రోశయ్యను ఆదుకున్న వరదలు

Rosaiah
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్యను వరదలు ఆదుకున్నాయి. రాజకీయంగా స్వపక్షం నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్న ఆయనకు రక్షణగా వరదలు వచ్చాయి. వరదలు రావడానికి ముందు కాంగ్రెసు రాజకీయాలు భగ్గుమంటున్నాయి. రోశయ్యకు వ్యతిరేకంగా, వైయస్ జగన్ కు అనుకూలంగా కాంగ్రెసులోని కొంత మంది మంత్రులు, శాసనసభ్యులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న సందర్భం అది. మంత్రి కొండా సురేఖ, శాసనసభ్యులు ఆనం వివేకానందరెడ్డి వంటి వారు కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) నేతను ఎన్నుకోవాలని అంటున్నారు. రోశయ్యను సిఎల్పీ ఎన్నుకోలేదని, అందువల్ల రోశయ్య పూర్తి స్థాయి ముఖ్యమంత్రి కారని వాదిస్తూ వచ్చారు.

అట్టుడుకుతున్న పార్టీ రాజకీయాలను చక్కదిద్దడానికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో పాటు పార్టీ అధిష్టానం కూడా నడుం బిగించింది. ఈ సమయంలో వరదలు రావడంతో కాంగ్రెసు రాజకీయాలు చల్లబడ్డాయి. రోశయ్య వ్యతిరేకులు మాట్లాడలేని స్థితి కల్పించాయి. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని పట్టుబడుతున్నవారికి ఆశనిపాతమే అయ్యాయి. రాష్ట్రంలోని ఐదు జిల్లాలను వరదలు తాకిన సమయంలో రాజకీయాలను ముందుకు తెస్తే ప్రమాదమనే కారణంతో వారంతా నోరు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయాన్ని రోశయ్య సద్వినియోగం చేసుకున్నారు. వరద పరిస్థితిని సమీక్షిస్తూ సచివాలయంలోనే మకాం పెట్టారు. మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. తన ఆదేశాలను ఖాతరు చేయకుండా వరద తాకిడి ప్రాంతాల్లోకి వెళ్లకపోతే మంత్రులపైనే ప్రజలకు వ్యతిరేక భావన ఏర్పడుతుందనే విషయం రోశయ్యకు తెలుసు. అదే సమయంలో పార్టీ అధిష్ఠానం ఆగ్రహానికి కూడా గురి కావాల్సి వస్తుంది. దీంతో తప్పనిసరి పరిస్థితిలో మంత్రులు, శాసనసభ్యులు వరద తాకిడి ప్రాంతాలకు కదిలారు.

జగన్ అనుకూల రాజకీయాలను దెబ్బ కొట్టేందుకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పర్యటన కూడా బాగా పనికి వచ్చింది. ఆమె వరద తాకిడి ప్రాంతాల పర్యటనకు వచ్చినట్లే వచ్చి రోశయ్యకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. రోశయ్యకు మద్దతుగా అధిష్ఠానం ఉందనే సంకేతాలను ఆయన జగన్ వర్గీయులకు ఇచ్చినట్లయింది. మరో నాలుగైదు రోజుల్లో ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా వరద తాకిడి ప్రాంతాల పర్యటనకు రానున్నారు. రాష్ట్రంలో రోశయ్య నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు వరద పరిస్థితులను పార్టీ అధిష్టానం వాడుతున్నట్లు కనిపిస్తోంది. వరద తాకిడి పరిస్థితుల విషయంలో సమర్థంగా వ్యవహరించారంటూ సోనియా రోశయ్యకు కితాబు ఇచ్చారు. మొత్తం మీద, రాష్ట్రానికి వచ్చిన గండం రోశయ్య గండాన్ని గట్టెక్కిస్తుందా, చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+