రామోజీపై జగన్ ఎదురుదాడి

ఈనాడు గ్రూపు సంస్థలో అతను పెట్టిన నిధులు రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థల ద్వారా కంపానీ చేతికి వచ్చినట్లు వెల్లడైందని సాక్షి రాసింది. ఈ నిధుల మళ్లింపునకు 37 రోజుల వ్యవధిలో అర డజను షెల్ కంపెనీలు పుట్టుకొచ్చాయట. ఆ రకంగా రెండు వేల కోట్ల రూపాయలు చేతుల మారాయని సాక్షి దినపత్రిక ఆరోపించింది. రామోజీ రావు కంపెనీల్లో డబ్బులు పెట్టడానికే ఆ కంపెనీలు పుట్టుకొచ్చాయని వ్యాఖ్యానించింది. ఇందుకు గాను పనులు ఎంత వేగంగా జరిగిపోయాయో కూడా సాక్షి పత్రిక రాసింది.
రిలయన్స్ రామోజీ పట్ల ఔదార్యం చూపడానికి కృష్ణా - గోదావరి బేసిన్ లోని డీ - 6 చమురు బ్లాకేనని ఆరోపించింది. ఈ బ్లాకును రిలయన్స్ బహిరంగ వేలంలోనే దక్కించుకున్నా ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని జగన్ పత్రిక వ్యాఖ్యానించింది. రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ కంపెనీలు ట్రాన్స్ కోతో కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వీలుగా రిలయన్స్ నుంచి వారికి గ్యాస్ సరఫరా అవుతుందంటూ ఒప్పందాలు కుదిర్చింది కూడా చంద్రబాబేనని వ్యాఖ్యానించింది. ఈ సంబంధం వల్లనే దొడ్డిదారిన రిలయన్స్ రామోజీ కంపెనీలకు నిధులు మళ్లించిందని సాక్షి దినపత్రిక ప్రధాన ఆరోపణ. ఈ లావాదేవీలపై సాక్షి తన వార్తా కథనంలో సందేహాలను కూడా వ్యక్తం చేసింది. షెల్ కంపెనీలు ఎలా ఏర్పడ్డాయనే విషయంపై కూడా వివరంగా రాసింది.
ఏమైనా తెలుగు మీడియా ఇతరేతర ప్రయోజనాల కోసం సాధనాలుగా మారిన విషయాన్ని జగన్, రామోజీల మధ్య సాగుతున్న సమరం తెలియజేస్తోంది. ఈ రెండు పత్రికల్లో ప్రచురితమైన వార్తా కథనాల్లో వాస్తవాలు ఏదో మేరకు ఉన్నాయనేది నమ్మడానికి వీలుంది. అయితే మీరు చేసినప్పుడు మేం చేస్తే తప్పేమిటనే పద్ధతిలోనే సమరం సాగుతోంది తప్ప ప్రజా ప్రయోజనాలు గాలికి వదిలేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications