రాజీ పడినందుకేనా..?

వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి ఆయన పార్టీ అధిష్టానంపై తిరగబడేందుకు ఇటీవలి దాకా ప్రయత్నాలు చేశారు. అందుకు మంత్రులను, కాంగ్రెసు శాసనసభ్యులను కూడగట్టారు. కెవిపి రామచందర్ రావు చెప్తే తప్ప చాలా మంది మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యులు కదిలే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి రోశయ్య కన్నా, అధిష్టానం కన్నా వారికి కెవిపి రామచందర్ రావు, వైయస్ జగన్ ఎక్కువయ్యారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి వారు సంక్షోభం సృష్టించడానికి కూడా వెనకాడ లేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం ముందుకు వచ్చేసరికి కాంగ్రెసు శాసనసభ్యులు, నాయకులు ప్రాంతాలవారీగా విడిపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడం కన్నా తెలంగాణ కాంగ్రెసు నాయకులకు ముఖ్యమైపోయింది. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని అడిగితే తెలంగాణ నాయకులు ప్రజల మధ్య తిరిగే పరిస్థితి లేదు. మాజీ మంత్రి కొండా సురేఖకు ఎదురైన పరిస్థితిని అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
రాష్ట్ర విభజన రాజకీయాల నేపథ్యంలో కెవిపి రామచందర్ రావు పార్టీ అధిష్టానంతో రాజీకి వచ్చారు. ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధపడ్డారు. వైయస్ జగన్ కూడా ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రిని కావడం సాధ్యం కాదని అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. కెవిపి రామచందర్ రావు అధిష్టానంతో రాజీపడి రోశయ్యకు సహకరించేందుకు సిద్ధపడడంతో తెలుగుదేశం పార్టీ ఆశించిన విధంగా పరిణామాలు ముందుకు సాగడం లేదు. వైయస్ జగన్, కెవిపి రామచందర్ రావుల వల్ల రోశయ్య ప్రభుత్వం సంక్షోభంలో పడుతుందని భావించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆశాభంగమైంది. దీంతో సామరస్యాన్ని దెబ్బ తీసేందుకు చంద్రబాబు పనిగట్టుకుని కెవిపిపై ఆరోపణలు చేయిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications