గెలుపుపై కాదు..: జోరుగా బెట్టింగ్స్, తికమక

Ballot Box
రాష్ట్రంలో జరుగుతున్న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాల ఉప ఎన్నికలపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. గెలుపుపై కంటే అధిక్యత(మెజార్టీ)పైనే ప్రధానంగా బెట్టింగులు కడుతున్నారని తెలుస్తోంది. సీమాంధ్రలో పదిహేడు అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలో వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంతో పాటు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికలలో సీమాంధ్రలో జరుగుతున్న అన్ని స్థానాలలో దాదాపు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేస్తారనే ప్రచారం తొలి నుండి జరిగింది.

తెలంగాణ సెంటిమెంటు దృష్ట్యా పరకాలలో మాత్రం జగన్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖతో పాటు బిజెపి, టిఆర్ఎస్‌ అభ్యర్థుల గెలుపుపై కూడా అంచనాలు వేస్తున్నారు. ఉప ఎన్నికలకు చాలారోజుల ముందే గెలుపోటములపై బెట్టింగులు జోరుగా ప్రారంభమయ్యాయి. ఉప ఎన్నికలు జరిగే సమయానికి ఈ జోరు మరింత పెరిగిందని అంటున్నారు. మొదట గెలుపుపై పందేలు కట్టిన వాళ్లు ఇప్పుడు మెజార్టీ పైనే దృష్టి సారిస్తున్నారని అంటున్నారు.

దాదాపు అన్నిచోట్ల జగన్ పార్టీ అభ్యర్థులే గెలుస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆ అభ్యర్థుల మెజార్టీపై జోరుగా బెట్టింగులు కడుతున్నారట. అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్ అరెస్టు, నియోజకవర్గాల స్థానిక పరిస్థితులు తదితర కారణాల నేపథ్యంలో పలు నియోజకవర్గాలలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు పైనా, వారు సాధించే మెజార్టీ పైనా బెట్టింగులు కడుతున్నారని అంటున్నారు.

తిరుపతి, ఆళ్లగడ్డ, రామచంద్రాపురం, నర్సాపురం నియోజకవర్గాలలో గెలుపుపై కాంగ్రెసు ఆశలు పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ కూడా రాయదుర్గం, ఎమ్మిగనూరు, పాయకరావుపేట తదితర నియోజకవర్గాలలో గెలుపుపై ధీమాతో ఉంది. జగన్ అరెస్టు తర్వాత ప్రజల్లో సానుభూతి పెరిగినప్పటికీ స్థానిక నేతలలో రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెలరేగిందని, ఈ కారణంగా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు లాభపడతాయని పలువురు భావిస్తున్నారు. అందుకే నిన్నటి వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీని హాట్ ఫేవరేట్‌గా భావించిన ఫంటర్స్ ఇప్పుడు కొన్ని స్థానాలలో టిడిపి, కాంగ్రెసు వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.

ఎప్పటికప్పుడు మారిపోతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లు కూడా కాస్త గందరగోళానికి గురవుతున్నారని అంటున్నారు. తిరుపతిలో జగన్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డితో పాటు కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వెంకటరమణపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయట. కాంగ్రెసు అభ్యర్థికి చిరంజీవి ఇమేజ్ కలిసి రావచ్చునని భావిస్తున్నారని అంటున్నారు. రూ.10వేల నుండి రూ.2 లక్షల రూపాయలు అంతకంటే ఎక్కువను కాంగ్రెసు, జగన్ పార్టీ అభ్యర్థి గెలుపు పైన పెడుతున్నారని సమాచారం.

రామచంద్రాపురంలో కూడా కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులపైనే బెట్టింగులు జరుగుతున్నాయని అంటున్నారు. స్థానికంగా పిల్లి సుభాష్ చంద్రబోసుకు వ్యతిరేకత ఉందనే ప్రచారం ఉంది. అయితే జగన్ పైనున్న సానుభూతి అతనిని గెలిపిస్తుందా లేదా పిల్లి పైనున్న వ్యతిరేకత జగన్ పైనున్న సానుభూతిని కప్పివేస్తుందా అని పందెంరాయుళ్లు తికమక పడుతున్నారట. ఈ కారణంగా కాంగ్రెసు అభ్యర్థి తోట త్రిమూర్తులు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారట.

దీంతో అటు పిల్లి పైన ఇటు తోట పైన రూ.3వేల నుండి రూ.3 లక్షలు అంతకుమించి బెట్టింగ్ కడుతున్నారట. అనంతపురం రాయదుర్గంలో టిడిపి అభ్యర్థి దీపక్ రెడ్డి గెలుపు పైన భారీగానే బెట్టింగులు జరుగుతున్నాయంటున్నారు. ఇక తెలంగాణలోని పరకాల నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి గెలుపు పైనే ఎక్కువగా బెట్టింగులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆ తర్వాత కొండా సురేఖ, తెరాస అభ్యర్థి వైపు దృష్టి సారిస్తున్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+