తెలంగాణ పాట పాడుతున్న చంద్రబాబు

అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో బాబు పర్యటన విజయవంతం కావడంతో టిడిపి తెలంగాణ క్యాడర్‌లో ఉత్సాహం కనిపిస్తోంది. అదే ఊపులో ఆయన ఉప ఎన్నికలలోపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ నెల 21వ తేదిన మెదక్, 27న కరీంనగర్, 28న వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇన్నాళ్లూ నిర్లిప్తంగా ఉన్నప్పటికీ, ఉప ఎన్నికలకు ముందు పార్టీ క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో భాగంగా ఆయన పర్యటనలు చేస్తున్నారు. ఒకవిధంగా బాన్సువాడ ఉప ఎన్నికలు బాబుకు కొత్త ఉత్సాహాన్ని నింపాయనే చెప్పవచ్చు. ఆ ఎన్నికల్లో పోటీ టిడిపి చేయకపోయినప్పటికీ డిపాజిట్ కూడా దక్కదనుకున్న కాంగ్రెసు అభ్యర్థికి మంచి ఓట్లు రావడం అందరినీ షాక్‌కు గురి చేశాయి.
ఇన్నాళ్లూ సీమాంధ్ర పర్యటనలకు పరిమితమైన బాబు తెలంగాణలో వరుస పర్యటనల వెనుక ఉప ఎన్నికల వ్యూహమే అని చెప్పవచ్చు. ఇప్పటికే ఉప ఎన్నికలు జరగబోయే పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. ఇప్పటికిప్పుడు జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు వేసి 24 నియోజకవర్గాలలో ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెసు సిద్ధంగా లేదు. కేవలం తెలంగాణ ప్రాంతంతో పాటు ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా కొవూరుకు మాత్రమే ఉప ఎన్నికలు జరిగే అవకాశముంది. ఇది పసిగట్టే బాబు తెలంగాణలో ఉప ఎన్నికల ద్వారా పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications