జగన్, వివేకా ఫైట్: చూసుకుందాం, రా

వైయస్ జగన్ తనను మొదటి నుంచీ నమ్మడం లేదని, తనను అవమానిస్తూ వచ్చారని, తనను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి దూరంగా ఉంచడానికి ప్రయత్నించారని ఆయన చెప్పకనే చెప్పారు. వైయస్సార్ జీవించి ఉన్నంత వరకు వైయస్ వివేకానంద రెడ్డి సోనియాకు, కాంగ్రెసు అధిష్టానానికి దూరంగానే ఉంటూ వచ్చారు. రాముడిని అనుసరించిన లక్ష్మణుడిలా ఆయన వ్యవహరించారు. అన్న వైయస్సార్ ఏది చెప్తే అది వినడం, అది చేయడమే ఆయన పనిగా పెట్టుకున్నారు. తన కుమారుడు వైయస్ జగన్ కోసం కడప పార్లమెంటు సీటుకు రాజీనామా చేయాలని చెప్తే మారు మాటకుండా ఆయన అందుకు సిద్ధపడ్డారు. అయితే, అప్పుడు సోనియానే అడ్డు పడ్డారు. దాంతో వైయస్ వెనక్కి తగ్గారు. కుమారుడు జగన్ ఒత్తిడి తట్టుకోలేకనే సోదరుడు వివేకాతో వైయస్ రాజీనామా చేయించడానికి సిద్ధపడ్డారనే ప్రచారం మొదటి నుంచి ఉంది. ఈ విషయంలో వివేకా ఏ రోజూ మాట్లాడలేదు. ఒక రకంగా వైయస్ జగన్ వివేకానంద రెడ్డిని పక్కకు నెట్టి తాను ముందుకు రావడానికి సిద్ధపడ్డారని అనుకోవాలి.
వైయస్సార్ మృతి తర్వాత కూడా వైయస్ జగన్ వివేకానంద రెడ్డిని దూరంగానే ఉంచుతూ వచ్చారు. సోనియాను కుటుంబ సభ్యులు కలిసిన సమయంలో గౌరవంతోనో, సీనియర్ రాజకీయ నాయకుడిగానో కూడా వైయస్ జగన్ వివేకానంద రెడ్డిని పరిగణించలేదని అర్థమవుతోంది. సోనియా చెంతకు జగన్, కెవిపి రామచందర్ రావు వివేకాను తీసుకుని వెళ్లలేదు. పైగా, నువ్వెందుకు లే, చిన్నాన్నా అని వైయస్ జగన్ అన్నట్లు వివేకానంద రెడ్డి స్వయంగా వెల్లడించారు. దీన్ని బట్టి, సోనియాకు, పార్టీ అధిష్టానానికి దూరంగా ఉంచి, వివేకాను తన చెప్పుచేతల్లో ఉంచుకోవడానికే జగన్ ప్రయత్నించారని చెప్పవచ్చు. తనను సోనియా అవమానించారని చెప్పుకుంటున్న వైయస్ జగన్ చిన్నాన్నకు ఇచ్చిన గౌరవం ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
వైయస్ వివేకానంద రెడ్డి వ్యవహారం చూస్తుంటే వైయస్ జగన్ తనను నిర్లక్ష్యం చేసిన తీరును, తనను అవమానించిన తీరును ఒక్కటొక్కటే బయట పెడతారని తెలిసి వస్తోంది. పులివెందుల ఫైట్ తారాస్థాయికి చేరుకునే వరకు మాటల యుద్ధం కూడా బాబాయ్, అబ్బాయ్ ల మధ్య పెరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications