సోనియా చేతిలో లేదా?

పోలవరం ప్రాజెక్టును ప్రస్తుత స్థితిలో నిర్మించవద్దని సీమాంధ్రకు చెందిన పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ కూడా వాదిస్తున్నారు. సీమాంధ్రలోని నాయకుల మధ్య కూడా విభేదాలు పెరుగుతున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ప్రతిస్పందిస్తున్న హర్షకుమార్, బొత్స సత్యనారాయణ వంటి ఆంధ్ర నాయకుల మీద సీమాంధ్రలోని కాంగ్రెసు నాయకులు గుర్రుగా ఉన్నారు. ఆ రకంగా సీమాంధ్రలో రెండు గ్రూపులు పనిచేస్తున్నట్లే తెలంగాణలో కూడా పనిచేస్తున్నాయి. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో పదవులు పొందిన నాయకులకు, విస్మరణకు గురైన నాయకులకు మధ్య వైరం కొనసాగుతోంది. నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డికి మధ్య వైరం ఇలాంటిదే. వైయస్సార్ ను గౌరవిస్తామని అంటూ వైయస్ జగన్ కు దగ్గరగా ఉండే నాయకులకు, ఇతర నాయకులకు మధ్య తెలంగాణలో పడడం లేదు.
మొత్తంగానే, కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణలోని తన వర్గాన్ని వైయస్ వ్యతిరేకులపై ప్రయోగించేందుకు సిద్ధపడుతున్నట్లు అర్థమవుతోంది. అవసరమైతే అధిష్టానాన్ని ధిక్కరించి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు అర్థమవుతోంది. తమపై చర్యలు తీసుకున్నా వైయస్ జగన్ వర్గం బెదరడం లేదు, వెనక్కి తగ్గడం లేదు. పైగా, ఎదురుదాడికి దిగుతున్నారు. ముఖ్యమంత్రి రోశయ్య గానీ, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ గానీ పరిస్థితిని అదుపులోకి తెచ్చే స్థాయిలో పనిచేయడం లేదనే మాట వినిపిస్తోంది.
తెలంగాణలోని కాంగ్రెసు నాయకుల్లో ఒక వర్గం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు దగ్గరవుతున్నట్లు కూడా కనిపిస్తోంది. ఈ వర్గం తమ పార్టీ సీమాంధ్ర నాయకులతో అమీతుమీ తేల్చుకోవడానికే నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. అధిష్టానం ఎవరిని ప్రోత్సహిస్తుందో, ఎవరిని కాదంటుందో అర్థం కాని పరిస్థితి ఉంది. దీంతో కాంగ్రెసు నాయకులు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు, వ్యవహరిస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత మరింతగా అగ్గి రాజుకునే ప్రమాదం ఉందని అంటున్నారు. కాంగ్రెసులోని సీమాంధ్ర, తెలంగాణ నాయకులకు మధ్య పొత్తు కుదిరే వాతావరణం క్రమక్రమంగా దెబ్బ తింటోంది.












Click it and Unblock the Notifications