జగన్ వర్గంపై వేలాడుతున్న కత్తి!

జగన్‌తో వెళుతున్న కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం నుండి సహాయ నిరాకరణ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా మంత్రుల సమావేశంలో చెప్పినట్టు వార్తలు కూడా వచ్చాయి. వారి వారి నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ వ్యక్తులకు బాధ్యతలు అప్పగించి కాంగ్రెసు అభివృద్ధి కార్యక్రమాలుగా ప్రజలలోకి తీసుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. పథకాలన్నింటిలో, పార్టీ కార్యాలయాలలో జరిగే కార్యక్రమాలు ఏవైనా జగన్ వర్గ ఎమ్మెల్యేల మాట చెల్లుబాటు కాకుండా అధికార పార్టీ నేతల మాటల చెల్లు బాటు అయ్యేలా చూసుకోవాలని ముఖ్యమంత్రి సూచించినట్లుగా తెలుస్తోంది.
స్థానికంగా కూడా కాంగ్రెసు ప్రజాప్రతినిధులాగా వారికి ప్రాతినిధ్యం ఇవ్వకుండా నామినేటెడ్ పోస్టులను ఉపయోగించుకొని ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఇప్పటికే సూచించినట్లుగా తెలుస్తోంది. ఆ దిశలో ఆయా జిల్లాల మంత్రులకు, జిల్లా ఇంచార్జులకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించినట్లుగా సమాచారం. శ్రీకాకుళం జిల్లాలో జగన్ వెంట వెళుతున్న నరసన్నపేట శాసనసభ్యుడు, మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరుడు ధర్మాన కృష్ణదాసుకు, టెక్కలి శాసనసభ్యురాలు కొర్ల భారతికి చెక్ చెప్పే దిశలో పావులు కదిపినట్లు తెలుస్తోంది. కృష్ణదాసుకు చెక్ పెట్టే బాధ్యతను స్వయంగా ఆయన సోదరుడు మంత్రి ధర్మాన ప్రసాదరావుకు అప్పగించారు. ఇక భారతిని జోరును అదుపు చేసేందుకు పార్లమెంటు సభ్యురాలు కిల్లి కృపారాణి బాధ్యతలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. భారతి నియోజకవర్గం అయిన టెక్కలియే ఎంపీ కృపారాణి నియోజకవర్గం కావడంతో భారతికి చెక్ చెప్పడం అంత కష్టమేమీ కాదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయని తెలుస్తోంది.
ఇటీవల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ నిర్మాణ కంపెనీని నిర్మిస్తున్న ప్రజాప్రతినిధులు మొదటి నుండి జగన్ వర్గంలో ఉన్నారు. అయితే వారి నిర్మాణ తంతును అడ్డుకునే బాధ్యతను ఓ మంత్రి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నిర్మాణ పనులకు నిబంధనల అడ్డు అనే పంథాను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. జగన్ వర్గానికి చెక్ చెప్పించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ తన వైపు నుండి పావులు ఇలా కదుపుతుండగా ఇటీవలె ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడిగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ కూడా జగన్ వర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ అంశంతో పాటు జగన్ అంశమే బొత్సను పీఠంపై కూర్చుండబెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే సిఎం కంటే బొత్సనే జగన్ వర్గంవైపు ఎమ్మెల్యేలు వెళ్లకుండా కట్టడి చేయగలుగుతారనే నమ్మకం ఇటు కాంగ్రెసు కార్యకర్తలు, నేతలలో, అటు అధిష్టానానికి ఉన్నట్టుగా తెలుస్తోంది.
బొత్స వచ్చీ రాగానే జగన్ వర్గం ఎమ్మెల్యేలుగా పేరుపడ్డ రేగా కాంతారావు, కోమటిరెడ్డి సోదరులు, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు వచ్చి కలిశారు. కొన్ని కారణాల వల్ల కాంగ్రెసుకు దూరంగా ఉంటున్న పలువురు బొత్సతో తమకు భవిష్యత్తు ఉంటుందని భావించి ఇప్పుడు జగన్ వర్గానికి దూరంగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications