బాబు టార్గెట్ కెసిఆర్ ఫ్యామిలీ

తెరాస నేతలు అందులోనూ చంద్రశేఖర్ రావు ఆంధ్రా పాలకులను , తెలంగాణకు చెందిన కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ నాయకులను దద్దమ్మలు, చవటలు, సన్నాసులు అన్న సందర్భాల్లో సైతం తెలంగాణ టిడిపి నేతలు వాటిని ఖండించి వదిలేసేవారు. కాని ఇప్పుడు వారు తీవ్ర స్థాయిలో తెరాసపైన విరుచుకు పడుతున్నారు. నాగం జనార్థన్ రెడ్డి, దేవేందర్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు తెరాస మాటలకు చాలా సందర్భాల్లో స్పందించారు.
గత సంవత్సరం కెసిఆర్ నిరాహార దీక్ష ప్రారంభించినప్పటినుంచి ఏదో ఒక రూపంలో తెలంగాణ ఉద్యమం బలపడుతోంది. విద్యార్థులు, డాక్టర్లు, లాయర్లు తమ తమ పోరాటాలు కొనసాగించారు. ఈ ఉద్యమాల్లో కెసిఆర్ హస్తం ఉందనేది ఎంతవరకు నిజమైనా వీటివల్ల లాభపడేది మాత్రం తెలంగాణ కోసం పోరాడుతున్న తెరాసనే. ఇక కాంగ్రెస్ ఆధికారంలో ఉంది కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ భయపడాల్సిన పని లేదు. అందలోనూ ఆది జాతీయపార్టీ. ఇక మిగిలింది టిడిపి. రాష్ట్రంలో ఉన్న 294 సీట్లలో 119 తెలంగాణలో ఉన్నవి. ఉద్యమంతో తెరాస, అధికారంతో కాంగ్రెస్ ఇక్కడ వాటి పట్టు పెంచుకుంటున్నాయి. ఈ పార్టీలకు విరుద్దంగా తెలుగుదేశానికి తెలంగాణలో కార్యకర్తలు, రెండవ తరగతి నాయకులు రోజురోజుకు తగ్గుతున్నారు. ఉద్యమం కారణంగా వారు తెరాసను ఆశ్రయిస్తున్నారు. పార్టీని ఇక్కడ నిలబెట్టుకోవాలంటే తెలుగు దేశం ప్రత్యామ్నాయం ఆలోచించాలి. ఇంతకుముందే వారు తెరాసకు ధీటుగా బాబ్లీ తదితర ఉద్యమాలు చేపట్టారు. ఆ ఉద్యమాలు చేపట్టింది తెలుగు దేశం ఆయినప్పటికీ వారు లాభపడింది మాత్రం శూన్యం. మొన్న ఉప ఎన్నికలకు ముందు ఏకంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఉద్యమించి మహారాష్ట్ర పోలిసులచే అరెస్టు కాబటి వారంపాటు ఊచలు లెక్క పెట్టారు. అయినప్పటికీ వారిపై తెలంగాణలో సానుభూతి తాత్కాలికమే. తెలంగాణలోని తెలుగుదేశం కార్యకర్తలు, రెండవస్థాయి నాయకులు వారి వారి ప్రాంతాల్లో పార్టీని నిలబెట్టుకోవడానికి ప్రత్యేక తెలంగాణ వాదాన్ని లేవనెత్తక తప్పడం లేదు. చంద్రబాబులా నాన్చితే మొదటికే మోసం వస్తుందని వారు పార్టీని వీడలేక తెలంగాణకు తెలుగు దేశం వ్యతిరేకం కాదనే నినాదం అందుకున్నారు. అయినప్పటికీ తెలుగు దేశం ఖాళీ అవుతూనే ఉంది.
తెలంగాణలో ఉన్న తెదేపా మొదటిస్థాయి నాయకులు ఇన్నాళ్లు చంద్రబాబు చెప్పింది విన్నారు. కాని ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్న ఇప్పుడు కూడా తాము మాట్లాడకుంటే తెలంగాణలో తెలుగు దేశం ఉనికికే ప్రమాదమని గ్రహించారు. ఉద్యమం ఒక్కటి చేస్తేనే సరిపోదని, అలా చేయటంవల్ల లాభపడుతున్నది తెరాసననే విషయాన్ని అర్థం చేసుకున్న నాయకులు ఎదురుదాడి ప్రారంభించారు. తెలంగాణ కేవలం తెరాస వల్లనే రాదని అందరూ పోరాడితేనే వస్తుందని మొన్న నాగం వ్యాఖ్యానించారు. అంటే తెలంగాణ ఉద్యమం క్రెడిట్ తెరాసది మాత్రమే కాదనే అందరిదీ అనే విషయాన్ని చెప్పాలని ఆయన చూస్తున్నట్టు అర్థమవుతోంది. ఆ వ్యూహంలో భాగంగానే నాగం, దేవేందర్ వంటి నాయకులు తెరాసపై తీవ్ర విమర్శలు చేస్తున్నట్టు భావించవచ్చు.
అంతేకాకుండా తెలంగాణ వస్తే తెలంగాణకు ఆధినేతగా నాగం, దేవేందర్, ఎర్రబెల్లి పోటీ పడే ఆవకాశాలున్నాయి. అయితే తెరాసపై తీవ్ర విమర్శలు చేసి అధినేత ముందు తమను తాము నిరూపించుకునేందుకు వారిలో వారు పోటీ పడుతున్నారు. తెలంగాణ వచ్చి, తెలుగు దేశం అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి వరిస్తుందనే ఉద్దేశ్యం కూడా వీరిలో ఉండి ఉండవచ్చు. దేవేందర్ గౌడ్ 2008లో బయటకు వెళ్లకపోయి ఉంటే ఇప్పుడు ఈ పోటీ ఉండేది కాదు. ఎందుకంటే తెలుగు దేశంలో అప్పటి వరకు ఆయనే నెంబర్ 2 గా ఉండేవాడు. కాని ఆయన బయటకు వెళ్లడంతో ఈ పోటీ అనివార్యం అయింది. తెలుగు దేశాన్ని జాతీయపార్టీగా తీర్చిదిద్దే పనిలో కూడా చంద్రబాబునాయుడు ఉన్నారు. అందులో భాగంగానే అండమాన్ దీవుల స్థానిక ఎన్నికల్లో తెలుగు దేశం పోటీ చేసింది. అక్కడ 1 సీట్లు కూడా గెలుచుకుంది. మరి కొన్నింటిల్లో రెండవస్థానంలో నిలిచింది.












Click it and Unblock the Notifications