ఎన్టీఆర్ వారసుడు?

NTR
నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. తెలుగుదేశం పార్టీకి స్వర్గీయ ఎన్టీ రామారావు పురుడు పోసి పాతికేళ్లు అవుతోంది. ఈ పాతికేళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీలో వచ్చిన మార్పులు అనేకం. దాని రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. దాని ఆశయాలు, లక్ష్యాలు కనిపించకుండా పోయాయి. ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేయడం, ఉత్తరాది ఆధిపత్యానికి గండి కొట్టడం, ద్రవిడ సంస్కృతికి పట్టం కట్టడం అనే లక్ష్యాలకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా దూరం జరిగింది. తెలుగుదేశం పార్టీ తన ప్రజాకర్షణ శక్తిని కూడా కోల్పోయింది. జనబలం మీద ఆధారపడి అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఎత్తుగడలు, వ్యూహాలు, స్థానిక నాయకత్వ బలమి మీద ఆధారపడాల్సిన పరిస్థితికి చేరుకుంది. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఒక కార్పరేట్ సంస్థగా మారిపోయింది.

ఇప్పటి తెలుగుదేశం పార్టీకి, ఎన్టీ రామారావు నాయకత్వంలోని పార్టీకి ఏ మాత్రం పొంతన లేదు. సారంలో పూర్తిగా మారిపోయింది. రాజకీయాల్లోనూ, సినీ రంగంలోనూ ఎన్టీ రామారావు వారసత్వాన్ని స్వీకరించే స్థాయి గల వ్యక్తులు లేకుండా పోయారు. పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారే తప్ప చంద్రబాబు ఎన్టీ రామారావు వాసత్వాన్ని అందిపుచ్చుకోలేకపోయారు. చంద్రబాబుకు ప్రజాకర్షణ శక్తి లేదు. పూర్తిగా రాజకీయ చతురత మీద ఆధారపడి ఆయన పార్టీని నడిపిస్తున్నారు. ఎన్టీ రామారావును దించేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పార్టీని విజయపథంలో నడిపించింది ఒకసారి మాత్రమే. ఆ తర్వాత కాంగ్రెసును ఢీకొన్ని ముందుకు నడిపించలేకపోయారు. జాతీయ రాజకీయాల్లోనూ ఎన్టీ రామారావులా శక్తివంతమైన పాత్రను పోషించలేకపోయారు. పథకాల విషయంలో ఎన్టీ రామారావుకు పూర్తి భిన్నమైన వైఖరిని తీసుకున్నారు. పార్టీని మధ్య తరగతి, నయా సంపన్నవర్గాల పార్టీగా మార్చేశారు. ఎన్ని హామీలు ఇచ్చిన పేదల గుండెలను దోచే కార్యక్రమాలు గానీ ప్రజాకర్షణ గానీ చంద్రబాబుకు దక్కడం లేదు.

పోతే, ఎన్టీ రామారావు రాజకీయ వారసత్వాన్నే కాదు, సినీ వారసత్వాన్ని కూడా అందిపుచ్చుకునే స్థితిలో ఆయన కుటుంబ సభ్యులు లేరు. బాలకృష్ణపైన ఎన్టీ రామారావుకు కాస్తా నమ్మకం ఉండేది కావచ్చు. తన వారసుడు బాలయ్యేనని ప్రకటించారు కూడా. అయితే, చంద్రబాబు నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన తన మాటను వెనక్కి తీసుకున్నారు. అయితే, బాలయ్య నటనా సామర్థ్యం మీద కూడా ఆయనకు సరైన అవగాహనే ఉండేది. బాలయ్య వాచకం బాగుపడాలని ఆయన ఒక సందర్భంలో అన్నారు. కానీ, ఇప్పటికీ బాలయ్య తన వాచకాన్ని మెరుగుపరుచుకున్న దాఖలాలు లేవు. బాలయ్య సినిమాల్లో కథాబలం ఉన్నవి మాత్రమే విజయం సాధించాయి. కథాబలం లేకుండా హీరోయిజం మీద ఆధారపడి తేసే సినిమాలు విజయం సాధించలేవనే విషయాన్ని బాలయ్య గుర్తించినట్లు లేదు. రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పగ్గాలను చేపట్టే సందర్భం బాలయ్యకు వచ్చే సూచనలు కనిపించడం లేదు.

కాస్తా జూనియర్ ఎన్టీఆర్ నయమనిపిస్తారు. జూనియర్ ఎన్టీఆర్ లో ఓ ఫైర్ ఉంది. తపన ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమాల ఎంపికలో కథకన్నా హీరోయిజానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం పెద్ద లోపం. కథాబలం లేని సినిమాలు విజయం సాధించలేవనే విషయాన్ని మన మాస్ హీరోలు గుర్తించినట్లు లేరు. అందుకే హీరోలెంత మాస్ ఫాలోయింగ్ ఉన్నవారైనా బాక్సాఫీసు వద్ద సినిమాలు బోర్లా పడుతున్నాయి. ఇది జూనియర్ ఎన్టీఆర్ కు కూడా వర్తిస్తుంది. రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ స్వర్గీయ రామారావుకు జూనియర్ ఎన్టీఆర్ వారసుడిగా నిలుస్తారేమోనని అప్పుడప్పుడు అనిపిస్తుంది. అయితే, అది సాధ్యమయ్యే పని కాదు. నిరంతరం పొతం పెట్టుకుంటే తప్ప అది సాధ్యమయ్యే పని కాదు. పైగా, రాజకీయాలు మునుపటిలా లేవు.

అటు బాలకృష్ణ గానీ ఇటు జూనియర్ ఎన్టీఆర్ గానీ ప్రాంతాలకు అతీతంగా, అన్ని సామాజిక వర్గాలకు అతీతంగా ఆదరణ పొందే వాతావరణం లేదు. ఎన్టీఆర్ విషయానికి వస్తే, తెలంగాణ ప్రాంతం రాజకీయాల్లో బ్రహ్మరథం పట్టింది. ఆయన నటనకు మురిసిపోయింది. ఈ రెండు విషయాల్లో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఆయన ముందు దిగదుడుపే. స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకునే స్థాయిలో లేరు. ఈ స్థితిలో స్వర్గీయ ఎన్టీ రామారావు కాలక్రమేణా మసకబారుతూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అలా రాజకీయాల్లో కొనసాగుతూ ఉండవచ్చు గానీ ప్రజా పునాదిని సంతరించుకునే స్థితిలో లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+