ఇటు కెసిఆర్: అటు జగన్

జగన్ మొండిపట్టుతో వ్యవహరించి, తెరాసను సవాల్ చేయడం సీమాంధ్ర నాయకుల మన్ననలు అందుకుంది. సీమాంధ్రలో ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కన్నా జగనే ఎక్కువ మార్కులు కొట్టేసినట్లు భావించవచ్చు. సమైక్య నినాదంతో పర్యటనలు చేసి చెమటోడ్చిన చిరంజీవి సాధించిన దానికన్నా జగన్ ఎక్కువ సాధించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ యాత్రను అడ్డుకోవడంపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తో సహా సీమాంధ్ర నాయకులంతా కెసిఆర్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం క్రెడిట్ జగన్ కు దక్కుతుందనే భయంతో మౌనం పాటిస్తున్నారు. ఏమైనా, జగన్ సీమాంధ్ర హీరో అయ్యారు.
కాగా, కెసిఆర్ తెలంగాణలో క్రెడిట్ కొట్టేశారు. తెలంగాణ ఉద్యమం వేడి చల్లారిందనే అభిప్రాయం బలపడుతున్న సమయంలో జగన్ ఓదార్పు యాత్ర పరిణామాలు కెసిఆర్ కు కలిసి వచ్చినట్లే భావించాలి. రాష్ట్ర పరిస్థితులపై శ్రీకృష్ణ కమిటీని వేసిన తర్వాత తెలంగాణలో ఉద్యమాల వేడి చల్లారింది. అయితే అది నివురు గప్పిన నిప్పులా ఉందనే విషయాన్ని గ్రహించకుండా ఉద్యమమే నీరు గారిందనే అభిప్రాయం బలపడుతూ వచ్చింది. అది నిజం కాదని నిరూపించడానికి కెసిఆర్ కు, తెలంగా జెఎసి కన్వీనర్ కోదండరామ్ కు జగన్ ఓదార్పు యాత్ర మంచి అవకాశాన్నిచ్చింది. మొత్తం మీద, జగన్ కూ, కెసిఆర్ కూ ఈ సంఘటన ఉపయోగిపడినట్లే భావించాలి.












Click it and Unblock the Notifications