వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటమి పక్కకు: ఆ గెలుపు క్రెడిట్ చిరంజీవిదేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
పదహారు నియోజకవర్గాల ఓటమిని పక్కకు పెట్టి కాంగ్రెసు పార్టీలో రామచంద్రాపురం, నర్సాపురం నియోజకవర్గాల గెలుపుపై మాత్రమే ప్రధానంగా చర్చ జరుగుతోంది. 2014 సాధారణ ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఇలాంటి కీలక సమయంలో ఆయా నియోజకవర్గాలలో ఎందుకు ఓడామనే విశ్లేషణను పక్కకు పెట్టి... గెలిచిన నియోజకవర్గాల క్రెడిట్ కోసం కొందరు ముఖ్యనేతలు తహతహలాడుతుండగా.. ఆ క్రెడిట్ వారి సొంతం కాదని మరికొందరు ఎదురు దాడి చేస్తున్నారు.

కాంగ్రెసు ఘోర పరాజయంపై రాజ్యసభ సభ్యుడు చిరంజీవి రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు పార్టీలో వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెసు నేతలు ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకోక పోవడం వల్లనే ఓడిపోయామని, తోట త్రిమూర్తులు, కొత్తపల్లి సుబ్బారాయుడు 2009లో పిఆర్పీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయారని, ఇప్పుడు వారు కాంగ్రెసుతో సమన్వయం చేసుకొని విజయం సాధించారని చిరంజీవి విశ్లేషించారు.

2014లో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రాదేమో అనే ఆలోచనతో కాంగ్రెసు క్యాడర్ పూర్తి స్థాయిలో పని చేయలేదని ఆయన విమర్శించారు. ఆయన వ్యాఖ్యలను కాంగ్రెసు నేతలు కూడా ఘాటుగానే తిప్పు కొట్టారు. ఇప్పటి వరకు చిరంజీవికి పార్టీ నేతల నుండి దాదాపు చిన్న చితకా తప్ప పెద్దగా ఎదురుదాడి తగలలేదు. కానీ తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై మాత్రం వారు తీవ్రస్థాయిలోనే విరుచుకు పడ్డారు.

చిరంజీవి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ అంటే, చిరు కూడా ప్రజల్లో ఒకరే అని, ఆయన వ్యాఖ్యలు సరికాదని మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శాసనమండలి సభ్యుడు పాలడుగు వెంకట్రావు మాట్లాడుతూ.. ఆయన వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయన్నారు. కాంగ్రెసు ఏ ఒక్క వ్యక్తి పైనో, శక్తి పైనో ఆధారపడి లేదని కౌంటర్ ఇచ్చారు.

తన వల్లే రెండు స్థానాలలో కాంగ్రెసు పార్టీ గెలిచిందని చెబుతున్న చిరంజీవి ఓటమికి కూడా బాధ్యత వహించాలని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. చిరంజీవి గెలుపును మాత్రమే తన క్రెడిట్‌గా చెప్పుకోవడాన్ని కాంగ్రెసు సీనియర్లు తప్పు పడుతున్నారు. అంతగా సమన్వయం పలుకులు పలుకుతున్న చిరంజీవి తిరుపతిలో వెంకటరమణను ఎందుకు గెలిపించలేక పోయారని ప్రశ్నిస్తున్నారు. సమన్వయం మాటే ఎత్తితే చిరు తిరుపతిపై ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ ఎందుకు సమన్వయం చేయలేకపోయారని ప్రశ్నిస్తున్నారు.

అంతేకాకుండా ఆయన పర్యటించిన నియోజకవర్గాలలో కాంగ్రెసు ఎక్కడా గెలవలేదని చెబుతున్నారు. గెలిచిన నర్సాపురం, రామచంద్రాపురంలలో ఆయన ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించలేదని చెబుతున్నారు. అక్కడ పర్యటించకుండానే కేవలం అభ్యర్థులు మాజీ పిఆర్పీ నేతలు అయినంత మాత్రాన క్రెడిట్ తనదే అని చెప్పడం భావ్యం కాదంటున్నారు. ఓటమికైనా, గెలుపుకైనా సమష్టి బాధ్యత వహించాలని సూచిస్తున్నారు.

గెలిచిన రెండు ఇద్దరు ఎమ్మెల్యేలు పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు అని, ఆ తర్వాత వారు పిఆర్పీ పంచన చేరారని, ఇప్పుడు కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేశారని.. ఇలా మూడు పార్టీల కార్యకర్తలతో వారికి ఉన్న సంబంధాలు గెలుపుకు దోహదపడ్డాయని, కేవలం వారి వ్యక్తిగత సంబంధాల వల్లే గెలుపొందారు తప్ప.. చిరంజీవి వల్లనో మరెవరి వల్లనో కాదని చెబుతున్నారు. చిరంజీవి గెలుపు క్రెడిట్ తన పరం చేసుకొని ఓటమిని పక్కకు పెడుతుండగా.. మరికొందరు నేతలు క్రెడిట్ ఆయనొక్కడి సొంతం కాదంటూ ఘాటు విమర్శలు చేయడం విశేషం.

English summary
Rajyasabha Member Chiranjeevi is trying to get credit of Ramachandrapuram and Narsapuram win. Congress leaders like JC Diwakar Reddy and Paladugu Venkatrao are condemned Chiranjeevi's comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X