కాంగ్రెసులో కలుస్తానని కెసిఆర్ సంకేతాలు

కాంగ్రెసుతో టిఆర్ఎస్ సన్నిహితంగా మెలగటం, ఆ పార్టీ అధిష్ఠానంపై కేసీఆర్ పూర్తి సానుకూల దృక్పథంతో ఉండటం కొత్తేమీ కాదు. 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెసుతో కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్ అనంతరం ఆ పార్టీతో అధికారాన్ని పంచుకుంది. 2009 ఎన్నికల్లో టిడిపితో జత కట్టిన కెసిఆర్ ఫలితాలు వెలువడటానికి ముందే టిడిపి, టిఆర్ఎస్ మధ్య చెలిమి చెడింది. తెలంగాణ కోసం కెసిఆర్ చేపట్టిన దీక్ష నేపథ్యంలో తిరిగి కాంగ్రెసు అధిష్ఠానంతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. 2009, డిసెంబర్ 9న కేంద్రం ప్రకటన చేయటానికి ముందు కేసీఆర్‌ను కాంగ్రెసు హైకమాండ్ సంప్రదించింది. డిసెంబర్ 9 ప్రకటనకు భిన్నంగా తర్వాత రెండో ప్రకటన వచ్చినా కూడా కెసిఆర్ మాత్రం కాంగ్రెసు అధిష్ఠానంతో స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
అడపాదడపా కాంగ్రెసు స్థానిక నాయకత్వంపై శివాలెత్తుతున్నప్పటికీ.. ఢిల్లీ గద్దెను..ప్రత్యేకించి సోనియా గాంధీని మాత్రం కేసీఆర్ ఇప్పటి వరకు పల్లెత్తు మాట అనలేదు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఇటీవల తనను కలిసిన పలువురితో కాంగ్రెసు వాళ్లు తెలంగాణ ఇస్తామంటున్నారు. అయితే టిఆర్ఎస్‌ను కాంగ్రెసులో విలీనం చేయాలని అడుగుతున్నారు.
నాకు కూడా ఇదే కరెక్ట్ అనిపిస్తోంది అని చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. గురువారం దీక్షా శిబిరం వద్దకెళ్లినప్పుడు కేసీఆర్ మెడలో కాంగ్రెసు ఎంపీ వివేక్ తమ పార్టీకి చెందిన మూడు రంగుల కండువా వేసి.. బ్యాడ్జీని పెట్టినప్పటికీ, టిఆర్ఎస్ అధినేత అభ్యంతర పెట్టలేదు. తన ప్రసంగంలో కాంగ్రెసు సీమాంధ్ర నేతలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ గులాంనబీ ఆజాద్‌పై కేసీఆర్ తీవ్రంగా మండిపడినప్పటికీ ఏఐసీసీ వైపు విమర్శల గుప్పించలేదు.
ఇవన్నీ కాంగ్రెసుకు, టిఆర్ఎస్ దగ్గర అనటానికి నిదర్శనాలనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. కాంగ్రెసు నాయకులు కూడా కేసీఆర్ ఎప్పటికైనా తమ వాడనే సంకేతం ఇవ్వటం కోసమే ఆయన మెడలో పార్టీ కండువా వేశామంటున్నారు. తమ పార్టీలో పీఆర్పీ విలీనానికి ముందు కూడా కాంగ్రెసు నాయకులు ఒక కార్యక్రమంలో చిరంజీవి మెడలో మూడు రంగుల కండువా వేయటాన్ని ఇక్కడ ఉదహరిస్తున్నారు. పిఆర్పీ తరహాలోనే టిఆర్ఎస్ ఎప్పుడో ఒకప్పుడు కాంగ్రెసులో విలీనమయ్యే పార్టీగానే వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ సైతం టిఆర్ఎస్ కాంగ్రెసులో విలీనం అవుతుందని ప్రచారం చేస్తుంది. గత డిసెంబర్‌లోనూ కాంగ్రెసు నేతలు దీక్షలు చేసినప్పుడు కెసిఆర్ వారి దీక్షకు వెళ్లి సంఘీభావం తెలిపారు.












Click it and Unblock the Notifications