టిజి వెంకటేష్: పట్టింది బంగారం

శ్రీ రాయలసీమ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ పేర టిజి వెంకటేష్ కాస్టిక్ సోడా కర్మాగారాన్ని స్థాపించారు. అది ఇతర రంగాలకు కూడా విస్తరించింది. హై స్ట్రెంత్ హైపో, పవర్ ప్రాజెక్టులు, విండ్ పవర్, పశు వ్యాక్సిన్ల రంగాల్లోకి కూడా అది విస్తరించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో స్టార్ హోటళ్లు, మూవీ థియేటర్లను నెలకొల్పారు. పారిశ్రామికవేత్తగా ఉండి కార్మిక సంఘాన్ని స్థాపించిన ఘనత టిజి వెంకటేష్ కు దక్కుతుంది. తాను చైర్మన్ గా ఉన్న కాలంలో ప్రభుత్వ రంగానికి చెదిన రాష్ట్ర వాణిజ్య సంస్థను లాభాల్లో నడిపించిన ఘనత ఆయనది. గతంలో వైశ్య బ్యాంక్ లిమిటెడ్ డైరెక్టర్ గా కూడా ఆయన పనిచేశారు.
క్రీడా రంగంలోనూ టిజి వెంకటేష్ విశేష కృషి చేశారు. రాష్ట్ర ఫుట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన ఎన్నో ఇండోర్ స్టేడియాలను, ఆడిటోరియాలను స్థాపించారు. నీటికి కటకటలాడుతున్న కర్నూలు నగరానికి చాలా ఏళ్లుగా ఆయన ఉచితంగా నీటిని సరఫరా చేస్తున్నారు. తొలుత ఆయన తెలుగుదేశంలో ఉన్నారు. 1999 - 2004 మధ్య కాలంలో ఆయన తెలుగుదేశం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత కాంగ్రెసు అభ్యర్థిగా కర్నూలు నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకు ఆయన రాయలసీమ హక్కుల వేదికను ఏర్పాటు చేశారు.
సత్ప్పవర్తనకు పెద్ద పీట వేసే టిజి వెంకటేష్ మద్యం సేవించనివారికి, ధూమపానం చేయనివారికి తన కర్మాగారాల్లోని కార్మికులకు నెలవారీగా అలవెన్సులు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టారు. 1100 రూపాయల చొప్పున కార్మికుల భార్యలకు నేరుగా ఆ ఆలవెన్సు అందే ఏర్పాటు చేశారు. ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ప్రపంచంలోనే బహుశా టిజి వెంకటేష్ మొదటివారు. ఆయన సంస్థలు పలు జాతీయ, రాష్ట్ర అవార్డులు పొందాయి. ఆయన విజయవాడకు చెందిన టిజి రాజ్యలక్ష్మిని వివాహం చేసుకున్నారు. ఆయనకు టిజి భరత్ అనే కుమారుడు, మౌర్య రవిరాజ్, జ్యోత్స్నసునీల్ అనే కూతుర్లు ఉన్నారు.












Click it and Unblock the Notifications