హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్య మనస్తాపం

By Staff
|
Google Oneindia TeluguNews

Rosaiah
ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత సంభవిస్తున్న పరిణామాల పట్ల ప్రస్తుత ముఖ్యమంత్రి కె. రోశయ్య తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి భౌతిక కాయాన్ని పక్కనే ఉంచుకుని వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గీయులు రాజకీయాలు చేయడం ఆయనకు తీవ్ర కలతను రేపినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసే సమయంలో వైయస్ జగన్ అనుచరులు జగన్ కు మద్దతుగా శాసనసభ్యుల సంతకాలు సేకరించడం, ఆ సంతకాలతో ఒక వినతి పత్రాన్ని గవర్నర్ కు సమర్పించడం ఆయనకు మింగుడు పడడం లేదు. వైయస్ భక్తులమని చెప్పుకుంటున్న వారే ఇంత దారుణంగా ఎలా వ్యవహరించగలుగుతారనేది ఆయన సందేహంగా చెబుతున్నారు.

అంతేకాకుండా, మంత్రి వర్గ సమావేశంలో ఒత్తిడి చేసి తీర్మానాన్ని చేయించడం కూడా రోశయ్యకు రుచించలేదని తెలుస్తోంది. మంత్రి వర్గ సమావేశంలో వైయస్ మృతికి సంతాప తీర్మానం చేస్తూనే ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ను చేయాలని కాంగ్రెసు అధిష్ఠానవర్గాన్ని కోరుతూ తీర్మానం చేయించారు. ఇది అంత మంచి పద్ధతి కాదని రోశయ్య తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఆయన మీడియా ప్రతినిధుల వద్ద మాట్లాడిన తీరు కూడా ఆ విషయాన్ని పట్టిస్తోంది. ఒత్తిడి తెచ్చి తీర్మానం చేయించడం అంత మంచి పద్ధతి కాదని ఆయన ఆయన శనివారంనాడు అన్నారు. ఈ విషయాన్ని తెలుగు మీడియా సరిగా పట్టుకోలేకపోయింది. తాను ఐదుగురు ముఖ్యమంత్రులు వద్ద పనిచేశానని, తనపై ఏ విధమైన విమర్సలు రాలేదని కూడా ఆయన అన్నారు. ముఖ్యమంత్రి విషయంలో పార్టీ అధిష్ఠానవర్గం మాటకు కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. అధిష్ఠానవర్గం తనను బావిలో దూకమన్నా దూకుతానని ఆయన అన్నారు. ఈ మాటలను బట్టి ఆయన మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

రోశయ్యను దీర్షకాలం కొనసాగిస్తారనే ఉద్దేశంతోనే వైయస్ అనుచరులైన మంత్రులు తిరిగి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి నిరాకరించినట్లు చెబుతున్నారు. రోశయ్యను మరి కొంత కాలం కొనసాగించి పరిస్థితి చక్కబడిన తర్వాత కొత్త నేత ఎంపికపై ఆలోచన చేయాలనేది పార్టీ అధిష్ఠాన వర్గం ఆలోచనగా కూడా ప్రచారం సాగింది. అయితే, వేడిలోనే తేల్చుకోవాలని వైయస్ వర్గీయులు భావించినట్లున్నారు. ఆలస్యం అమృతం విషమనే ఉద్దేశంతో వారు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏ మాత్రం జాప్యం చేయకుండా ముఖ్యమంత్రి పీఠంపై చూడాలని ఒత్తిడి మొదలు పెట్టారు. ఈ ఒత్తిడి ప్రతికూలంగా మారే ప్రమాదం ఏర్పడిందని గ్రహించిన కెవిపి రామచందర్ రావు రంగంలోకి దిగారు.

ఇదే సమయంలో తన సామర్థ్యంపై, వ్యక్తిత్వంపై చులకనగా మాట్లాడడం కూడా రోశయ్యను బాధించినట్లు చెబుతున్నారు. నిజానికి, ఇంతకు ముందు ఉన్న అందరు ముఖ్యమంత్రులు రోశయ్య సంపూర్ణ మద్దతు లేకుండా ప్రతిపక్షాల దాడులను ఎదుర్కోవడం కష్టంగానే ఉండేది. చాలా హేతుబద్దంగా మాట్లాడే రోశయ్య వైయస్ రాజశేఖర రెడ్డి విషయంలో కొన్ని హద్దులు కూడా దాటి తన వ్యక్తిత్వానికి భిన్నంగా వ్యవహరించారని, వైయస్ కు ఆ విధంగా మద్దతిచ్చారని అంటారు. అటువంటి తనపై వైయస్ వర్గీయులు అనుమానాలు వ్యక్తం చేయడం, తన సామర్థ్యాన్ని తక్కువ చేయడం ఆయనకు తీవ్ర మనస్తాపాన్ని కలిగించినట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X