'మాయ' జాతకం

కాంగ్రెసు పార్టీ నేతృతంలోని యుపిఎకు 200 దాకా సీట్లు వస్తాయని చాలా సర్వేలు చెబుతున్నాయి. బిజెపి నాయకత్వంలోని ఎన్డీఎకు కూడా దాదాపు అదే మేరకు లోకసభ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. సిపిఎం నేతృత్వంలోని తృతీయ కూటమికి 150 దాకా సీట్లు రావచ్చు. దీన్ని బట్టి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 సీట్లు ఏ కూటమి కూడా గెలుచుకునే అవకాశాలు లేవని అర్థమవుతోంది. ఇటువంటి పరిస్థితిలోనే 1996లో బిజెపి నేత అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధాని అయ్యారు. మెజారిటీ లభించకపోవడంతో 13 రోజులకే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇదే రాజకీయ వాతావరణం ఈసారి ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఆ తర్వాత తృతీయ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. రెండేళ్లలో ఇద్దరు ప్రధానులను దేశం చూసింది. ఆ తర్వాత కుప్పకూలింది. ఈసారి మరోమారు తృతీయ ఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు.
అతి పెద్ద పార్టీగా అవతరించడం ద్వారా కాంగ్రెసు పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రావచ్చు. కానీ వామపక్షాలు మద్దతివ్వకపోతే అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే బిఎస్పీ నేత మాయావతి మద్దతు అవసరం రావచ్చు. అందుకు మాయావతి సహకరిస్తారని చెప్పలేం. ఈ స్థితిలో మాయావతి స్వయంగా ప్రధాని అభ్యర్థిగా ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఇటు కాంగ్రెస్, బిజెపిల్లో ఏదో ఒక పార్టీ, అటు తృతీయ ఫ్రంట్ సహకారంతో ఆమె ప్రధాని అభ్యర్థిగా ముందుకు వచ్చే పరిస్థితులు ఏర్పడతాయని అంటున్నారు. రోటేషన్ పద్ధతిపై ప్రధాన మంత్రి పదవిని చేపట్టే ఒప్పందంపై కూడా ఆమె ప్రధాని అయ్యే అవకాశాలు లేకపోలేదు.
ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువలో ఎక్కువగా మాయావతికి 38 శాతం వరకు, మన్మోహన్ సింగ్ కు 33 శాతం వరకు, ఎల్ కె అద్వానీకి 28 శాతం వరకు అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, చంద్రబాబు నాయుడు, నవీన్ పట్నాయక్, రాం విలాస్ పాశ్వాన్, నితీష్ కుమార్ వంటి వారికి 28 శాతం వరకు అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. అయితే మాయావతికి ఉత్తరప్రదేశ్ లో 50 నుంచి 60 వరకు లోకసభ స్థానాలు వస్తేనే ఆమెకు అవకాశాలు ఉంటాయి. ఈ స్థితిలో అటు ఎన్డీయెతోనూ, ఇటు కాంగ్రెస్ తోనూ కలిసిపోయే వెసులుబాటు మాయావతికి ఉంది. దానివల్లనే ఆమెకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, ములాయం సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి నాయకులు మాయావతిని అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. అయితే వారికి తగిన స్థానాలు వస్తేనే అందుకు అవకాశాలుంటాయి. మొత్తం మీద, మాయావతికి మహర్జాతకం పడుతుందా, లేదా అనేది కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications