విభజనకు కెసిఆర్ తోనే చిక్కు?

తెలంగాణ ఆందోళనలో భాగంగా హైదరాబాదులోని ఆంధ్ర ప్రాంత పారిశ్రామికవేత్తలకు, సినీ ప్రముఖులకు నష్టం కలిగించే చర్యలే వారికి ఇబ్బందికరంగా పరిణమించాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సీమాంధ్ర పారిశ్రామికవేత్తల స్థితిపైనే ఆందోళన వ్యక్తమవుతోంది. కెసిఆర్ దూకుడు, రెచ్చగొట్టే పద్ధతి వారి అనుమానాలకు కారణమని అంటున్నారు. దీని వల్ల కాంగ్రెసు పార్టీకి నష్టం కలిగించ వచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రవిభజనపై ఇప్పటికే కాంగ్రెసు అధిష్టానం ఇరు ప్రాంతాలు సీనియర్ నాయకులతో, మేధావులతో చర్చలు జరిపినట్లు సమాచారం. అందుకు తగిన విధివిధానాలపై కూడా సమీక్ష జరిపినట్లు సమాచారం. సూత్రప్రాయంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకున్నప్పటికీ కెసిఆర్ దూకుడు, బలాన్ని, బలగాన్ని దెబ్బ తీయడం ఎలా అనే విషయంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ ఉద్యమం వల్ల ఇప్పటి వరకు ఎక్కువగా నష్టపోయింది కూడా కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన పెద్దలే కావడం విశేషం. హైదరాబాదులో ఎక్కువగా కోస్తాంధ్ర పారిశ్రామికవేత్తల ఆస్తులే ఉండడం అందుకు కారణం. తెలంగాణ ఆందోళనల వల్ల వారి వ్యాపార కార్యకలాపాలకు తీవ్రంగా నష్టం జరిగింది. ఆ నష్టాన్ని వారు మరింతగా భరించేందుకు సిద్ధంగా లేరని చెబుతున్నారు. అదే విధంగా తెలుగు సినిమాలు ప్రదర్శించలేని స్థితి, సినిమా షూటింగులు జరపలేని వాతావరణం ఏర్పడింది. తెలుగు సినీ ప్రపంచాన్ని ఏలుతున్నవారు, లాభాలు పొందుతున్నవారు కూడా కోస్తాంధ్రకు, రాయలసీమకు చెందినవారే. దీనివల్ల కూడా తాము నష్టపోయే ప్రమాదం ఏర్పడిందనే ఆందోళన సినీ రంగంలో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి ముదిరితే తమ పరిస్థితి మరింతగా దిగజారే పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుత వాతావరణంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకించకపోవడమే మంచిదని అభిప్రాయం కోస్తాంధ్ర, రాయలసీమ పెద్దల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాదులో తమ ఆస్తుల పరిస్థితి ఏమిటనే ఆందోళన మాత్రమే వారిని వెనక్కి లాగుతోంది. కెసిఆర్ ప్రాబల్యం కొనసాగితే తమ ఆస్తులకు రక్షణ ఉండకపోవచ్చుననేది వారి ఆందోళనకు అసలు కారణంగా చూపుతున్నారు. దీంతో కాంగ్రెసు తెలంగాణ నాయకులు సీమాంధ్ర నాయకులకు హామీని ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. కెసిఆర్ ను బలహీనపరిచేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలోని ఆందోళనల తీవ్రతను తగ్గించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications