కిరణ్‌కు మింగుడు పడని బొత్స

బొత్స నియామకాన్ని అన్ని వర్గాలవారు, ప్రాంతాలవారు ఆహ్వానిస్తున్నారు. నిజానికి ఆయన అందరికీ ఆమోదయోగ్యుడయ్యారు. తెలంగాణ అనుకూల వైఖరి ఆయనకు ఎక్కువగా ఉపకరించినట్లుంది. అంతేకాకుండా, రెడ్లను కట్టడి చేయడానికి కాపు సామాజిక వర్గం నాయకుడు పనికి వస్తాడని అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం వైపు ఉండడంతో కాపు సామాజిక వర్గానికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే కోస్తాంధ్రలో ఉపయోగకరంగా ఉంటుందని భావించారని చెప్పవచ్చు. కోస్తాంధ్రలో ఈ రెండు సామాజిక వర్గాలే ఆధిపత్యం వహిస్తున్నాయి. తెలంగాణలో బొత్స సత్యనారాయణకు బిసిల మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. తెలంగాణలోని కాపు వర్గం కూడా ఆయన వెంట ఉంటుందని అనుకుంటున్నారు.
మొహమాటం లేని మాట తీరు, అన్ని విషయాలపై స్పష్టమైన వైఖరి ఆయనకు నాయకత్వ బాధ్యతలు దక్కడానికి మరో కారణంగా చెప్పవచ్చు. బొత్స సత్యనారాయణకు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీని ఇబ్బందుల్లో పెట్టేవారిపై ఆయన కచ్చితంగా వ్యవహరించగలరనే నమ్మకం ఉంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై, ఆయన వెంట వెళ్తున్న శాసనసభ్యులపై బొత్స ఏ విధమైన మెతక వైఖరి అవలంబించలేదు. వారిపై కచ్చితమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నిక్కచ్చిగా వ్యవహరిస్తూ, ద్వితీయ శ్రేణి నాయకత్వం, క్యాడర్ చేజారకుండా చూసుకుంటే సరిపోతుందనేది బొత్స భావన. ఇందుకే ఆయన ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఏమైనా, బొత్స కాంగ్రెసును దారిలో పెడతారా, లేదా అనేది కొద్ది రోజుల్లో తేలిపోతుంది.












Click it and Unblock the Notifications