సమయం చూసి జంప్ అవుతున్న నేతలు

కాంగ్రెసు ఎమ్మెల్యేలు సుజయ కృష్ణ రంగారావు, ఆళ్ల నాని, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ నేతలు చిన్నం రామకోటయ్య, కొడాలి నాని తదితరుల వ్యవహార శైలిని పరిశీలిస్తే వారు అదను కోసం మాత్రమే చూస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలలో కూడా కొందరు ఉప ఎన్నికలకు ముందు ఇలాంటి గందరగోళ పరిస్థితినే కల్పించారు.
ఇటీవలి వరకు మౌనంగా ఉన్న సుజయ కృష్ణ రంగారావు సిబిఐ జగన్‌ను విచారించే సమయంలో ఆతనిని కలిసి ఆ పార్టీలోకి వెళుతున్న సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికే జగన్ పంచన చేరారు. ఆళ్ల నాని కూడా అదే వైఖరి అవలంభించారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ శాసనసభ్యురాలు కవిత కూడా ఏ క్షణంలోనైనా జగన్ పార్టీలోకి వెళ్లవచ్చుననే ప్రచారం జరిగింది. అయితే మద్యం కేసులో ఆరోణలు రావడంతో చివరి నిమిషంలో ఆమె వెనక్కి తగ్గారనే వాదనలు వినిపించాయి.
మద్యం కేసులో ఆమెకు క్లీన్ చిట్ వచ్చిన వెంటనే జగన్‌కు జై కొట్టే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. కాంగ్రెసులోని పలువురు ప్రజాప్రతినిధులు సమయం కోసం వేచి చూస్తున్నారని అంటున్నారు. టిడిపిలో కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదని అంటున్నారు. నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య బాహాటంగానే తాను వచ్చే ఎన్నికలలో టిడిపి తరఫున పోటీ చేయనని, పార్టీ టిక్కెట్ ఇచ్చినా పోటీ చేయనని ప్రకటించారు.
ఆయన 2014 ఎన్నికలకు ముందు జగన్ వైపు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌కు సన్నిహితుడైన కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళతారనే ప్రచారం జోరుగా కొన్ని రోజులుగా జరుగుతోంది. అయితే ఇటీవల బాబును కలిసిన నాని తాను పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. కానీ ఆ తర్వాత కూడా జగన్ వెళ్తారనే ప్రచారం ఆగలేదు. జగన్‌ను జైలులో కలిసిన అనంతరం ఆయన వైయస్సార్ కాంగ్రెసులో చేరే తేదీ ఖరారయ్యే అవకాశముందంటున్నారు. మాజీ ప్రజాప్రతినిధులు కూడా పలువురు జగన్ వైపు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications