రాష్ట్రమంతా వైయస్ జగన్ హవా?

ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం తమ పార్టీపై ఉండదని కాంగ్రెసు నాయకులు చెబుతున్నప్పటికీ కచ్చితంగా ఆ ప్రభావం ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైయస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా తన సత్తాను చాటుతారనే విషయం అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వైయస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెసు ఓట్లను భారీగా చీలుస్తారనే విషయం ఈ ఉప ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఓట్లను జగన్ ఎక్కువగా చీల్చే అవకాశాలు లేనట్లు అర్థమవుతోంది. దీంతో కాంగ్రెసు పార్టీకి కష్టాలు ప్రారంభం కావచ్చు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా ఉప ఎన్నికల ఫలితాలు తీవ్రంగా ప్రభావం చూపవచ్చు. వైయస్ జగన్ మెజారిటీ తగ్గి ఉంటే కాంగ్రెసు సర్గుకుపోవడానికి వీలయ్యేది. కానీ కాంగ్రెసు నాయకులు ఆ పని కూడా చేయలేకపోయారు. డజను మందికిపైగా మంత్రులు కడప లోకసభ స్థానంలో మకాం వేసినా ఫలితం ఏ మాత్రం కనిపించలేదు.
పులివెందులలో వైయస్ విజయమ్మ గెలిచినా తమ పార్టీ అభ్యర్థి వైయస్ వివేకానంద రెడ్డి గట్టి పోటీ ఇస్తారని అంచనా వేశారు. ఈ అంచనా కూడా తలకిందులైంది. విజయమ్మకు ఆయన ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. పైగా, వైయస్సార్ వారసత్వాన్ని సొంతం చేసుకోవడానికి కాంగ్రెసు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. వైయస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా వైయస్ జగన్‌నే చూశారని అనుకోవచ్చు. వైయస్సార్ రాజకీయ వారసత్వంపై జరిగిన పోరులో కూడా వైయస్ జగన్ విజయం సాధించారు. ఇది కూడా కాంగ్రెసుకు పెద్ద దెబ్బనే.












Click it and Unblock the Notifications