జగన్ పై సోనియా ఆలోచన?

నిజానికి, రాష్ట్రస్థాయి నాయకుడిగా జగన్ ను ముందు పెట్టేందుకు సోనియా సిద్ధంగా లేరనేది స్పష్టం. రాష్ట్ర కాంగ్రెసుకు గానీ ప్రభుత్వానికి గానీ నాయకత్వం వహించే అనుభవం, పరిపక్వత జగన్ కు లేవని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. అనుభవరాహిత్యం వల్ల ఆయన జగన్ అనాలోచితంగా వ్యవహరిస్తున్నారని సోనియా కోటరీ కూడా భావిస్తోంది. తనను తాను ఎక్కువగా ఊహించుకుంటూ, వైయస్ కోటరి సహాయంతో రాష్ట్ర రాజకీయాలను తన చేతుల్లోకి తీసుకోవాలని, ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని జగన్ తొందరపడుతున్నట్లు సోనియా భావిస్తున్నారు. పిల్లగాడిని చెడగొడుతున్నారని సోనియా జగన్ పై గతంలో వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. జగన్ విషయంలో సోనియాకు ఉన్న అభిప్రాయం అంతే. అంతకు మించి జగన్ ను ఆమె పరిగణనలోకి తీసుకోవడం లేదు.
జగన్ లో ఎవరినీ ఖాతరు చేయని గుణం, ఒంటి చేత్తో రాష్ట్రంలో చక్రం తిప్పుతాననే అతి విశ్వాసం సోనియాకు నచ్చడం లేదని చెబుతున్నారు. వైయస్ పై లోలోపల ఉడికిపోతూ కూడా కిమ్మనకుండా సీనియర్ కాంగ్రెసు నేతలు జగన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని సేవలందించిన రాష్ట్రంలోని సీనియర్ నాయకుల మాటలను సోనియా బేఖాతరు చేసే ఉద్దేశంతో కూడా ఆమె లేరు. వారంతా జగన్ కు వ్యతిరేకంగానే ఉన్నారు. నిజానికి, జగన్ కు మద్దతు కన్నా, వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఈ వ్యతిరేకులపై ఏదో రీతిలో జగన్ తన ప్రతాపం ప్రదర్శిస్తూనే ఉన్నారు. రాష్టస్థాయి నాయకుడికి అది సరిపడని వ్యవహారం. ప్రత్యర్థులను కూడా మెప్పించి, ముందుకు సాగే పరిపక్వత జగన్ లో లేదనేది స్పష్టం.
జగన్ ప్రస్తుత పద్ధతిలోనే వ్యవహరిస్తే ముఖ్యమంత్రి పదవి ఆయనకు మరింత దూరం కావచ్చు. ఆయన ఎంతగా తొందరపడితే అంత దూరంగా ఆ పదవి జరుగుతూ పోతుంది. పార్లమెంటు సభ్యుడిలా వ్యవహరిస్తూ మెల్లగా రాష్ట్రస్థాయికి ఎదిగే వ్యూహరచన చేసుకోవడం తప్ప జగన్ ప్రస్తుతం మరో మార్గం లేదు.












Click it and Unblock the Notifications