మారని చంద్రబాబు

ఉప ఎన్నికల్లో గెలిచింది తెలంగాణ రాష్ట్ర సమితి కాదని, భావోద్వేగం గెలిచిందని తెలుగుదేశం నాయకులు వ్యాఖ్యానిస్తూ ఆ భావోద్వేగానికి సంబంధించిన పునాదిని గుర్తించడానికి నిరాకరిస్తున్నారు. బలం తెరాసదో, ఆ పార్టీ అధినేత కె. చంద్రశేఖర రావుదో కానప్పుడు సెంటిమెంటు విజయం సాధించినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష మరింత హేతుబద్దతను సంతరించుకుంటుందనే విషయాన్ని వారు గుర్తించడం లేదు. ఈ విషయం చంద్రబాబుకు తట్టడం లేదు. తట్టే పరిస్థితి పార్టీలో లేదు. తనను అన్ని విధాలుగా సమర్థిస్తూ వచ్చిన శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి మాటలు కూడా ఆయన చెవికి ఎక్కుతున్నట్లు లేదు.
అయితే, మొత్తమ్మీద తెలుగుదేశం పార్టీలో మాత్రం కదలిక వచ్చింది. ఆ కదలిక తెలంగాణకు అనుకూలంగా కాకుండా మరింత పార్టీని దిగజార్చేదిగా ఉంది. వాస్తవానికి కాస్తా దగ్గరగా మాట్లాడింది సినీ నటుడు మురళీమోహన్ మాత్రమే. శత్రుత్వం పెరగకుండా రెండు ప్రాంతాలు విడిపోవడమే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడైన ఈ సీమాంధ్ర నటుడి మాటలను వినడానికి కూడా చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లు లేరు. హరికృష్ణ మాత్రం ఫలితాల తీరు పట్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అయితే, ఆయన వాదన కూడా కుందేటికి మూడే కాళ్లు అన్నట్లుంది. తెలంగాణలో తమ పార్టీని తుడిచిపెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఎదుటి పక్షాలపై విరుచుకుపడ్డారు. ఇది రాజకీయ వ్యాఖ్య అనిపించుకోదు. పార్టీలు ఎత్తులు పైయెత్తులతో పరస్పరం బలహీనపరుచుకుని, పరస్పరం బలం పుంజుకోవడానికి ప్రయత్నిస్తాయనే కనీస ఇంగితం ఆయనకు ఉన్నట్లు లేదు. కాంగ్రెసు పార్టీ తప్పకుండా తెలుగుదేశం పార్టీని తుడిచిపెట్టడానికే ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నాలను తిప్పికొట్టే వ్యూహం, వైఖరి తెలుగుదేశం పార్టీకి లేదు. అది తెలుగుదేశం పార్టీకి లేదనే విషయాన్ని ఆయన గుర్తించడం అవసరం.
కెసిఆర్ తెలంగాణవాదాన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే ఓ గమ్మత్తయిన వాదన కూడా వారి నుంచి వస్తోంది. సమస్య ఉంటేనే ఎవరైనా వాడుకోవడానికి ప్రయత్నిస్తారు. బాబ్లీ ప్రాజెక్టును తెలుగుదేశం పార్టీ వాడుకోవడానికి ప్రయత్నించడం కూడా వాస్తవమనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అంగీకరించాలి. చంద్రబాబు లాంటి నాయకులు - సమస్యను ఇతర పార్టీలు గానీ ఇతర శక్తులు గానీ వాడుకోవడానికి వీలు లేకుండా పరిష్కరించే మార్గాలను వెతకాల్సి ఉంటుంది. ఇతర పార్టీలను ఆడిపోసుకోవడం వల్ల ఉపయోగం లేదు. చంద్రబాబు ఇదే వైఖరితో ముందుకు సాగితే తన తల మీద తానే చేయి పెట్టుకునే భస్మాసురుడిలా వ్యవహరించినవారవుతారు.












Click it and Unblock the Notifications