిఎం నేతలు అంటున్నారు. బిజెపిని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అన్నారు. దీన్ని బట్టి సిపిఎం, సిపిఐలు కాంగ్రెసుకు మద్దతిచ్చే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. వామపక్షాలు కాంగ్రెసు వైపు వెళ్తే ఏం చేయాలనే వ్యూహరచన కూడా చంద్రబాబు చేసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. బిజెపికి నేరుగా చంద్రబాబు మద్దతిచ్చే స్థితి లేదని అంటున్నారు. బిజెపి ముందు ఆయన రాజీ ఫార్ములాను ముందు పెట్టనున్నట్లు తెలుస్తోంది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను తమకూ, బిజెపికీ ఆమోదయోగ్యమైన నేతగా ప్రధాని పదవికి ముందుకు తేవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ స్థితిలో పలు ప్రత్యామ్నాయాలు ముందుకు రావచ్చు. బిజెపికి, తృతీయ కూటమికి ఆమోదయోగ్యమైన ఫార్ములా చంద్రబాబుకు అనువుగా ముందుకు రావచ్చునని సమాచారం. ఈ సమయంలో తన పేరు కూడా ప్రధాని పదవికి చర్చకు వచ్చే అవకాశాన్ని కల్పించాలనేది ఆయన ఎత్తుగడగా భావిస్తున్నారు.
అయితే, ఈ నెల 16వ తేదీన ఫలితాలు వెలువడిన తర్వాత 18వ తేదీన తృతీయ కూటమి సమావేశం జరగనుంది. ఈ సమావేశం లోగానే వామపక్షాల వైఖరి స్పష్టమవుతుంది. తన వ్యూహరచన అమలుకు చంద్రబాబు ఈ నెల 18వ తేదీ సమావేశాన్ని వేదికగా మార్చుకోవచ్చు. వామపక్షాలు కాంగ్రెసు వైపు వెళ్లే స్థితి ఉంటే బిఎస్పీ నేత మాయావతి, జెడిఎస్ నేత దేవెగౌడ వంటి నేతల పేర్లను కూడా బిజెపితో రాజీకి ప్రధాని అభ్యర్థులుగా తృతీయ కూటమి ముందుకు తేవచ్చు. కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకుని బిజెపిపై ఒత్తిడి తెచ్చే వ్యూహాన్ని చంద్రబాబు అనుసరించవచ్చు.












Click it and Unblock the Notifications