'రాయల తెలంగాణ కాదు తెలంగాణ సీమ'

ముందుగా.. దామోదర్ రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను కలపి రాయల తెలంగాణ అని అనడం సరికాదన్నారు. తెలంగాణలో ఎక్కువ జిల్లాలున్నందున తెలంగాణ సీమగా పేర్కొంటే తమకు అభ్యంతరం లేదన్నారు. ఆ సమయంలో జెసి జోక్యం చేసుకుంటూ.. తెలంగాణ సీమ అంటారో.. ఇంకేమంటారో తమకు అనవసరమని, తమ ప్రాంతానికి నీటి వాటా దక్కేందుకు తెలంగాణతో కలిసేందుకు సిద్ధమన్నారు.
రాష్ట్రం ఒక్కటిగా ఉంటే నీటి కోసం ఎవరి గడ్డమైనా పట్టుకుని బతిమలాడేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పారు. విడిపోతే ఆ సౌలభ్యం ఉండదన్నారు. జానా రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందంటూ ఎవరి వాదనలు వారు విన్పిస్తున్నారే తప్ప ఇంత వరకూ ఎక్కడైనా ఎవరితోనైనా సంప్రదింపులు జరిగాయా? ఆ సంప్రదింపులు జరిగితే తప్ప ఒక నిర్ణయం వెలువడే అవకాశం లేదన్నారు.
దాంతో జెసి మళ్లీ కల్పించుకొని.. ఇప్పటికే ఏ నిర్ణయం తీసుకోనందున రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని, ఇప్పుడు అన్ని ప్రాంతాల వారూ ఏదో ఒక నిర్ణయం ప్రకటించాలని కోరుకుంటున్నారన్నారు. అనంతరం కృష్ణా డెల్టాకు నీటి విడుదల విషయంలో జానా రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చకు వచ్చాయి. డెల్టాకు నీటి విడుదల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని జానా రెడ్డి అన్నారు.
ఆ వ్యాఖ్యలలో పదాలను అర్థం చేసుకోకుండా ఎవరి అభిప్రాయాలను వారు రుద్దితే ఎలా అని ప్రశ్నించారు. మూడు ప్రాంతాల ప్రజల తాగు నీటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని తాను చెప్పానని .. సాగర్‌లో 510 అడుగులకు నీరు చేరిన వెంటనే నీటి విడుదలను ఆపేయాలని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. తాను ఈ వాదన లేవనెత్తడంలోనూ ఓ ఎత్తుగడ ఉందన్నారు.
రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే డెల్టాకు నీరిచ్చేందుకు అడ్డుపడితే.. విభజన జరిగితే ఇంకెక్కడ నీటిని విడుదల చేస్తారంటూ సీమాంధ్ర నేతలు తెలంగాణ రాకుండా అడ్డుకుంటారన్నారు. ఆ ప్రయత్నాలు చేయకుండా ఉండేందుకే ఆ విధంగా చెప్పానన్నారు. తాను సిఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అనలేదన్నారు.












Click it and Unblock the Notifications