ఎవరెవరు తెలంగాణను వ్యతిరేకిస్తున్నారు?

కాగా, తన పార్టీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసినప్పటికీ, లేఖను ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చినప్పటికీ, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని బలపరుస్తామని చెప్పినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. 2009 డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యుల రాజీనామా లేఖలను కూడా తన కార్యాలయం నుంచే పంపిణీ చేశారనే ఆరోపణలున్నాయి. ఆయన రాష్ట్ర విభజనకు బయటకు కనబడని బద్ద వ్యతిరేకి అని అంటారు.
కోస్తాంధ్ర నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్నవారు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివ రావు, రాయపాటి సాంబశివ రావు అంటారు. సబ్బం హరి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి వంటి వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారు. అయితే, కార్యాచరణ మాత్రం లగడపాటి, రాయపాటి, కావూరిలదే అని అంటారు. రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రులు టిజి వెంకటేష్, శైలజానాథ్, సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతున్నారు. వారికి తోడు కోస్తాంధ్రకు చెందిన మల్లాది విష్ణు వంటి కాంగ్రెసు శాసనసభ్యులు, దేవినేని ఉమా మహేశ్వర రావు, కె. ఎర్రంనాయుడు వంటి తెలుగుదేశం నాయకులు ఉన్నారు.
కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బద్ధ వ్యతిరేకిగా పేరు పడ్డారు. దీనివల్ల ఆయన వరంగల్లు జిల్లా పర్యటన పెద్ద సంఘటనగా నమోదైంది. అది కాంగ్రెసులో ఉన్నప్పటి మాట. ఇప్పుడు ఆయన సంత పార్టీని ఏర్పాటు చేశారు కాబట్టి తెలంగాణపై కచ్చితమైన వైఖరిని ప్రకటించాల్సే ఉంటుంది. పులివెందులలో 8,9 తేదీల్లో జరిగే ప్లీనరీలో తెలంగాణపై ఆయన తన వైఖరిని ప్రకటిస్తారని అందరూ వేచి చూస్తున్నారు.












Click it and Unblock the Notifications