జగన్ ను కిరణ్ ఆపగలరా?

Kiran Kumar Reddy
పార్టీ పెట్టడానికి సమాయత్తమవుతున్న వైయస్ జగన్ ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆపగలరా అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతా దారిలోకి వచ్చిందని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా వైయస్ జగన్ వర్గం జూలు విదిల్చింది. గుంటూరు జిల్లాలోనే కాకుండా కృష్ణా, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పాగా వేసేందుకు, సాధ్యమైనంత ఎక్కువగా కాంగ్రెసుకు నష్టం కలిగించేందుకు తగిన వ్యూహాన్ని రచించి అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుంది. మంత్రి పదవి దక్కని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రిపై బహిరంగంగానే నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిని బలహీనపరిచే ప్రతి చర్యనూ సమర్థిస్తామని ఆయన చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వైయస్ జగన్ పార్టీలో చేరుతారా, లేదా అనేది సంశయమే అయినప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డిని మాత్రం బలహీనపరిచేందుకు పనిచేస్తారనేది తేటతెల్లం. మంత్రి పదవి దక్కని కుతూహలమ్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆమెను తమ వైపు తిప్పుకునేందుకు వైయస్ జగన్ వర్గం పావులు కదుపుతోంది. చిత్తూరు జిల్లాల్లో వైయస్ జగన్ వర్గం మండలాలవారీగా సమావేశాలు నిర్వహిస్తోంది.

వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి వైయస్ జగన్ విశాఖపట్నం జిల్లా ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. ఆ స్థితిలో అప్రమత్తం కావాల్సిన పరిస్థితి కిరణ్ కుమార్ రెడ్డికి ఏర్పడింది. ఇదంతా చూస్తుంటే, వైయస్ జగన్ వర్గం పకడ్బందీగా కాంగ్రెసు మాజీలకు, స్థానిక నాయకులకు, ద్వితీయశ్రేణి నాయకులకు గాలం వేస్తున్నట్లు అర్థమవుతోంది. ఆదివారం కృష్ణా జిల్లా పరిణామాలు కిరణ్ కుమార్ రెడ్డిని తీవ్రంగా కదిలించినట్లే ఉన్నాయి. శాసనసభా సమావేశాల సందర్భంగా ఆయన కృష్ణా జిల్లా శాసనసభ్యులతో సమావేశమయ్యారు. అప్పటికే, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ను నష్టనివారణ చర్యలకు పురికొల్పినట్లు వార్తలు వచ్చాయి.

విశాఖపట్నం జిల్లాలో వైయస్ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టనున్న నేపథ్యంలో ఆ జిల్లా మంత్రి బాలరాజు కూడా శాసనసభ్యులతో భేటీ అయ్యారు. శాసనసభ్యులు అటు వైపు వెళ్లకుండా జాగ్రత్తపడడంలో భాగంగానే ఈ సమావేశం జరిగినట్లు భావిస్తున్నారు. సాధ్యమైనంత మేర జిల్లా నుంచి కాంగ్రెసువారు ఓదార్పు యాత్రకు వెళ్లకుండా నిరోధించేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించినట్లు చెప్పవచ్చు. అయితే, వైయస్ జగన్ ను ఏ మేరకు కిరణ్ కుమార్ రెడ్డి ఆపగలరనేది వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+