ఎమ్మెల్యేల కట్టడికి జగన్ కొత్త వ్యూహం

జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు తమ శాసనసభా సభ్యత్వాలకే కాకుండా కాంగ్రెసు పార్టీకి కూడా రాజీనామాలు చేశారు. కాంగ్రెసు పార్టీకి చేసిన రాజీనామాలను ఆమోదింపజేయాలనేది జగన్ వ్యూహం. పార్టీకి చేసిన రాజీనామాలను ఆమోదిస్తే వారు వెనక్కి తగ్గడం అంత సులభం కాదనేది జగన్ ఆలోచన. అందుకే, దమ్ముంటే కాంగ్రెసు పార్టీకి శాసనసభ్యులు చేసిన రాజీనామాలను ఆమోదించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సవాల్ విసురుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు గట్టు రామచందర్ రావు గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అదే సవాల్ విసిరారు.
ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేని వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు క్రమంగా కాంగ్రెసు వైవు తిరిగి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఒక రకంగా వారు డబుల్ గేమ్ ఆడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో గుర్నాథ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాలు పంచుకున్నారు. కాంగ్రెసును వదులుకోవాలని వారు గట్టిగా అనుకుంటే సమావేశాలకు హాజరై ఉండేవారు కారు. అందువల్ల వారు కచ్చితంగా జగన్ వైపు ఉంటారని చెప్పడానికి వీలు లేని స్థితి. అందుకే కాంగ్రెసు పార్టీకి చేసిన రాజీనామాలను ఆమోదింపజేసి వారిని కట్టడి చేయాలనేది జగన్ వ్యూహంగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications