తెలంగాణ: జైపాల్ రెడ్డి దిగుతారా?

ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను పక్కకు నెట్టి తెలంగాణ ఉద్యమంలో ముందుకు దూసుకుపోవడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు, రెండో ఎస్సార్సీ ఏక కాలంలో తెలంగాణ విషయంలో ముందుకు వస్తాయా అనేది కూడా చెప్పలేని స్థితి. దీన్ని కాంగ్రెసు తెలంగాణ నేతలు వ్యతిరేకిస్తూ ఆందోళనలను ఉధృతం చేసే అవకాశం ఉంది. 2014లో ఎన్నికలు ముగిసే వరకు వారు తమ ఆందోళనలను కేంద్ర ప్రభుత్వంపైకి, పార్టీ అధిష్టానంపైకి ఎక్కుపెడుతూనే తెలంగాణలో కాంగ్రెసు శ్రేణులను కాపాడుకునే వ్యూహాన్ని అనుసరించబోతున్నారని తెలుస్తోంది.
అవసరమైతే కొంత మంది తెలంగాణ మంత్రులు రాజీనామాలు కూడా చేయవచ్చు. ముఖ్యమంత్రి మార్పు కూడా ఉండవచ్చునని అంటున్నారు. ఈ స్థితిలో కేంద్ర మంత్రి పదవికి ఎస్ జైపాల్ రెడ్డి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే, జైపాల్ రెడ్డి తనంత తానుగా రాజీనామా చేసే కన్నా తన కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా జైపాల్ రెడ్డి చేత రాజీనామా చేయించి, కాంగ్రెసు అధిష్టానం ఆయనను తెలంగాణ ఉద్యమ క్షేత్రంలోకి పంపిస్తుందని అంటున్నారు. ఆ రకంగా తెలంగాణలో పార్టీని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారని అంటున్నారు. ఏదైనా, తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన వెలువడిన తర్వాతనే ఏం జరుగుతుందనే విషయంలో ఓ స్పష్టత వస్తుంది.












Click it and Unblock the Notifications