జగన్ పై కత్తి కట్టిన విహెచ్

ఆయనకు తోడు మరో సీనియర్ నేత కె. కేశవరావు కూడా అధిష్టానం వద్ద ఇటీవలి కాలంలో ప్రాబల్యం సాధించారు. హనుమంతరావు సహకారంతో కేశవరావు కూడా వైయస్ జగన్ ను అడ్డుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని జగన్ కు చెందిన పత్రిక సాక్షి రాసింది కూడా. నిజానికి, హనుమంతరావు వైరం జగన్ తోనే ప్రారంభం కాలేదు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మీద కూడా ఆయనకు ఆగ్రహంగానే ఉంది. వైయస్ ఒంటెత్తు పోకడలు ఆయనకు ఏ మాత్రం రుచించలేదు. ఈ విషయాన్ని ఆయన దాచుకోలేదు కూడా. వైయస్ రాజశేఖర రెడ్డి పాల్గొన్న సభలోనే ఆయన బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
రాయలసీమ గూండాలు భూములను కబ్జా చేస్తున్నారని ఆయన సంచలన విమర్శ చేశారు. వైయస్ అనుచరులు ఆయన అధికార బలంతో విచ్చలవిడిగా వ్యవహరించారనేది విహెచ్ అభిప్రాయం. వైయస్ జగన్ అంతకన్నా దారుణంగా వ్యవహరించే ప్రమాదం ఉందని వారు పసిగట్టారు. వైయస్ కన్నా జగన్ మరింత అహంకారంతో వ్యవహరిస్తారనేది వారి సీనియర్ల అభిప్రాయం. జగన్ సీనియర్లను బేఖాతరు చేయడం, వారికి జూనియర్లను పోటీకి పెట్టడం పెద్ద సమస్యగా మారింది. వైయస్ కాస్తా మర్యాదనైనా ఇచ్చేవారని, జగన్ అది కూడా ఇవ్వరని వారు అభిప్రాయపడుతున్నారు. వైయస్ కూడా తనను ఇలా అనలేదని వైయస్ జగన్ మాటలకు ముఖ్యమంత్రి కె. రోశయ్య కూడా నొచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సీనియర్లకు అండదండలుగా నిలుస్తూ జగన్ కు అడ్డుకట్ట వేసేందుకు ఢిల్లీలో పావులు కదపడంలో విహెచ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అంటారు. పార్టీ అధిష్టానానికి నమ్మకమైన సమాచారం అందిస్తారని కూడా విహెచ్ పేరు సంపాదించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజశేఖర రెడ్డి మీది గౌరవంతో, కెవిపిపై నమ్మకంతో ఇన్నాళ్లు జగన్ పట్ల కొంత మెతగ్గా వ్యవహరించిన అధిష్టానం విహెచ్, కేశవ రావు వంటి వారి సహకారంతో పూర్తిగా అణచేసే ఉద్దేశంతోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రిగా రోశయ్య పదవి చేపట్టినప్పటి నుంచి జగన్ వ్యూహాలను తిప్పికొట్టడంలో విహెచ్ అధిష్టానానికి పూర్తిగా సహకరిస్తున్నారు. జగన్ వ్యవహారశైలి, వైయస్ తో పాత చేదు అనుభవాలు జగన్ పై విహెచ్ కత్తి కట్టడానికి కారణమంటారు.












Click it and Unblock the Notifications