చిరు పార్టీకి వైభవం సాధ్యమేనా?

అల్లు అరవింద్ వ్యవహార శైలిపై గతంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. చిరంజీవిని కలుసుకోవడానికి, ఆయనకు తమ అభిప్రాయాలు చెప్పుకోవడానికి అల్లు అరవింద్ అడ్డంగా ఉన్నారనేది గతంలో వచ్చిన విమర్శ. తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా అల్లు అరవింద్ వ్యవహరించారని కూడా విమర్శలు వచ్చాయి. పార్టీ వ్యవహారాల విషయంలో చిరంజీవిని పూర్తిగా డార్క్ లో ఉంచారనేది ప్రధాన అభియోగం. అలా ఉండడాన్నే అల్లు అరవింద్ బహుశా గేట్ కీపర్ గా వ్యవహరించడంగా చెప్పుకోవచ్చు. తాను లేకపోతే చిరంజీవి రాజకీయ, సినిమా మనుగడలు కష్టమని, చిరంజీవిని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుందని అల్లు అరవింద్ ప్రగాఢ విశ్వాసం. దానికి తోడు, అల్లు అరవింద్ పార్టీని మూడో ప్రత్యామ్నాయంగా ఎదగనీయకుండా కాంగ్రెసుకు అనుకూలంగా మలుస్తున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. దానివల్ల పార్టీ బలపడడం సాధ్యం కాదనేది అందరూ చెప్పే మాటనే.
గత ఎన్నికల్లో అభిమానులను చిరంజీవి విస్మరించారనే విమర్శ ఉంది. ఆ విమర్శ నుంచి బయటపడి, దిద్దుబాటు చర్యలకు నాగబాబు పూనుకున్నారు. పార్టీలో చిరంజీవి అభిమానులకు పెద్ద పీట వేస్తామని ఆయన నమ్మబలుకుతున్నారు. చిరంజీవి అభిమానులకు తాను దగ్గరుండి పార్టీ టికెట్లు ఇప్పిస్తానని కూడా ఆయన హామీ ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అభిమానులను కూడగట్టేందుకు ఆయన యత్నిస్తున్నారు. చిరంజీవి పార్టీ పెట్టడానికి ముందు నిర్వహించిన పాత్రను నాగబాబు తిరిగి భుజాల మీద వేసుకున్నారు. యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మళ్లీ ప్రజారాజ్యంలో చురుకైన పాత్ర పోషిస్తాడని నాగబాబు చెబుతున్నారు. నాగబాబు ఏ నమ్మకంతో మళ్లీ వచ్చారో తెలియదు గానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం పార్టీ నడుస్తున్న తీరు పట్ల తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ప్రత్యామ్నాయంగా పార్టీని నిలబెట్టాలనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశంగా చెప్తారు. కాంగ్రెసుకు అనుకూలంగా పార్టీని మలచడం ఆయనకు ఏ మాత్రం ఇష్టం లేదంటారు. పార్టీని అల్లు అరవింద్ కాంగ్రెసు వైపు నడిపిస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల పవన్ కళ్యాణ్ మళ్లీ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తారా అనేది అనుమానమేనంటారు.
కాంగ్రెసుకు పార్టీ అనుకూలంగా మారడం, అల్లు అరవింద్ పెత్తనం పార్టీ బలోపేతానికి పెద్ద అడ్డంకిగా భావిస్తున్నారు. ఆ ఆటంకాన్ని దాటడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక చిరంజీవి వద్ద లేదు. అందువల్ల పార్టీకి సంపూర్ణ వైభవం కల్పించడం కష్టమైన పనే కావచ్చు.












Click it and Unblock the Notifications