రాహుల్ తో జగన్ కు పోలికా?

రాహుల్ గాంధీ ప్రధాని పదవిని చేపట్టాలంటే ఏ విధమైన అడ్డంకులు లేవు. మన్మోహన్ సింగ్ సడీచప్పుడు లేకుండా ప్రధాని పీఠం నుంచి గిది రాహుల్ గాంధీకి అప్పగించగలరు. కానీ రాహుల్ గాంధీ దాని కోసం ఆతురత పడడం లేదు. ఆయనకు ప్రధాని పదవి మీద ఆశ లేదని చెప్పలేం. కానీ, కొంత అనుభవం, పరిస్థితులపై అవగాహన, రాజకీయాలపైనా పార్టీపైనా పట్టు పూర్తిగా ఉండాలని, అవన్నీ సాధించిన తర్వాతనే ప్రధాని పదవిని చేపట్టాలని రాహుల్ గాంధీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే, రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటనలకు హంగులూ ఆర్భాటాలూ ఉండడం లేదు. ఆయన ఎక్కడికైనా ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు. ఆయనకున్న ప్రజాకర్షణ దృష్ట్యా మీడియా ఆయనను వదిలిపెట్టదు. దానివల్ల మీడియా పబ్లిసిటీ ఆయనకు ఎక్కువగానే లభిస్తుంది.
అయితే, జగన్ కు రాహుల్ కు ఉన్నంత ఓపిక ఉన్నట్లు కనిపించడం లేదు. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుందామా అనే ఆతురతతోనే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన రాష్ట్ర కాంగ్రెసు నాయకుల నుంచి పూర్తి మద్దతు లేదు. ఒక బలమైన వర్గం ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆయనకు రాష్ట్రంలో ఒక వర్గం మద్దతు ఉంది. అందువల్ల ఆయన రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యుడైన నాయకుడు కాదనేది తేలిపోతూనే ఉంది. రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపట్టడానికి 2014 ఎన్నికల వరకు నిరీక్షించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, తాను ప్రధాని పదవిని చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఆయన ఏ రోజు కూడా కనిపించడం లేదు. అందువల్ల జగన్ కు, రాహుల్ కు ఏ విధమైన పోలిక చెప్పలేం.












Click it and Unblock the Notifications