కీ ప్లేయర్ చిరంజీవే

తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెసు పార్టీ ఘోరంగా దెబ్బ తినే అవకాశం ఉంది. సోనియా, రాహుల్ గాంధీ ప్రచార సభలకు కూడా పెద్దగా ప్రజలు రాకపోవడం, స్పందన పెద్దగా లేకపోవడం ఆ విషయాన్ని పట్టిస్తోందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేకర రెడ్డికి కూడా తెలంగాణలో పెద్గగా ఆదరణ లభించలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), సిపిఎం, సిపిఐలతో తెలుగుదేశం పార్టీ మహాకూటమి ఏర్పాటు చేయడంతోనే కాంగ్రెసు విజయావకాశాలు తెలంగాణలో గణనీయంగా దెబ్బ తిన్నాయి.తెలంగాణను కాంగ్రెసు మోసం చేసిందనే భావన ప్రజల్లో పేరుకుపోయింది. తెలంగాణపై సోనియా కర్ర విరగకుండా పాము చావకుండా మాట్లాడడం, రాహుల్ గాంధీ ఆ ప్రస్తావనే చేయకపోవడం తెలంగాణ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది కూడా. 119 స్థానాలున్న ఈ ప్రాంతంలో మహా కూటమికి 70 నుంచి 80 సీట్లు సాధించే అవకాశాలున్నట్లు అంచనాలు నడుస్తున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ బలహీనంగా ఉన్న హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలో తమకు ఎక్కువ సీట్లు వస్తాయని కాంగ్రెసు నాయకులు నమ్ముతున్నారు. దక్షిణ తెలంగాణలో తెరాస బలం పెద్గగా లేకపోవడం కూడా తమకు లాభిస్తుందని భావిస్తున్నారు. అయితే మహబూబ్ నగర్ లోకసభ స్థానానికి తెరాస అధ్యక్షుడు కెసిఆర్ పోటీ చేస్తుండడం, తెలుగుదేశం క్యాడర్ బలంగా ఉండడం వంటి కారణాల వల్ల కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
ఇక, రాయలసీమలోనూ, కోస్తాలోనూ కాంగ్రెసు పార్టీ అనుకున్నంత మెరుగ్గా ఏమీ లేదు. కోస్తాలో తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల మధ్య ఓట్లు చీలిపోయి తమకు లాభిస్తుందని కాంగ్రెసు భావించింది. అయితే ఈ ప్రాంతంలో మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ ప్రాంతంలో మూడు పార్టీలు సీట్లను పంచుకునే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు సీట్లను పంచుకునే అవకాశం ఉంది. రాయలసీమలో సాధారణంగా కాంగ్రెసుకు అధిక సీట్లు వస్తుంటాయి. అయితే ఈసారి పరిస్థితి కాంగ్రెసుకు అనుకున్నంత అనుకూలంగా లేదనే మాట వినిపిస్తోంది. ఈ రెండు ప్రాంతాల్లో 175 శాసనసభా స్థానాలున్నాయి.
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు సమానంగా సీట్లు పంచునే అవకాశాలున్నాయని, ప్రజారాజ్యం పార్టీకి 30 నుంచి 40 స్థానాలు వస్తాయని అంచనాలు వేస్తున్నారు. ఈ స్థితిలో ప్రభుత్వ ఏర్పాటుకు చిరంజీవి మద్దతు ఏ పార్టీకైనా అవసరమవుతాయని భావిస్తున్నారు. దాంతో ప్రభుత్వ ఏర్పాటులో చిరంజీవి కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని చెబుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అంచనాలు వేస్తున్నారు.












Click it and Unblock the Notifications